నల్లగొండ జిల్లాలో హై అలర్ట్
నల్లగొండ జిల్లాలో హై అలర్ట్
Published Mon, Aug 8 2016 11:32 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ క్రైం ః
గ్యాంగ్‌స్టర్ నయీం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం నయీం కుటుం సభ్యులు, వారి అనుచరులు, గ్యాంగ్‌లో ఉన్న ముఠా సభ్యుల ఇళ్లలో కూడా పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రత్యేక పోలీస్ బలగాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నయీం గ్యాంగ్ సభ్యులతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి తపంచ, ల్యాప్‌టాప్‌లు, విలువైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం అనుచరులుగా భావిస్తున్న వారంతా ఎన్‌కౌంటర్ సమాచారం తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా అంతటా వారి ములాలను వెతికి పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అత్యంత జాగ్రత్తగా ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా నయీంతో సంబంధం ఉన్న వారితో పాటు వారి ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తోంది. మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, భువనగిరి, నల్లగొండలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. మిర్యాలగూడలో నయీం అత్త, బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ వెంకటేశ్ యాదవ్, యాదగిరిగుట్టలో మరికొందరిని, నల్లగొండ నయీం చిన్నమ్మ కూతురు అస్మత్ బేగం ఇంట్లో డీఎస్పీ సుధాకర్ సోదాలు నిర్వహించారు. ఈమె ఇంట్లో ల్యాప్‌టాప్, విలువలైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఓ మహిళా పెరాలసిస్‌తో విశ్రాంతి తీసుకుంటుంది. నయీంకు వరుసకు అత్త అయి ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. నయీం అనుచరుడైన టమాట శ్రీను ఇంట్లో తపంచను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నయీం గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
భువనగిరికి ప్రత్యేక బృందం
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు భువనగిరికి చేరాయి. వీరిలో స్పేషల్ పార్టీ పోలీసులతో పాటు, ఎస్బీ, ఐడీ పార్టీ పోలీసులు ఉన్నారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కొందరు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తూ అనుచరుల కదలికలను డేగ కన్నుతో నిఘా వేశారు.
అండర్‌గ్రౌండ్‌లోకి నయీం అనుచరులు...
నయీం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో అతని అనుచరులు సమాచారం తెలిసిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. సెల్‌ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకుని అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ ప్రాంతంలో ఉన్నా పట్టుకు వచ్చేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కేసులో ఎవరున్నారనే దానిపై విచారిస్తున్నారు. హత్య కేసులే కాకుండా భూ దందాల సెటిల్‌మెంట్, బెదిరింపుల్లో వారి పాత్రను విచారిస్తున్నారు.
వీరి ఇళ్లలో సోదాలు..
నయీం అనుచరులుగా భావిస్తున్న జిల్లా కేంద్రంలోని ఏడుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ పోలీసులు నయీం గ్యాంగ్ ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఓ ఇంట్లో తపంచ దొరకడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేస్తున్నారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement