rani rudrama devi
-
రాణీ రుద్రమ తెలుగుజాతికి గర్వకారణం
నకిరేకల్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణీ రుద్రమదేవి అత్యంత ధైర్యస్తురాలు. ఆమె తెలుగుజాతికి గర్వకారణం. రుద్రమ జీవితం మహిళా సాధికారతకు ప్రతీక. మహిళలకు స్ఫూర్తి’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలోని రుద్రమదేవి మరణ శిలా శాసనాన్ని మంగళవారం గవర్నర్ సందర్శించారు. గ్రామ శివారులో ఉన్న రుద్రమ కాంస్య విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమదేవి మరణ శాసనం, చరిత్ర ఆనవాళ్లు చందుపట్ల గ్రామంలో ఉన్నట్లు గతంలోనే తాను తెలుసుకున్నానని, ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చానన్నారు. రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రుద్రమ ధైర్యసాహసాల గురించి తెలియడం వల్ల ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాలికలు, మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎదుర్కొంటారని తమిళిసై అన్నారు. చారిత్రక ప్రాముఖ్యత ఉన్న చందుపట్ల ప్రాంతాన్ని రుద్రమ స్మారక కేంద్రంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోకి ప్రవేశించే చోట కాకతీయ ప్రాముఖ్యతను తెలిపే స్వాగత ద్వారం నిర్మించాలని చందుపట్ల ప్రజలు తనను కోరినట్లు తమిళిసై వివరించారు. నల్లగొండ కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు.. గవర్నర్ తమిళిసై చందుపట్ల పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకుంది. గవర్నర్‌కు నల్లగొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి స్వాగతం పలకాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాత్రం గవర్నర్‌కు స్వాగతం పలికి వెంటనే వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆదేశాలతోనే నల్లగొండ కలెక్టర్, ఎస్పీ గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదన్న చర్చ జరుగుతోంది. -
ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానుంది. దీంతో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అంశాలపై ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. అధికార టీఆర్ఎస్ ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెడుతోంది. జిల్లాలో తొలి సమావేశం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరగనుంది. మూడు జిల్లాల పరిధి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఆ పార్టీ.. తక్కెళ్లపల్లి రవీందర్రావును ఇన్చార్జ్గా నియమించిందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి క్షేత్ర స్థాయిలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం) నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తాను పోటీలో ఉంటున్నానని ప్రకటించారు. వీరే కాకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా మరి కొందరు కూడా స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గంనుంచి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. టీఆర్ఎస్లో.. కదలిక టీఆర్ఎస్ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మూడు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఎన్నికకు సమాయత్తం చేయడం.. ముందుగా ఓటర్లుగా నమోదు చేయించడంపై నాయకత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఓ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ తన అభ్యర్థిగా తిరిగి పల్లా రాజేశ్వర్ రెడ్డినే కొనసాగిస్తుందా..? లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్న విషయంపై పార్టీ వర్గాల్లోనూ స్పష్టత లేదు. అయితే.. పార్టీ ఆదేశిస్తే తాను పోటికి సిద్ధంగా ఉన్నానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పార్టీ పెద్దల వద్ద తన సంసిద్ధతను ప్రకటించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో మౌనం! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలో ఉంటారో ఇంకా తేటతెల్లం కాలేదు. కాంగ్రెస్‌నుంచి అభ్యర్థిని పోటీలో పెడతారా..? లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జిల్లానుంచి ఇప్పటివరకూ ఒక్కరి పేరూ కనీస ప్రచారంలోకి రాలేదు. ఈ స్థానంనుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో కొందరు నేతలు ఆశతో ఉన్నా.. నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి మాత్రం ఇప్పటి దాకా ఎవరూ బయట పడలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీల్లో.. హడావుడి మరోవైపు ఈ ఎన్నికల్లో తమ గెలుపు కోసం కలిసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని టీఆర్ఎస్, కాంగ్రెసేతర పార్టీల నాయకులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పోటీపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ జనసమతి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాకే చెందిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమను పోటీకి పెట్టనున్నామని ప్రకటించారు. దీంతో ఈ పార్టీల్లోనూ హడావిడి మొదలైంది. కాగా, సీపీఎం, సీపీఐల నుంచి కూడా పోటీపై ఎలాంటి స్పష్టత లేదు. -
ఇది రుద్రమ మరణశాసనం
సాక్షి, హైదరాబాద్: రాణి రుద్రమదేవి.. ధీర వనిత, భారతావనిలో దేశాన్ని అత్యంత గొప్పగా పాలించిన మహారాణి. మహిళ అయి ఉండి ‘మగ’మహారాజుగా చరిత్రలో నిలిచిపోయిన ఓ విచిత్రం. తొలుత పురుష వేషధారణలో ఉండి, యువరాజుగా పేరు పొందినా.. తర్వాత మహిళగా రాజ్యపాలన చేసినా, చరిత్రలో మాత్రం కాకతి రుద్రదేవ మహారాజుగా నిలిచిపోయారు. కాకతీయ పౌరుషం అనగానే ఠక్కున రుద్రమదేవి పేరు మదిలో మెదులుతుంది. సువిశాల గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, ప్రజారంజక పాలనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మహాయోధురాలు ఎప్పుడు మృతిచెందారు? ఆమె మరణించిన కాలంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ, సూర్యాపేట జిల్లా చందుపట్లలో లభించిన ఓ శాసనంపై ఉన్న కాలాన్నే ఎక్కువ మంది అసలు మరణ తేదీగా భావిస్తారు. ఇప్పుడు ఆ శాసనాన్ని రూఢి చేసేలా మరో కొత్త శాసనం వెలుగు చూసింది. దాని ప్రకారం ఆమె మరణించిన సంవత్సరం 1289. గుంటూరు జిల్లా పుట్టాలగూడెం శివారులో ఇటీవల ఓ శాసనం వెలుగు చూసింది. గతంలో ఇక్కడ బౌద్ధస్థూపం ఉండేదన్న ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడి ఆయక స్తంభంపైనే ఈ శాసనం చెక్కి ఉండటం విశేషం. చాలాకాలంగా ఇది ఇక్కడే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే దాన్ని పరీక్షించగా ఆ దేవాలయానికి భూమిని దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించిన శాసనంగా తేలింది. అందులో రాణి రుద్రమదేవి వివరాలు వెలుగుచూశాయి. ఆమె చనిపోయిన సందర్భంలో ఈ భూదానం చేసినట్టు స్పష్టమవుతోంది. శక సంవత్సరం 1210(1) విరోధినామ సంవత్సరం పౌష్య శుద్ధ విదియనాడు మకర సంక్రాంతి పుణ్యకాలంలో ఇది వేయించినట్టుగా ఉంది. దాని ప్రకారం క్రీ.శ. 1289 డిసెంబరు 15 అవుతోంది. కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజుకు ధర్మంగా ఒడ్ల కాలువ, సోమలవరి ఇడువ (పంటపొలం)ధర్మంగా ఇచ్చినట్టు ఉంది. కొన్ని పంక్తులు చెరిగిపోయి అస్పష్టంగా మిగిలాయి. అంతకుముందు కాకతీయ సేనానిగా పనిచేసిన గన్నమనాయకుడి కుమారుడైన సోమయ్య సాహిణి ఈ భూమిని దానం చేసినట్టుగా అందులో ఉంది. ఈయన రుద్రమదేవి పరిపాలన చివరి కాలంలో ఆమె వెంట ఉన్న వ్యక్తి. తొలి శాసనానికి బలం చేకూర్చిన ఆధారం.. నేటి సూర్యాపేట జిల్లా చందుపట్ల సోమనాథ దేవాలయంలో లభించిన శాసనంలో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం చేసినట్టు ఉంది. ఈ శాసనాన్ని 1289 నవంబరు 25న వేయించినట్టు వివరాలు చెబుతున్నాయి. వారు మరణించిన దశదిన కర్మ జరిగేలోపు వేయించి ఉంటారని, అంటే అందులోని తేదీకి కాస్త అటూ ఇటూగా పక్షం రోజుల ముందు ఆమె చనిపోయి ఉంటుందని అంచనాగా చరిత్రకారులు చెబుతారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈవూరు గోపాలస్వామి దేవాలయం ముందు స్తంభంపై గతంలో మరో శాసనం లభించింది. ఇందులో రుద్రమదేవితోపాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టు ఉంది. ఈ శాసనం 1289 నవంబర్ 28న వేయించారు. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమతోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయునికి, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివలోక ప్రాప్తి కోరుతూ ఉండటంతో ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు అంచనాకొచ్చారు. అంటే యుద్ధంలోనో, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్న సమయంలోనో మరణించి ఉంటారని అంచనా. మరణించే నాటికి 80 ఏళ్లు? రుద్రమదేవి మరణించే సమయానికి ఆమెకు 80 ఏళ్ల వయసు ఉంటుందని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలోనే ఓ అంచనాకొచ్చారు. ఆమె తండ్రికి సంబంధించి వెలుగు చూసిన శాసనాలు, రుద్రమదేవికి సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేసి ఆయన ఈ అంచనాకొచ్చారు. 80 ఏళ్ల వయసులో ఆమె యుద్ధం చేయటం కష్టమైన పనే. అందుకే ఆమె మరణించిన సమయంలో నేరుగా యుద్ధంలో పాల్గొన్నారా, లేక యుద్ధానికి సంబంధించిన పర్యవేక్షణకు వచ్చిన సమయంలో శత్రువుల చేతిలో చనిపోయారా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మొదటి రెండు శాసనాలు దాదాపు ఒకే సమయంలో వేయించినట్టు స్పష్టంగా ఉంది. ఇప్పుడు కొత్తగా వెలుగుచూసిన శాసనాన్ని తొలిసారి నేనే చదివాను. ఇందులో 1289 డిసెంబరు 15 అని ఉంది. వెరసి ఆమె అదే సంవత్సరంలో మరణించారని దాదాపు స్పష్టమైంది. మన చరిత్రలో మహా అధ్యాయాన్ని లిఖించుకున్న గొప్ప యోధురాలు రుద్రమదేవి మరణ సమయంపై దాదాపు స్పష్టత వచ్చినట్టయింది . –శ్రీరామోజు హరగోపాల్, చరిత్రకారులు -
మహా కూటమికి మహా ఓటమి తప్పదు
హైదరాబాద్: బీజేపీతో కలిసి పనిచేసేందుకు యువ తెలంగాణ పార్టీ నడుంకట్టింది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నామని తెలిపారు. వీలైతే కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు..ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని విమర్శించారు. చంద్రబాబు ఫోటోతో కాంగ్రెస్ ప్రచారం.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టి కాంగ్రెస్ ఓట్లడుగుతోంది..ఇదీ కాంగ్రెస్ దుస్థితి అని లక్ష్మణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పెత్తనం చెలాయించడం కోసమే కూటమిలో చేరారని విమర్శించారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత కేసీఆర్ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షా సభల తర్వాత రాజకీయం మారుతుందని అన్నారు. సీట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ విచ్చిన్నం కాబోతుందని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన పరిణామమని అన్నారు. అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు..ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్ఎస్ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కోదండరాం కలయికతోనే బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే సంకేతం వస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు కూటములు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలతోనే నిండి ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారు. యువ తెలంగాణ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడుతూ.. బీజేపీ, యువత మహిళలకు ప్రాధన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తన బిడ్డ కవిత ఐడెంటిటీ పోవద్దనే కారణంతోనే కేసీఆర్ తెలంగాణాలో మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. -
హజ.. పనం.. వరహా..
రాణీ రుద్రమ దేవి.. పరాక్రమానికి ప్రతిరూపం. ఆ పేరు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోయేవి. మరి ఆమెకు ఉన్న బిరుదేమిటో తెలుసా..? రాయ గజకేసరి! ఏనుగంతటి శత్రువుపై లంఘించి సంహరించే సింహం వంటి రాజు అన్నది దాని సారాంశం. మరి ఆమె హయాంలో రూపుదిద్దుకున్న నాణేలాపై పేరేముండేదో తెలుసా..? రాయగజ!! సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటిగా కీర్తి గడించిన కాకతీయుల హయాంలో చలామణీలో ఉన్న నాణేలపై ఇప్పటి వరకు పెద్దగా స్పష్టత లేదు. తాజాగా దీన్ని కొలిక్కి తెచ్చేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో నాణేల పరిశోధకులు రాజారెడ్డి అధ్యయనం జరుపుతున్నారు. మూడు నెలలపాటు శ్రమించి 1,600 నాణేలను పరిశీలించి, వాటిని కాకతీయ శాసనాలతో అనుసంధానించి ఓ కొలిక్కి తెచ్చారు. ఓ మహా సామ్రాజ్యానికి సంబంధించిన నాణేల వివరాలను ప్రజల ముంగిట ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,600 నాణేలపై పరిశోధన ఇప్పటి వరకు కాకతీయుల నాణేలపై పెద్దగా పరిశోధన జరగలేదు. వారి సామ్రాజ్య చిహ్నమైన వరాహం గుర్తు ఉన్న నాణేలు కాకతీయులవి అని మాత్రమే చరిత్రకారులు గుర్తించారు. కానీ ఆ సామ్రాజ్యంలో ఏ చక్రవర్తి ఎలాంటి నాణేలు రూపొందించారన్న విషయంలో స్పష్టత రాలేదు. 1975లో ప్రముఖ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి ఈ నాణేలపై పరిశోధన చేసి కొన్ని వివరాలు వెల్లడించినా, ఆయా చక్రవర్తుల నాణేల అమలు విధానాన్ని మాత్రం వెల్లడించలేకపోయారు. దీంతో నాటి నాణేలపై స్పష్టత రావాలన్న ఉద్దేశంతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు.. పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) సహకారంలో బృహత్ అధ్యయనానికి నడుం బిగించింది. ట్రస్టు నిర్వాహకులు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సూచనతో ప్రముఖ నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్ రాజారెడ్డి.. నాంపల్లి స్టేట్ మ్యూజియంలో ఉన్న 1,600 కాకతీయ నాణేలపై మూడు నెలలుగా పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఆయన ఆ పరిశోధన వివరాలతో పుస్తక ముద్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ విలువ, తక్కువ విలువ.. ప్రస్తుతం నగదులో డినామినేషన్స్ ఉన్నట్టుగానే కాకతీయులు నాణేల్లో డినామినేషన్స్ రూపొందించారు. ఎక్కువ విలువ, తక్కువ విలువ ఉన్న నాణేలన్నమాట. 1.6 నుంచి 1.8 సెం.మీ. పరిమాణంలో 3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణేలను వరహాలుగా పేర్కొన్నారు. వాటిలో పదో వంతు అంటే.. 0.36 గ్రాముల బంగారంతో 4 మి.మీ. వ్యాసంతో రూపొందించిన నాణేలను పనంగా పిలుచుకున్నారు. అందులో నాలుగో వంతు విలువతో కేవలం 3 మి.మీ. పరిమాణంలో హజ పేరుతో నాణేలు చెలామణి చేశారు. గజకేసరి బిరుదుతో.. కాకతీయ చక్రవర్తులను గజకేసరి బిరుదుతో పిలిచేవారు. ఈ గజకేసరి పేరుకు కొన్ని పదాలు చేర్చి నాణేలపై ముద్రించారు. ఇవి తప్ప రాజుల పేర్లు ఎక్కడా లేకపోవటంతో ఏ నాణెం ఎవరి హయాందో తేలలేదు. బీదర్ వద్ద లభించిన శాసనంలో రాణీ రుద్రమ గురించి వర్ణించే క్రమంలో రాయ గజకేసరి పేరును వాడారు. స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలను పరిశీలించగా కొన్ని నాణేలపై రాయగజ అన్న పదాలు కనిపించాయి. దీంతో అవి రుద్రమదేవి రూపొందించినవిగా గుర్తించారు. అలాగే కండవల్లి శాసనంలో ప్రతాప రుద్రుడిని దాయ గజకేసరిగా అభివర్ణించారు. కొన్ని నాణేలపై దాయ గజ అక్షరాలు ఉండటంతో అవి ఆయన హయాంలో రూపొందించినవిగా రాజారెడ్డి తేల్చారు. కొన్నింటిపై అరి గజ అన్న పదాలు కనిపించాయి. కానీ ఆ బిరుదు ఎవరికి ఉందో తెలిపే శాసనం ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నో శాసనాలు పడిఉన్నాయి. కానీ వాటిపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవటంతో పరిశోధన సాగలేదు. ఇటీవల నేలకొండపల్లిలో ప్రతాప రుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు పసాయిత గణపతిరెడ్డి వేయించిన శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ తదితరులు గుర్తించారు. నాణేలు కరిగించిన బహమనీయులు కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చేసిన బహమనీయులు పెద్ద దురాగతానికి పాల్పడ్డారు. కాకతీయులకు గొప్ప సామ్రాజ్యమన్న పేరు ఉండటంతో దాని గుర్తుగా ఉండే వాటిని రూపుమాపాలని నిర్ణయించారు. తొలుత వారి దృష్టి నాటి నాణేలపై పడింది. కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న నాణేలన్నింటినీ కరిగించేశారు. అయితే బంగారు, వెండి నాణేల విలువ ఎక్కు వగా ఉండటంతో కొంతమంది ప్రజలు వాటిని దాచుకున్నారు. అలా ఉన్నవే ఇప్పుడు తవ్వకాలలో బయటపడుతున్నాయి. కానీ రాగి నాణేల ను జనం దాచుకోలేదు. అవన్నీ బహమనీయు ల చేతుల్లో అదృశ్యమయ్యాయి. అందుకే ఇప్పటి వరకు కాకతీయులకు చెందిన ఒక్క రాగి నాణెం కూడా వెలుగు చూడలేదు. ఇలాంటివెన్నో ఆసక్తికర విషయాలతో కాకతీయుల నాణేల చరిత్రతో తొలి పుస్తకం వెలువడబోతోంది. వరహా.. 3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం. పనం.. వరహాలో పదో వంతు. అంటే 0.36 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం. హజ.. పనంలో నాలుగో వంతు. కేవలం 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. -
కేసీఆర్ ఇచ్చారు.. బాబుగారూ ఇవ్వండి
-
కేసీఆర్ ఇచ్చారు.. బాబుగారూ ఇవ్వండి: గుణశేఖర్
తాను దర్శకత్వం వహించి.. తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’కు వినోదపన్ను రాయితీ విషయమై తాజాగా ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపన్ను రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన గుణశేఖర్.. తన ‘రుద్రమదేవి’ సినిమాకు కూడా వినోదపన్ను రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిందని, దీనిపై కొంత పురోగతి చూపి.. ఆ తర్వాత ఈ ఫైలును అర్ధంతరంగా మూసివేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాకతీయ మహాసామ్రాజ్ఞిని ‘రాణి రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వినోదపన్ను రాయితీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాణిరుద్రమ దేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని, ఆమె దక్షిణపథమంతటినీ పాలించిన మహారాణి అని గతంలో చంద్రబాబు కూడా పేర్కొన్నారని గుర్తుచేసిన గుణశేఖర్.. ఎన్నో వ్యయప్రయాలకోర్చి 13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను ప్రపంచానికి చాటిచెప్పిన రుద్రమదేవి సినిమాను భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమాగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించానని, కాబట్టి ఏపీలో ఈ సినిమాకు వినోద పన్ను కింద వసూలు చేసిన మొత్తాన్ని ‘ప్రోత్సాహక నగదు’ కింద అందించాలని గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. -
ఆమె రాణి రుద్రమదేవే!
చాట్రాయి(కృష్ణా) : నీటి కుంట కోసం తవ్విన గుంతలో కాకతీయుల రాణి రుద్రమదేవి శిలా ప్రతిమ బయటపడింది. చీరకట్టులో కత్తి, డాలు పట్టుకున్న వీరత్వం ఉట్టిపడే మహిళ ప్రతిమ చూడగానే రుద్రమదేవినే తలపిస్తుంది. మండలంలోని చిత్తపూరు గ్రామంలో ఇటీవల ఓ రైతు భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంట తవ్వుతున్న కూలీలకు పెద్ద బండరాయి కన్పించింది. ఇది గమనించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రదేశంలో గుప్త నిధులు ఉంటాయని భావించి అర్ధరాత్రి పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు తెలిసింది. ఆ ప్రదేశంలో తవ్వుతుండగా రాణి రుద్రమదేవి ప్రతిమ చెక్కి ఉన్న బండరాయి బయట పడింది. ఈ ప్రతిమను పక్కనపెట్టి తవ్వకాలు కొనసాగించారని, దొరికిన గుప్త నిధులను రహస్యంగా తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ తవ్వకాల్లో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి నిధులు స్వాహా చేసిన సంఘటనలు సంభవించాయి. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఇలాంటి వదంతులు వ్యాపిస్తుండడంతో గుప్త నిధుల తవ్వకాల కోసం కొందరు మంత్రగాళ్లను ఆశ్రయించి భారీగా డబ్బులు కోల్పోతున్నారు. పోలీసులు తాజా ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిజనిజాలు తేల్చడంతో పాటు గుప్తనిధుల ముఠాల ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఇది తెలుగుజాతి కథ
మనసుకు నచ్చిన పని చేయాలంటే, మనీ లెక్కలేసుకుంటే కుదరదు. సినిమా అంటే ప్రాణం పెట్టే దర్శకుడు గుణశేఖర్ మొదటి నుంచీ నమ్మేదీ, ఆచరించేదీ అదే. పిల్లలతో ‘రామాయణం’ దగ్గర నుంచి మహేశ్ ‘ఒక్కడు’, ‘అర్జున్’ దాకా ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే. నచ్చిన సబ్జెక్ట్‌ను నలుగురికీ నచ్చేలా చెప్పడానికి పదేపదే సాహసించే ఈ సృజనశీలి దాదాపు మూడేళ్ళుగా చేస్తున్న ప్రతిష్ఠాత్మక వెండితెర ప్రయత్నం - ‘రుద్రమదేవి’. చిన్నప్పుడు స్కూల్లో నాన్డీటైల్డ్గా చదివిన కాకతీయ సామ్రాజ్యపు వీరనారి రుద్రమదేవి కథనూ, తెలుగువారి గొప్పతనాన్నీ ప్రపంచమంతటికీ తెలియజెప్పేందుకు ఆయనే నిర్మాతగా కూడా మారారు. రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా - ఇలా కీలకమైన చారిత్రక పాత్రలన్నీ ఈ సినిమాతో మన కళ్ళ ముందుకు రానున్నాయి. పైగా ‘‘చారిత్రక కథాంశంతో వస్తున్న తొలి స్టీరియో స్కోపిక్ 3డీ ఫిల్మ్’’ ఇదే. ఇళయరాజా (సంగీతం), తోట తరణి (కళ), నీతా లుల్లా (‘జోథా అక్బర్’ ఫేమ్ కాస్ట్యూమ్ డిజైనర్) లాంటి ప్రసిద్ధ టెక్నీషియన్ల పనితనంతో ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకొంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ‘‘ప్రస్తుతం అవన్నీ కూడా పూర్తి కావచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఒక స్పష్టత రాగానే, రిలీజ్ ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని గుణశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. ఒకపక్క 3డీ వెర్షన్‌తో పాటు, 3డీ కళ్ళద్దాలతో అవసరం లేకుండానే 3డీ ఎఫెక్ట్‌లో సినిమా చూసేలా మరో వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అందుకోసం కొత్త టెక్నాలజీతో ప్రతి ఫ్రేమ్నూ విదేశీ నిపుణుల సాయంతో సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలోని ప్రముఖులందరూ నటించగా, తెలుగులో చాలాకాలం తరువాత వస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ఇదే. గుణశేఖర్ సాహసానికీ, సినిమాపై ప్రేమకూ తాజా నిదర్శనమైన ఈ ‘రుద్రమదేవి’ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీలోనూ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలకు ఇంకొద్ది రోజులు ఆగాలి. -
రాణీ రుద్రమదేవిలో నటిస్తున్నా
పాలకొల్లు అర్బన్: ‘చిన్నదానా.. ఓసీ చిన్నదానా.. ఆశ పెట్టేసిపోమాకే కుర్రదానా..’ అంటూ కుర్రకారు మనసులు దోచుకున్న నటి రక్ష టెలీ సీరియల్ నిర్మాణంలో భాగంగా పాలకొల్లు వచ్చారు. అను ష్క ప్రధాన పా త్రలో గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా ణీ రుద్రమదేవి సిని మాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఆమె వ్యక్తిగత, సినీ విషయాలు.. మీ స్వస్థలం విశాఖ జిల్లా యల మంచిలి. స్థిరపడింది చెన్నైలో సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు నాన్న నరసింగరావు నిర్మాత. ఎన్టీఆర్, శోభన్‌బాబుతో మూడు సినిమాలు నిర్మించారు. దీంతో సినీ పరిశ్రమలోకి రాగలిగా. తొలి సినిమా మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా అంకుల్బన్లో నటించా. మమ్ముట్టి హీరోగా జానీవాకర్ సినిమాల్లో హీరోయిన్గా నటించా. ఇప్పటివరకు ఎన్నిచిత్రాల్లో నటించారు 400 సినిమాలు డ్రీమ్ రోల్ ఏంటి అన్ని రకాల పాత్రలు చేశా. హీరోయిన్ వాణిశ్రీలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎక్కువగా ఆనందించిన క్షణాలు నచ్చావులే (2010) సినిమాలో హీరోకి తల్లి వేషం వేశా. ఆ చిత్రానికి నంది అవార్డు రావడం టెలీ సీరియల్స్ ఏమైనా చేశారా లేదండి. గురువుగారు దాసరి నారాయణరావు నిర్మాణ సారథ్యంలో మొదటిసారిగా లేడీ విలన్ రోల్ చేస్తున్నా. ప్రస్తుతం షూటింగ్లో వుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు రాణీరుద్రమదేవి, పడ్డానండీ ప్రేమలో పడి, నాగచైతన్య సినిమాలో నటిస్తున్నా. తమిళంలో రెండు, కన్నడంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. ఇష్టమైన హీరో, హీరోయిన్ నందమూరి తారక రామారావు, వాణిశ్రీ గోదావరి అందాలపై మీ అభిప్రాయం తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చా. గోదావరి అందాలు కట్టిపడేస్తున్నాయి. -
నేడు రుద్రమదేవి పోస్టల్ స్టాంప్ విడుదల
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్లోని రాణిరుద్రమదేవి విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రుద్రమదేవి పోస్టల్ స్టాంప్‌ను మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పార్టీ నగ ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రకటిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమానికి వి.ప్రకాష్, హైమావతి, శాస్త్రి, పాండురావు తదితరులు హాజరవుతారని చెప్పారు. కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యం: వినయ్ కాకతీయ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. ఘన కీర్తి కలిగిన కాకతీయ సామ్రాజ్య గొప్పతనాన్ని మరుగుపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీ రుకు నిరసనగా తమ పార్టీ, తెలంగాణవాదుల సహకారం తో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు ముందే ప్రభుత్వ తీరును తాము అనుమానించామ ని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలకు రూ.300కోట్లు కేటాయిస్తే.. కాకతీయ ఉత్సవాలకు రూ.100కోట్లు ఇవ్వాలన్నా అత్తెసరు నిధులు కేటాయించారన్నారు. గొలుసుకట్టు చెరువులు, కాకతీయుల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయాలని చెప్పినా స్పందన లేదని ఆయన విమర్శించారు.