సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాపై కమల దళం కన్నేసింది. ఎన్నికల్లో పోటీకి కాలుదువ్వుతోంది. సుదీర్ఘకాలంగా జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో పట్టు నిరూపించుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని జిల్లా నాయకత్వం చూస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ.. ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి.. గెలుపు తీరానికి తీసుకెళ్లేందుకు పూనుకోవాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది.
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులకు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలతో సమాలోచనలు జరిపి.. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరో వారం పది రోజుల్లో బండారు దత్తాత్రేయ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజులపాటు మకాం వేసి.. పార్టీ పటిష్టతపై చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కార్యకర్తలతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు.. ఖమ్మం, పాలేరు జనరల్ స్థానాలు కాగా, వైరా ఎస్టీ, సత్తుపల్లి, మధిర ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. సాధారణంగా అన్ని రాజకీయ పక్షాల మాదిరిగా జిల్లాలోని జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీలో పోటీ ఎక్కువగానే ఉంది. పార్టీలోని సీనియర్, రాష్ట్రస్థాయి నాయకులు ఈసారి ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతుండడంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
బూత్ కమిటీలకు శ్రీకారం
కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్‌లవారీగా కమిటీలు వేసే ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 700 పోలింగ్ బూత్ కమిటీలను 5 నుంచి 20 మంది సభ్యులతో కలిపి ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి ఎన్నికల పొత్తు ఉండడం, ఆ కారణంగా బీజేపీ ఉమ్మడి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసింది. అక్కడ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య పోటీ చేసి ఓడిపోయారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ.. టీడీపీ అభ్యర్థులకు మద్దతు పలికింది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కార్యకర్తల్లో కొంత నిస్తేజం నెలకొంది. పార్టీని విస్తృతపరిచే చర్యల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఈసారి పోటీ చేయాలని నిర్ణయించిన బీజే పీ అందుకు తగ్గట్లుగా అన్ని రాజకీయ పక్షాలకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది.
ఖమ్మం నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉప్పల శారద, పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, గంటెల విద్యాసాగర్, పరుచూరి నాగఫణిశర్మలతోపాటు పలువురు నాయకులు టికెట్ కో సం పోటీ పడుతున్నారు. ఇక పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గానికి చెందిన నాయకుడు నారాయణ, పారిశ్రామికవేత్త కందుల నరేందర్‌దత్తు తదితరులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మధిర నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన విజయరాజుతోపాటు మాజీ పోలీస్ అధికారులు బాబురావు, జక్కయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి సినీ నటి రేష్మ రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలోని కారేపల్లి ఆమె స్వగ్రామం కావడంతో వైరా సీటు తనకు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నంబూరి రామలింగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖారారు చేసింది. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఆయన పేరుంది.
Comments
Please login to add a commentAdd a comment