ఆ ఆనవాళ్లకు ఏడాది..
ఆలేరు : 2015 ఏప్రిల్ 7వ తేదీ నల్గొండ జిల్లా ఆలేరుకు మర్చిపోలేని రోజు.. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న పట్టణ శివారులో ఒక్కసారిగా తుపాకుల మోత.. చూస్తే పేరుమోసిన ఉగ్రవాది వికారుద్దీన్ అహ్మద్ అలియాస్ అలీఖాన్, అతడి నలుగురు అనుచరుల ఎన్‌కౌంటర్.. మీడియా హడావిడి.. జనాల్లో భయం.. క్షణాల్లో దేశం మొత్తం హై అలర్ట్.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా ఉన్న ఆలేరులో ఈ ఎన్‌కౌంటర్ అప్పట్లో సంచలనం రేపింది.. ఆలేరు ప్రజలను వదలని ఆ ఆనవాళ్లు..భయాలకు నేటికి ఏడాది..
కోర్టుకు తీసుకెళ్తుండగా...
వరంగల్ జిల్లా కేంద్ర కారాగరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న వికారుద్దీన్ అహ్మద్, గుజరాత్ నుంచి వచ్చి ముషిరాబాద్‌లో స్థిరపడిన యునానీ వైద్యుడు మహ్మద్ అనీఫ్, మహ్మద్ జాకీర్, సయ్యద్ అమ్జల్, హిజంఖాన్‌లను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్తున్నారు. వరంగల్ జిల్లా పెంబర్తి దాటిన తరువాత ఆలేరు మండలం టంగుటూరు గ్రామ శివారులోకి ప్రవేశిస్తున్న క్రమంలో మూత్రవిసర్జన చేస్తామని చెప్పిన ఉగ్రవాదులు పోలీసుల చేతులో నుంచి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్ అతడి నలుగురు అనుచరులు చనిపోయారు.
కాల్చి చంపారని ఫిర్యాదు...
తన కుమారుడిని పోలీసులే కాల్చి చంపారని, వికారుద్దీన్ తండ్రి ఆలేరు పోలీస్ స్టేషన్ లో 11-04-2015న ఫిర్యాదు చేశారు. 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఐజీ సందీప్‌శాండిల్యా నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మే నెల 7, 8వ తేదీల్లో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో నల్గొండ ఆర్డీవో వెంకటచారి నేతృత్వంలో విచారణ చేపట్టారు. విచారణకు 19 మంది హాజరయ్యారు. జూలై 14, 30వ తేదీల్లో మరోమారు విచారణ చేపట్టారు. చివరగా ఆగస్టు 12, 2015న నల్గొండలో విచారణ నిర్వహించారు.
కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్...
వికారుద్దీన్‌కు పోలీసులు అంటే ద్వేషం. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను, హోంగార్డును హతమార్చాడు. 2009 మే 18న ఫలక్ సుమా పీఎస్ పరిధిలో నాగులబండ వద్ద కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, హోంగార్డు బాలస్వామిని కాల్చివేశాడు. ఈ కాల్పుల్లో బాలస్వామి చనిపోగా, రాజేంద్రప్రసాద్ కంటిచూపు దెబ్బతిన్నది. 2010 మే 14న శాలిబండలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేశ్ ఛాతీపై వికారుద్దీన్ పిస్తల్‌తో కాల్చాడు. ప్రాణాలను రక్షించుకునేందుకు రమేశ్ పరిగెత్తుతుండగా వికారుద్దీన్ అనుచరుడు అమ్జత్ కాల్చడంతో చనిపోయాడు.
ఎన్నో కేసులు...
వికారుద్దీన్ దోపీడీలకు కూడా పాల్పడేవాడు. 2003లో మలక్‌పేటలో ఈ-సేవ కేంద్రం సిబ్బందిని బెదిరించి రూ. 2.68 లక్షల్ని దోచుకున్నాడు. సంవత్సరం డిసెబంర్ 6న సంతోష్‌నగర్‌లోని ఈ-సేవ కేంద్రంతో గన్ తో బెదిరించి రూ. 1.62 లక్షలను ఎత్తుకెళ్లాడు.
2007లో సయ్యద్ అమ్జత్ ఆలీతో కలిసి బంజారాహిల్స్‌లోని ఈ-సేవ కేంద్రంలో తుపాకులతో బెదిరించి రూ. 2.4 లక్షలను ఎత్తుకెళ్లాడు.
2007, నవంబర్ 21న అమ్జత్ ఆలీతో కలిసి సరూర్‌నగర్‌లోని ఈ-సేవ కేంద్రంలో రూ. 3.25 లక్షలను
దోచుకెళ్లాడు.