గురువారం హైదరాబాద్‌లో పొత్తు కుదిరిన అనంతరం లక్ష్మణ్, బండారు దత్తాత్రేయకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు కుదిరింది. ఇప్పటికే మహాకూటమి పొత్తుల చర్చ జరుగుతుండగా, తాజాగా బీజేపీతో కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు పార్టీల ముఖ్య నేతలు గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అనంతరం వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. యువ తెలంగాణ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతలకు వారి అభిప్రాయా న్ని తెలియజేసినట్లు సమాచారం.
అయితే 8 స్థానా లు కాకపోయినా కొన్ని స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో యువ తెలంగాణ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. భువనగిరి, నర్సంపేట, జనగామ స్థానాలను యువ తెలంగాణ పార్టీకి కేటాయించేందుకు బీజేపీ ముఖ్యనేతలు ఓకే చెప్పినట్లు తెలిసింది. భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, నర్సంపేట నుంచి రాణి రుద్రమ, జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అందుకు బీజేపీ అంగీకరించడంతోనే సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున జనగామ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ తరువాత బీజేపీకి దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బీజేపీ ముఖ్య నేతలనుంచి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో యువ తెలంగాణ పార్టీకి కేటాయించే స్థానాల్లో 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పొత్తులు, స్థానాలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ తరపున భువనగిరిలో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఇప్పటికే అలక వహించారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment