శ్రీనగర్: కశ్మీర్‌లోకి 20 మందికిపైగా ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరు కశ్మీర్‌లోయతో పాటు ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశముందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కశ్మీర్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి పీర్‌పంజాల్ పర్వతశ్రేణి ద్వారా కశ్మీర్‌లోకి చొరబడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వీరందరూ చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వచ్చారని వెల్లడించారు.
ఉగ్రవాదుల వద్ద భారీఎత్తున పేలుడుపదార్థాలు, ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇంత భారీస్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇస్లాం విస్తరణకు కీలకంగా నిలిచిన బద్ర్ యుద్ధం ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం శనివారం (రంజాన్ నెల 17వ రోజు) జరిగింది. అందుకే ఈరోజు వారు విధ్వంసం సృష్టించే అవకాశముంది. కీలకమైన సైనిక స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కశ్మీర్‌లో గ్రెనేడ్ దాడి
నిఘావర్గాలు హెచ్చరించిన కొన్నిగంటల్లోనే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో అధికార పీడీపీ నేత, త్రాల్ ఎమ్మెల్యే ముస్తాక్ షా ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ ఇంట్లోని పచ్చిక ప్రాంతంలో పేలడంతో ఎవ్వరికీ గాయాలుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment