మహా కూటమికి మహా ఓటమి తప్పదు | BJP Leaders Slams Grand Alliance In Hyderabad | Sakshi
Sakshi News home page

మహా కూటమికి మహా ఓటమి తప్పదు

Published Thu, Nov 8 2018 2:27 PM | Last Updated on Thu, Nov 8 2018 8:20 PM

BJP Leaders Slams Grand Alliance In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: బీజేపీతో కలిసి పనిచేసేందుకు యువ తెలంగాణ పార్టీ నడుంకట్టింది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నామని తెలిపారు. వీలైతే కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని వెల్లడించారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో  చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు..ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని విమర్శించారు.

చంద్రబాబు ఫోటోతో కాంగ్రెస్‌ ప్రచారం.. 

ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టి కాంగ్రెస్‌ ఓట్లడుగుతోంది..ఇదీ కాంగ్రెస్‌ దుస్థితి అని లక్ష్మణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పెత్తనం చెలాయించడం కోసమే కూటమిలో చేరారని విమర్శించారు. కేటీఆర్‌ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత కేసీఆర్‌ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌ షా సభల తర్వాత రాజకీయం మారుతుందని అన్నారు. సీట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ విచ్చిన్నం కాబోతుందని వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన పరిణామమని అన్నారు. అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు..ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణాలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కోదండరాం కలయికతోనే బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే సంకేతం వస్తోందన్నారు. 

బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, టీడీపీ, మజ్లిస్‌ పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు కూటములు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలతోనే నిండి ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. 

యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం  తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారు. 

యువ తెలంగాణ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడుతూ.. బీజేపీ, యువత మహిళలకు ప్రాధన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తన బిడ్డ కవిత ఐడెంటిటీ పోవద్దనే కారణంతోనే కేసీఆర్‌ తెలంగాణాలో మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement