‘ఉగ్ర’ కలకలం..! | terrorists terror | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ కలకలం..!

Published Fri, Jun 5 2015 11:46 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

terrorists terror

ముష్కరులు జిల్లాను షెల్టర్‌జోన్‌గా ఎంచుకున్నారా..? ఇక్కడినుంచే గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారా..? నకిరేకల్‌లో పోలీసులకు తపాకీ గురిపెట్టి తప్పించుకుపోయిన దుండగులు ఉగ్రవాదులేనా..? అన్న ప్రశ్నలకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో ఇంకెతమంది ముష్కరులు తలదాచుకున్నారు...? ఏ విధ్వంసానికి పాల్పడేందుకు వ్యూహరచన చేస్తున్నారు...? ఇలాంటి ప్రశ్నలు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నల్లగొండ ఉగ్రనీడలో ఉన్నట్టు వస్తున్న అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
- నకిరేకల్
 
 నల్లగొండ జిల్లా మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల నకిరేకల్ పట్టణంలో పోలీసులపై తుపాకీ గురిపెట్టి తప్పించుకుపోయిన దుం డగులు ఉగ్రవాదులేనని అనుమానాలు బలపడుతున్నాయి. జిల్లా కేంద్రంలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసి నకిరేకల్ నుంచి తప్పించుకున్న దండగులను ఉగ్రవాదులుగా గుర్తించారు. వారి ఉహాచిత్రాలను జిల్లా పోలీసు లు విడుదల చేసిన విషయం విధితమే. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఉహాచిత్రాల ఆధారంగా ముష్కరులు నిజామాబాద్,వరంగల్ జిల్లాలో సంచరిస్తున్నట్లు సెల్‌ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రంగానికి సమాచారం అందించారు.

దీంతో  నల్లగొండ,నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు ఆ జిల్లాలో సంచరిస్తున్నట్టు శుక్రవారం పలు టీవీ చానల్స్‌లో ప్రసారం కావడంతో జిల్లా పోలీసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఇటీవల సూర్యాపేట, నకిరేకల్‌లో పోలీ సులపై తూపాకులు ఎక్కు పెట్టిన సంఘటనలు, తాజాగా టీవీల్లో నకిరేకల్‌లో తప్పించుకుపోయిన దుండగులు .. దొంగలు కాదు ఉగ్రవాదులేనని, వారి ఉహా చిత్రాలతో మీడియాలో టెలికాస్ట్ కావడంతో జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నకిరేకల్ ఘటనే చర్చించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఆ దుండగుల ఆచూకీ కోసం నిజామాబాద్, వరంగల్, నల్లగొండ  జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టు సమాచారం.

  జిల్లాలో ఇంకా ఉన్నారా..?
 సూర్యాపేట, నకిరేకల్‌లో పోలీసులపై తూపాకులు ఎక్కుపెట్టిన సంఘటనలతో పరిశీలిస్తే జిల్లాలో ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా ఎప్పుడు.. ఏక్షణాన.. ఎక్కడ ఉగ్రవాదులు తెగబడతారా అనే ఆందోళన కూడా అటు పోలీసువర్గాలను, జిల్లా ప్రజలను వెంటాడుతోంది.  

 మీడియా కథనాలను కొట్టిపారేస్తున్న పోలీసులు
 కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు సమాచారంతో అప్రమత్తమైన రాష్ట్ర, జిల్లా పోలీసులు మాత్రం తాజా మీడియా కథనాలను కొట్టి పారేస్తున్నారు. ఇదంతా మీడియా కట్టు కథ అంటున్నారు.ఆకథనంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, నకిరేకల్‌లో తప్పించుకుపోయిన దుండగులు అంతర్‌రాష్ట్ర దొంగలేనంటున్నారు.
 
 ఇటీవల సంఘటనలతో ఉగ్రవాదులుగా అనుమానాలు
 జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు వస్తున్న అనుమానాలకు నకిరేకల్ సంఘటన బలం చేకూరుస్తోంది. గడిచిన రెండు మాసాల క్రితమే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సూర్యాపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీల సమయంలో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించగా వారి ముఠాలో ఇంకొందరు కూడా ఉండొచ్చని ప్రచారం జరిగింది. నకిరేకల్‌లో గత నెల 26 వతేదీన పోలీసులపైకి తుపాకీ గురిపెట్టి పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఘటన స్థలాన్ని హైదరాబాద్ డీఐజీ కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కోసం  రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. గతంలో సూర్యాపేట, మోత్కూర్ మండలం జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పులలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టిన విషయం మర్చిపోక ముందే తాజాగా జిల్లాలోని నకిరేకల్ నడిబొడ్డున మరోసారి ఇద్దరు దుండగులు పిస్టల్‌తో వచ్చి కలకలం రేపారు.

సూర్యాపేట ఘటన విషయంలో కూడా ఉగ్రవాదుల ముఠాలో ఇద్దరు మాత్రమే ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇంకా మిగతా వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన వారి ఆచూకీ లభించలేదు. నకిరేకల్‌లో పిస్టల్‌తో పోలీసులపైకి గురి పెట్టడంపై ఆ ముఠాకు చెందిన వారే ఇంకా జిల్లాలో పర్యటిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement