దక్షిణ కశ్మీర్‌లో సైన్యం కార్డన్ సెర్చ్
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు ఇళ్లలో నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌లతో కూడిన దళాలు షోపియాన్‌లోని 20కి పైగా గ్రామాల్లో గురువారం కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి.
హెలికాప్టర్లు, డ్రోన్లతో గగనతలం నుంచి గాలిస్తుండగా.. 4 వేల మందికి పైగా సైనికులు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోపియాన్‌లోని చౌదరి గుండ్, కెల్లార్ ప్రాంతాల్లో రివర్స్ స్వీప్ (కూంబింగ్ అనంతరం మరోమారు అకస్మాత్తుగా సోదాలు చేపట్టడం) చేస్తుండగా.. నక్కి ఉన్న మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడికి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న దళాలు చుట్టుపక్కల ఉన్న బృందాలకు సమాచారమిచ్చి.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయాలపాలైన పౌరుడు కొద్ది సేపటి తర్వాత మృతిచెందాడు.