ఆమె రాణి రుద్రమదేవే!
ఆమె రాణి రుద్రమదేవే!
Published Fri, Aug 12 2016 5:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
చాట్రాయి(కృష్ణా) :
నీటి కుంట కోసం తవ్విన గుంతలో కాకతీయుల రాణి రుద్రమదేవి శిలా ప్రతిమ బయటపడింది. చీరకట్టులో కత్తి, డాలు పట్టుకున్న వీరత్వం ఉట్టిపడే మహిళ ప్రతిమ చూడగానే రుద్రమదేవినే తలపిస్తుంది. మండలంలోని చిత్తపూరు గ్రామంలో ఇటీవల ఓ రైతు భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంట తవ్వుతున్న కూలీలకు పెద్ద బండరాయి కన్పించింది. ఇది గమనించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రదేశంలో గుప్త నిధులు ఉంటాయని భావించి అర్ధరాత్రి పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు తెలిసింది. ఆ ప్రదేశంలో తవ్వుతుండగా రాణి రుద్రమదేవి ప్రతిమ చెక్కి ఉన్న బండరాయి బయట పడింది. ఈ ప్రతిమను పక్కనపెట్టి తవ్వకాలు కొనసాగించారని, దొరికిన గుప్త నిధులను రహస్యంగా తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఈ తవ్వకాల్లో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి నిధులు స్వాహా చేసిన సంఘటనలు సంభవించాయి. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఇలాంటి వదంతులు వ్యాపిస్తుండడంతో గుప్త నిధుల తవ్వకాల కోసం కొందరు మంత్రగాళ్లను ఆశ్రయించి భారీగా డబ్బులు కోల్పోతున్నారు. పోలీసులు తాజా ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిజనిజాలు తేల్చడంతో పాటు గుప్తనిధుల ముఠాల ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement