హైదరాబాద్‌లో నిఘా పెంచాలి...
- రాజ్‌నాథ్‌ను కోరిన దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలు, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో నిఘాను పెంచాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు సహకరించే రాజకీయ పార్టీలు, సంస్థలపై నిఘా పెంచి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జలసంఘం సలహాదారులు శ్రీరాం వెధిరె, బీజేపీ నేత కె.దిలీప్ కుమార్‌తో కలిసి దత్తాత్రేయ రాజ్‌నాథ్‌కు వినతి పత్రం అందచేశారు.
ఐఐఎం ఏర్పాటు చేయాలి..: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీని కోరారు. రాష్ట్రంలో ఒక్క మహిళా యూనివర్సిటీ కూడా లేదని, ఉస్మానియా మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని మంగళవారం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు ఏర్పరచాలని విన్నవించారు.