
పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం..!
మావోయిస్టులకు సానుభూతిపరులుగా పని చేస్తూ.. వారికి సహకరిస్తున్నారనే అనుమానంతో పోలీసులు ఇద్దరు ....
► మావోయిస్టులకు సహకరిస్తున్నారని..!
► ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
► విచారణ పేరిట చిత్రహింసలు?
► క్రిమిసంహారక మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నం
► మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స
దహెగాం :మావోయిస్టులకు సానుభూతిపరులుగా పని చేస్తూ.. వారికి సహకరిస్తున్నారనే అనుమానంతో పోలీసులు ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోని వారిని విచారణ చేపట్టారు. దీంతో ఖాకీల దెబ్బలు తట్టుకోలేక ఒకరు ఆత్మహత్యాయత్నంచేసుకున్న సంఘటన శనివారం మండలంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన సిడాం శ్రీనివాస్, పేపర్‌గాం గ్రామానికి చెందిన కుడ్మెత సుగుణయ్య రైతులు. వీరు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో దహెగాం పోలీసులు తీసుకొచ్చారని విశ్వసనీయ సమాచారం.
అదుపులో తీసుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు..? వారికి మీరు సహకరిస్తున్నారా? వారి డంప్ ఎక్కడ ఉందని చితక బాదడంతో దెబ్బలను భ రించలేక సిడాం శ్రీనివాస్ ఫలాన చోట మావోయిస్టుల డంప్ ఉందని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. శనివారం రావులపల్లికి సమీపంలోని వ్యవసాయ పొలంలోకి పోలీసులను తీసుకెళ్లి.. పొలంలోని చేనులో ఉన్న మంచం ఎక్కి పురుగుల మందు తాగినట్లు గ్రామస్తుడొకరు చెప్పాడు.
మందు తాగిన వ్యక్తిని పోలీసులే చికిత్స నిమిత్తం.. బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసుల అదుపులో ఉన్న కుడ్మెత సుగుణయ్య స్థానిక పోలీస్టేషన్‌లో ఉండగా అతన్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియరాలేదు.
అనుమానాస్పదంగా కనిపించాడు..
మేం కూంబింగ్ కోసం వెళ్లి వస్తుంటే శ్రీనివాస్ అనుమానాస్పదంగా కన్పించాడు. అతన్ని విచారిస్తుండగానే పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాం. - దీకొండ రమేశ్, ఎస్‌ఐ, దహెగాం