నల్లగొండ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా నిర్థారించినట్లు తెలుస్తోంది. పానగల్లో తప్పించుకున్న ఇద్దరు యువకులు.. ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ప్రకటించారు.
కాగా మే 26వ తేదీన నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు పిస్టల్‌తో హల్‌చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు.
ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్‌యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది.
ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. దాంతో ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు యువకులు... దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.