సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : మహారాష్ట్రలో 3 రోజుల పాటు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్–ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 37కు చేరింది! వీరిలో 19 మంది మహిళలున్నారు. 38 ఏళ్ల పీపుల్స్‌వార్, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఇదే భారీ ఎన్‌కౌంటర్! ఈ దెబ్బకు స్థానిక, జిల్లా, డివిజన్ కమిటీలు తుడిచి పెట్టుకుపోయినట్టు భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి వద్ద ఎదురుకాల్పుల్లో 26 మంది మావోలు మృతి చెందడం తెలిసిందే.
మూడు బృందాలతో ముప్పేట దాడి సౌత్ గడ్చిరోలిలోని కాసన్‌పూర్ సమీపంలో బామ్రాగఢ్–బొరియా అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి 40 మందితో మావోయిస్టు రీజియన్ కమిటీ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఎదురు కాల్పులు జరుగుతుండగా గుంపుగా పారిపోయే ప్రయత్నంలో 16 మంది మావోలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారిని తరుముతూ ధనోరా, బామ్రాగడ్, జిమ్మలగట్టు జింగనూరు, ఇంద్రావతి పరివాహక ప్రాంతాలను దిగ్బంధించి బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 15 మంది మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
అంతకుముందు సోమవారం సాయంత్రం జిమ్మలగట్టు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు మావోలు మృతిచెందారు. ఈ మొత్తం ఆపరేషన్లలో 37 మంది మావోయిస్టులు మరణించారని మహారాష్ట్ర యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఐజీ కనకరత్నం వెల్లడించారు. ఆపరేషన్ తాడ్గాంలో 31 మంది, ఆపరేషన్ రాజరాంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ‘‘దక్షిణ గడ్చిరోలిలో మావో దళాలను పూర్తిగా తుడిచిపెట్టాం. ఐరి, పరిమల, సిరొంచ, కొట్ట దళాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు ఏకే 47, రెండు ఎస్‌ఎల్‌ఆర్, ఒక 3.3, ఐదు 8 ఎంఎం, ఆరు 12 ఎంఎం తుపాకులు, భారీగా మందుగుండు స్వాధీనం చేసుకున్నాం’’ అని చెప్పారు.
అగ్రనేతలనుకుని హంగామా...
ఏకంగా 37 మంది మావోలు మరణించడం, సీఆర్‌పీఎఫ్–కోబ్రా బలగాలు భారీగా హంగామా నేపథ్యంలో అగ్ర నేతలు నేలకొరిగారన్న వార్తలు విన్పించాయి. అయితే మృతుల్లో రీజినల్ కమిటీ సభ్యులు, గడ్చిరోలి నార్త్, సౌత్ జిల్లా కమిటీలు, స్థానిక కమిటీ సభ్యులే ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆదివాసీలను తీసుకెళ్లి చంపారని, పార్టీ సభ్యులుగా ముద్రవేసి ఏకపక్షంగా హతమార్చారని విప్లవ సంఘాలు దుయ్యబట్టాయి.
17 మంది గుర్తింపు
37 మంది మృతుల్లో 17 మంది పేర్లను మంగళవారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ 17 మందిపైనే 1.6 కోట్ల రివార్డుంది! వీరిలో ప్లాటూన్ దళ కమాండర్ క్రాంతి తదితరులున్నారు.
1. క్రాంతి - పశ్చిమబస్తర్
2. లత ఉరఫ్ మాధురి దల్లువడ్డే – మిట్టుగువంచా
3. కార్తీక్ ఊయికే – పామ్‌కేకటేజరీ
4. నందు ఉరఫ్ విక్రమ్ ఉరఫ్ వాసుదేవ్‌బిచ్చాఆత్రమ్ – అర్కపల్లి
5. జయశీల గావ్డె – పినిగుండా
6. గుర్తు తెలియని మహిళ
7. సాయినాథ్ ఉరఫ్ డోలేష్‌మాదీఆత్రమ్ – గట్టెపల్లి
8. రాజేశ్ ఉరఫ్ దామారాయిస్ నరూటీ – మురగావ్
9. సుమన్ ఉరఫ్ జన్నీకుట్టేటీ – పడ్తన్
10. శాంతాబాయి ఉరఫ్ మంగ్లీపదా – గంగలూర్
11. నగేష్ ఉరఫ్ దుల్సాకన్నా నరోటే – జారేవాడా
12. తిరుపతి ఉరఫ్ ధర్మ్‌పుంగాటి – కేహకాపరి
13. శ్రీకాంత్ ఉరఫ్ దుల్సా ఉరఫ్ రానునారోటే – మోర్‌కండీ
14. రాజు ఉరఫ్ రమేశ్ ఉరఫ్ నరేష్‌కుట్‌కే – జిజగావ్
15. సన్ను ఉరఫ్ బిచ్చుబొట్కాగావ్డే – కోరెపల్లి
16. శ్రీను ఉరఫ్ శ్రీకాంత్ ఉరఫ్ రావత్ విజేంద్ర – చల్లాగ్రీగ్
17. అనిత ఉరఫ్ బాలీరాంజీ మడావీ – కరంపల్లి
Comments
Please login to add a commentAdd a comment