శేషాచలంలో కట్టుదిట్టమైన భద్రత
తిరుపతి మంగళం(చంద్రగిరి): శేషాచల అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశిస్తున్న కూలీలను నిలువరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీఎఫ్ బీ.ఎన్.ఎన్. మూర్తి వెల్ల డించారు. బుధవారం ఆయన టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలసి శేషాచలంలోని అన్నదమ్ముల బండ, మామిళ్లమంద, చామలరేంజ్ ప్రాంతాల్లో ఆయన కూంబింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలు ప్రవేశించే మార్గాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
బాలపల్లె రేంజ్‌ను నుంచి ఎక్కువగా ఎర్రదొంగలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కూలీలు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఆయన పరిశీలించారు. శేషాచలంలోకి అనేక మార్గాల ద్వారా కూలీలు అక్రమంగా చొరబడుతున్నట్లు ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం తో కూంబింగ్‌కు పూనుకుని కూలీలు ప్రవేశించకుండా చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ భాస్కర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.