గుంటూరులో బుధవారం తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్
సాక్షి, అమరావతి/గుంటూరు: శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు డీజీపీ ఠాకూర్ బుధవారం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, ఓడ రేవులు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సముద్రతీరాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, హోటల్స్, జనం ఎక్కువగా చేరే స్థలాల వద్ద బాంబు స్క్వాడ్‌లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ మసీదులు, చర్చిలు, ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలు, కేంద్ర సంస్థలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వద్ద స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఏఏ ప్రాంతాల్లో అలజడులు, అసాంఘిక శక్తుల కదలికలు ఉండే అవకాశం ఉందో గుర్తించాలని సూచించారు. ఆర్మ్‌డ్ కౌంటర్ యాక్షన్ పోలీస్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చాలా కేసుల్లో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా ఉపయోగపడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బందోబస్తు పరంగా పలు ప్రాంతాల్లో ఉన్న వైఫల్యాలను గుర్తించి వాటిని నెల రోజుల్లో చక్కదిద్దుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రజలతో పోలీసులు మంచి సంబంధాలు పెంచుకోవాలని సూచించారు.
భద్రతా చర్యలపై నెల రోజుల్లో సమీక్ష: డీజీపీ
వీడియో కాన్ఫరెన్సు అనంతరం డీజీపీ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్‌లకు పలు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మరో నెల రోజులు తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏమేరకు తీసుకున్నారో అనే విషయాలను సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. సమావేశంలో డీజీపీతోపాటు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్, పీఅండ్‌ఎల్ ఏడీజీ హరీష్‌కుమార్ గుప్త పాల్గొన్నారు.
రాజధానిలో హై అలర్ట్
ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాత్కాలిక సచివాలయంతోపాటు, హైకోర్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అక్కడకు వెళ్లే అన్ని రహదారుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. అనుకోని సంఘటన జరిగితే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉగ్రవాద కదలికలపై ఆరా తీస్తున్నారు. మత పెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన గుంటూరు అర్బన్ పోలీసులు మసీదులు, చర్చిలు, దేవాలయాల వద్ద అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసేలా మత పెద్దలకు సూచిస్తున్నారు. లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment