సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానుంది. దీంతో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అంశాలపై ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. అధికార టీఆర్‌ఎస్ ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెడుతోంది. జిల్లాలో తొలి సమావేశం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరగనుంది. మూడు జిల్లాల పరిధి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఆ పార్టీ.. తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఇన్‌చార్జ్‌గా నియమించిందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి క్షేత్ర స్థాయిలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం)
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తాను పోటీలో ఉంటున్నానని ప్రకటించారు. వీరే కాకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా మరి కొందరు కూడా స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గంనుంచి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.
టీఆర్‌ఎస్‌లో.. కదలిక
టీఆర్‌ఎస్ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మూడు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఎన్నికకు సమాయత్తం చేయడం.. ముందుగా ఓటర్లుగా నమోదు చేయించడంపై నాయకత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఓ సమావేశం జరగనుంది. టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా తిరిగి పల్లా రాజేశ్వర్ రెడ్డినే కొనసాగిస్తుందా..? లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్న విషయంపై పార్టీ వర్గాల్లోనూ స్పష్టత లేదు. అయితే.. పార్టీ ఆదేశిస్తే తాను పోటికి సిద్ధంగా ఉన్నానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పార్టీ పెద్దల వద్ద తన సంసిద్ధతను ప్రకటించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉన్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో మౌనం!
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలో ఉంటారో ఇంకా తేటతెల్లం కాలేదు. కాంగ్రెస్‌నుంచి అభ్యర్థిని పోటీలో పెడతారా..? లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జిల్లానుంచి ఇప్పటివరకూ ఒక్కరి పేరూ కనీస ప్రచారంలోకి రాలేదు. ఈ స్థానంనుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో కొందరు నేతలు ఆశతో ఉన్నా.. నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి మాత్రం ఇప్పటి దాకా ఎవరూ బయట పడలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇతర పార్టీల్లో.. హడావుడి
మరోవైపు ఈ ఎన్నికల్లో తమ గెలుపు కోసం కలిసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని టీఆర్‌ఎస్, కాంగ్రెసేతర పార్టీల నాయకులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పోటీపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ జనసమతి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాకే చెందిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమను పోటీకి పెట్టనున్నామని ప్రకటించారు. దీంతో ఈ పార్టీల్లోనూ హడావిడి మొదలైంది. కాగా, సీపీఎం, సీపీఐల నుంచి కూడా పోటీపై ఎలాంటి స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment