► కూంబింగ్ ముమ్మరం
►అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు
► అజ్ఞాతంలో ఉన్న వారి ఫొటోలతో పోస్టర్లు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. చాపకింద నీరులా సాగుతున్న కార్యకలాపాల్ని తుంచి పడేసేందుకు తగ్గ అస్త్రాలతో ప్రత్యేక బలగాలు అడవుల్లో జల్లెడ పట్టే పనిలో పడ్డాయి. అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోయిస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ నాయకుడు నవీన్ ప్రసాద్ హతం కావడంతో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు క్రమంగా తగ్గాయి. రాష్ట్రంలో మావోయిస్టులు అన్న పేరుకు ఆస్కారం లేని విధంగా, ఉక్కు పాదంతో అణచి వేశారు. ఈ పరిస్థితుల్లో కొన్నేళ్లుగా చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని అణచివేయడానికి సాగుతున్న ఎన్‌కౌంటర్ల పర్వంతో రాష్ట్రంలో మళ్లీ ఆ పేరు తెర మీదకు వచ్చింది.
మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్టుగా సంకేతాలు బయలు దేరాయి. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ మొదలెట్టారు. అదే సమయంలో గత ఏడాది అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, ఈ ఘటనకు నిరసనగా కేరళ సరిహద్దుల్లో దాడులు సైతం చోటు చేసుకోవడంతో గాలింపు తీవ్రతరం అయిది. క్రమంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతూ వచ్చారు. దీంతో పశ్చిమ పర్వత శ్రేణుల్ని అడ్డాగా చేసుకుని మరెందరు దాగి ఉన్నారో, జనం మధ్యలో ఇంకెందరు తిష్ట వేసి ఉన్నారో అన్న అనుమానాలు బయలు దేరాయి. ఈనేపథ్యంలో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఓబీ లో ఎన్‌కౌంటర్ల పర్వం సాగుతుండడం, మావోయిస్టుల మృతుల సంఖ్య పెరగడం, మరెందరో తప్పించుకుని ఉడాయిస్తుండడంతో రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు.
అక్కడి నుంచి తప్పించుకు వచ్చే వారికి ఇక్కడ నక్కి ఉన్న వాళ్లెవరైనా ఆశ్రయం కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని, మా వోయిస్టుల మధ్య సమాచార సంబంధాలు ఉన్న నేపథ్యంలో ముం దు జాగ్రత్త చర్యగా వేటను ముమ్మరం చేసే పనిలో క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు సిద్ధమయ్యాయి. గురువారం ఉదయం నుంచి అడవుల్లోకి ఈ బలగాలు చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డాయి. జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపు వచ్చే వాహనాలను, అందులో ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. ప్రధానంగా నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూరుల మీదుగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అటవీగ్రామాల్లో అనుమానితుల సంచారంపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ ఫోన్ నం బర్లను ఇచ్చే పనిలో పడ్డారు.
అలాగే, జన సంచారం అత్యధికంగా ఉండే అటవీ గ్రామాల సరిహద్దుల్లోని పట్టణాల్లో అజ్ఞాతంలో ఉన్న ముప్పైకు పైగా మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించి ఉన్నారు. ఇక, నీలగిరి జిల్లాల్లో అయితే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్ టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి తదితర కేరళ సరిహద్దు చెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అనుమానితులను విచారించి, వారి వివరాల సేకరణ అనంతరం వదలిపెడుతున్నారు.
మావోల వేట
Published Fri, Oct 28 2016 2:57 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement