సాక్షి, నకిరేకల్: పని ఒత్తిడితో నెలరోజులుగా విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న ఓ వీఆర్వో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నకిరేకల్ మండలం నోముల గ్రామ వీఆర్వోగా శాలిగౌరా రం మండలం తక్కళ్లపాడుకి చెందిన మొగిలి సోమనర్సయ్య(53) పనిచేస్తున్నాడు. గతంలో ఇతను శాలిగౌరారం, కేతేపల్లి, మునుగోడు మండలాల్లో పని చేశాడు. 5 నెలల క్రితం మునుగోడు నుంచి నకిరేకల్ మండలం నోములకు బదిలీపై వచ్చాడు. ఇదే మండలంలోని పన్నాలగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల భూ సమస్యలు అధికంగా వస్తుండడంతో పని ఒత్తిడి పెరిగింది. కాగా, అతను విధులకు సరిగా హాజరుకాకపోవడంతో అధికారులు ఇటీవల కలెక్టర్‌కు సరెండర్ చేశారు.
దీంతో సోమనర్సయ్య నెల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలకు భార్యకు చెప్పి బయటకువెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి 100కు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ జంగయ్య మాట్లాడుతూ సోమనర్సయ్య నెల నుంచి విధులకు రావడం లేదని, దీంతో కలెక్టర్‌కు సరెండర్ చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment