Yuva Telangana
-
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
హయత్‌నగర్: తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చాలని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జె కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ 2వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని కోరారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కోరారు. ఈమేరకు సమావేశంలో 15 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమరెడ్డి బరిలో దిగనున్నారు. ఈమేరకు సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.కాజన్‌గౌడ్, సోమగు శంకర్, ఎన్.రవికుమార్, తుమ్మ రమేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ(భువనగిరి) జె.వెంకటనారాయణ (ఖమ్మం) తదితరులు పాల్గొన్నారు. -
కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి : రాణి రుద్రమ
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే చట్టసభలకు పోటీచేస్తున్నానని యువతెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా మగవారే చీరలు కట్టుకొని పరిపాలిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలోఉద్యోగాల కోసం 100 నోటిఫికేషన్లు ఇస్తే 10 నోటిఫికేషన్లు కూడా పూర్తిగా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రధాన అభ్యర్థులను పట్టభద్రుల సమస్యలపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తే ఎవరు స్పందించడం లేదని విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ‘ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతి సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసేలా చూస్తా. ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేసేలా, నిర్ణీత గడువులోగా నియామకాలు జరిగేలా శాసన మండలిలో చట్టం కోసం ప్రతిపాదిస్తా. ఉద్యోగాల ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తాను. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేరగాళ్లకు వరంలా మారిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ సవరణకోసం, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఐఆర్ సకాలంలో వచ్చేలా చూస్తా. జర్నలిస్టుల హక్కులకోసం పోరాడతా. నాకు ప్రతి అంశంపై అవగాహన ఉంది. కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి. అవసరమైతే అసెంబ్లీ ముందు గాని, సీఎం కార్యాలయం ముందు గాని కూర్చుని ప్రజల తరఫున గళం వినిపిస్తా. కాబట్టి అవకాశం ఇవ్వాలి’ అని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి రాణి రుద్రమ కోరారు. -
బీజేపీతో యువ తెలంగాణ పార్టీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు కుదిరింది. ఇప్పటికే మహాకూటమి పొత్తుల చర్చ జరుగుతుండగా, తాజాగా బీజేపీతో కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు పార్టీల ముఖ్య నేతలు గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అనంతరం వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. యువ తెలంగాణ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతలకు వారి అభిప్రాయా న్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే 8 స్థానా లు కాకపోయినా కొన్ని స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో యువ తెలంగాణ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. భువనగిరి, నర్సంపేట, జనగామ స్థానాలను యువ తెలంగాణ పార్టీకి కేటాయించేందుకు బీజేపీ ముఖ్యనేతలు ఓకే చెప్పినట్లు తెలిసింది. భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, నర్సంపేట నుంచి రాణి రుద్రమ, జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అందుకు బీజేపీ అంగీకరించడంతోనే సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున జనగామ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ తరువాత బీజేపీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బీజేపీ ముఖ్య నేతలనుంచి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో యువ తెలంగాణ పార్టీకి కేటాయించే స్థానాల్లో 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పొత్తులు, స్థానాలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ తరపున భువనగిరిలో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఇప్పటికే అలక వహించారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు. -
మహా కూటమికి మహా ఓటమి తప్పదు
హైదరాబాద్: బీజేపీతో కలిసి పనిచేసేందుకు యువ తెలంగాణ పార్టీ నడుంకట్టింది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నామని తెలిపారు. వీలైతే కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు..ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని విమర్శించారు. చంద్రబాబు ఫోటోతో కాంగ్రెస్ ప్రచారం.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టి కాంగ్రెస్ ఓట్లడుగుతోంది..ఇదీ కాంగ్రెస్ దుస్థితి అని లక్ష్మణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పెత్తనం చెలాయించడం కోసమే కూటమిలో చేరారని విమర్శించారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత కేసీఆర్ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షా సభల తర్వాత రాజకీయం మారుతుందని అన్నారు. సీట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ విచ్చిన్నం కాబోతుందని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన పరిణామమని అన్నారు. అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు..ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్ఎస్ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కోదండరాం కలయికతోనే బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే సంకేతం వస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు కూటములు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలతోనే నిండి ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారు. యువ తెలంగాణ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడుతూ.. బీజేపీ, యువత మహిళలకు ప్రాధన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తన బిడ్డ కవిత ఐడెంటిటీ పోవద్దనే కారణంతోనే కేసీఆర్ తెలంగాణాలో మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. -
‘యువ తెలంగాణ’ ఆవిర్భావం
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనుకున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన జిట్టా.. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తోందన్నారు. మంత్రి వర్గంలో వారికి చోటు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. 1999లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి యువజనుల ఉన్నతికి కృషి చేసినట్లు చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువ తెలంగాణ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ జయ శంకర్‌ను విస్మరించి హరికృష్ణకు స్మారక ఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం పెట్టి స్మారక ఘాట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఇంటికో ఇటుకతో తామే విగ్రహాన్ని నిర్మించుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. పార్టీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాణి రుద్రమ, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్ కృష్ణ, 12 మంది సభ్యులను ప్రకటించారు. -
కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఫ్రీమంట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, యువ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జయ జయహే తెలంగాణ గీతంతో ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ గీతాన్ని శ్రీనివాస్ మానాప్రగడ ఆలపించారు. అనంతరం టీఏటీఏ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ.... బంగారు తెలంగాణ సాధించే క్రమంలో గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలపై తెలంగాణ ఎన్నారైలు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వేడుకల్లో టీఏటీఏ మైనార్టీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేసినందుకు టీఏటీఏ యూత్ ఛైర్మన్ సతీష్, యూత్ కో ఆర్డినేటర్ అమిత్ ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్, నిషాంత్ పాల్గొన్నారు.