న్యూ ఇయర్‌కి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం బంపర్ బహుమతిని తీసుకొస్తుంది. అది స్వదేశీయులకు కాదండోయ్ విదేశీయులకు. విదేశాల నుంచి భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇక నుంచి సిమ్ కార్డులు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం కానుకగా వారికి వీటిని అందించనుంది. మొత్తం పన్నెండు విమానాశ్రయాల్లో దాదాపు 161 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ సిమ్ కార్డులను ఇవ్వనుంది.
పంజిమ్, అహ్మదాబాద్, అమృత్ సర్, జైపూర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, లక్నో, ఢిల్లీ, వారణాసి విమానాశ్రయాల్లో ఈ సర్వీసులను హోంశాఖ అందించనుంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల రక్షణ కోసమే ఈ సిమ్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఎస్ఎన్‌ఎల్ సౌజ్యనంతో ఉచితంగా ఈ ప్రి-లోడెడ్ సిమ్ కార్డులను అందించే కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభించనున్నారు. ఈ వీసా ద్వారా వచ్చే వారికి ఈ సౌకర్యం అందిస్తారు. దీనిని తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.