అడవంతా జల్లెడ! | Peoples Liberation Guerrilla Army Varotsavalu Telangana Police High Alert | Sakshi
Sakshi News home page

అడవంతా జల్లెడ!

Published Wed, Dec 2 2020 4:31 AM | Last Updated on Wed, Dec 2 2020 4:41 AM

Peoples Liberation Guerrilla Army Varotsavalu Telangana Police High Alert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ మల్హర్‌: తెలంగాణలో గెరిల్లా ఆర్మీ (మెరుపుదాడులకు దిగే ప్రత్యేక దళాలు)ని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించా రనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమ య్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో మావోల వేటను ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడు తున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు డిసెం బరు 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్‌ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. 

ఓవైపు ప్రతిష్టాత్మకమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ... మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్‌ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నారు. వీరికితోడుగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి.

రాష్ట్రాల సరిహద్దులపై నిఘా..
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇదేవిధంగా మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 

పీఎల్‌జీఏది ప్రత్యేకస్థానం
మావోయిస్టు పార్టీలో పీఎల్‌జీఏకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ ఏడాది ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని, తెలంగాణలో ఈ విభాగాన్ని పటిష్టం చేయాలని అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్పులు, బాంబు పేలుళ్లు, ఆంబుష్‌ దాడులు నిర్వహించడంలో ఈ విభాగానికి ప్రావీణ్యం ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిషా అరణ్యాలలో ఎంతో పటిష్టంగా ఉన్న పీఎల్‌జీఏ విభాగాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని, కొత్త యువకులను ఆకర్షించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా, ఒడిషా, చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్‌జీఏ వారోత్సవాల్లో పాల్గొంటారని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి పంథా అనుసరిస్తారన్న విషయంలో పోలీసులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇంటిలిజెన్స్‌ విభాగం ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమైంది.

తృటిలో తప్పించుకున్న కంకణాల
తెలంగాణలో వేళ్లూనుకునేందుకు యత్నిస్తోన్న మావోయిస్టులు గోదావరి, ప్రాణహిత పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. ఆదివాసీల సాయంతో ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఇలాంటి వారిలో మావోయిస్టు కొత్తగూడెం డివిజన్‌ కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఒకరు. ఇతని దళం గతవారం కూంబింగ్‌ చేస్తోన్న పోలీసుల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. పక్కా సమాచారంతో కూంబింగ్‌లోకి దిగిన పోలీసులకు కాటారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగారం రిజర్వ్‌ఫారెస్ట్‌లో రాజిరెడ్డి దళం ఎదురుపడింది. పోలీసులను చూస్తూనే వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇరుపక్షాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. వీరు గోదావరి నది దాటి చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నల్లా, ఎర్రం, శీలంల... యాదిలో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో 21 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మల్హర్‌ మండలం కొయ్యూర్‌ అటవీ ప్రాంతంలో 2 డిసెంబర్‌ 1999న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పటి పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్‌ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్‌ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్‌ అలియాస్‌ మురళి నేలకొరిగారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో నక్సల్స్‌ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ముఖ్యనేతలు మరణించడం ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తారు. ఈ ముగ్గురు నేతలు మరణించాక సరిగ్గా ఏడాదికి డిసెంబరు 2, 2000న పీఎల్‌జీఏను ఏర్పాటు చేశారు. వారికి నివాళిగా ఏటా డిసెంబర్‌ 2 నుంచి మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మృతుల స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్ట్‌ నాయకులు 53 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్‌ 13న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement