sclupture
-
ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
-
వైరల్ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
రోమ్ : మ్యూజియం అంటేనే పురాతన వస్తువులు, శిల్పాలు ఉంటాయి. వీటిని ఏ మాత్రం కదిలించినా విరగడం ఖాయం. అందుకే ప్రతి శిల్పానికి తాకేందుకు వీలు లేకుండా అద్దాలు అమర్చి ఉంటాయి. కానీ ఇటలీలోని పోసాగ్నోలోని జిప్సోథెకా ఆంటోనియో కనోవా మ్యూజియంలో శిల్పాలను అద్దాల్లో పెట్టకుండా మూములుగానే పెట్టి ప్రదర్శనకు ఉంచారు. మ్యూజియంకు వచ్చే పర్యాటకులు శిల్పాల మీద కూర్చొని మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన ఒక టూరిస్ట్ మ్యూజియంను సందర్శించాడు. దాదాపు 200 ఏండ్ల పురాతనమైన ఒక శిల్పం మీద కూర్చొని ఆ పర్యాటకుడు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.(మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు) ఫోటో దిగిన తర్వాత అతని ప్రవర్తన కొంత వింతగా కనిపించింది. ఏదో జరిగిపోయినట్టు అక్కడే నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. మ్యూజియంలో ఉన్నవాళ్లు అన్ని వైపులకు వెళ్లి శిల్పాలను చూస్తుంటే ఆ వ్యక్తి మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాడు.అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడనేది అక్కడున్నవారికి అర్థం కాకపోయినా.. సీసీ కెమెరాలు పసిగట్టాయి. ఇంతకీ విషయమేంటంటే.. అతను ఫోటో దిగుతున్నప్పుడు చేయి బలంగా తాకడంతో శిల్పం కుడికాలి బొటనవేలు విరిగిపోయింది. అది ఎవరికీ కనిపించకూడదనే ఉద్దేశంతోనే అక్కడే తిరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'అతనికి కొంచెమైనా బుద్దుండాలి.. సున్నితంగా ఉండే శిల్పాల మీద కూర్చొని ఎవరైనా ఫోటోలు దిగుతారా' .. 'శిల్పాల చుట్టూ కనీస భద్రత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
వెలికితీతే.. శాపమైంది !
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అత్యంత అరుదైన గార (డంగుసున్నంతో రూపొందిన) శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది... వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్లో ఇది బయటపడింది. అప్పటికే పగుళ్లు ఏర్పడి కొంతభాగం ముక్కలైన ఈ శిల్పాన్ని తవ్వకాల సమయంలో అధికారులు సురక్షితంగా వెలికి తీసి నగరంలో ఉన్న పురావస్తుశాఖ డైరెక్టరేట్కు తరలించారు. ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం కావటంతో గాలిలో అధికంగా ఉండే తేమను పీల్చుకుని అది వేగంగా శిథిలమవుతోంది. మరికొంతకాలం ఇలాగే ఉంటే అది ముక్కలుముక్కలై అనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈలోపే దాన్ని సంరక్షించి తేమ చొరబడకుండా గాజు పెట్టెలో భద్రపరచాల్సి ఉంది. నిపుణులు సిద్ధంగా ఉన్నా... దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. బుద్ధుడి జాతక కథల్లో ఉండే బోధిసత్వుడుదిగా తేల్చారు. గతంలో బోధిసత్వుడికి సంబంధించి రెండు మూడు అడుగుల ఎత్తున్న గార ప్రతిమలు వెలుగు చూశాయి. కానీ 6 అడుగులకంటే ఎత్తున్న సున్నం విగ్రహం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. ఆ ఆకృతి ఆధారంగా విగ్రహానికి పూర్తి రూపు ఇవ్వగలిగే నిపుణులు ఢిల్లీ, ముంబై, పుణేల్లో ఉన్నారు. కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలో కూడా ఇలాంటి నిపుణులున్నారు. వారిని పిలిపిస్తే విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. కానీ ఆ కసరత్తు లేకుండా పురావస్తుశాఖ విగ్రహాన్ని గాలికొదిలేసింది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహా లు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు. -
ఆమె రాణి రుద్రమదేవే!
చాట్రాయి(కృష్ణా) : నీటి కుంట కోసం తవ్విన గుంతలో కాకతీయుల రాణి రుద్రమదేవి శిలా ప్రతిమ బయటపడింది. చీరకట్టులో కత్తి, డాలు పట్టుకున్న వీరత్వం ఉట్టిపడే మహిళ ప్రతిమ చూడగానే రుద్రమదేవినే తలపిస్తుంది. మండలంలోని చిత్తపూరు గ్రామంలో ఇటీవల ఓ రైతు భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంట తవ్వుతున్న కూలీలకు పెద్ద బండరాయి కన్పించింది. ఇది గమనించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రదేశంలో గుప్త నిధులు ఉంటాయని భావించి అర్ధరాత్రి పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు తెలిసింది. ఆ ప్రదేశంలో తవ్వుతుండగా రాణి రుద్రమదేవి ప్రతిమ చెక్కి ఉన్న బండరాయి బయట పడింది. ఈ ప్రతిమను పక్కనపెట్టి తవ్వకాలు కొనసాగించారని, దొరికిన గుప్త నిధులను రహస్యంగా తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ తవ్వకాల్లో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి నిధులు స్వాహా చేసిన సంఘటనలు సంభవించాయి. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఇలాంటి వదంతులు వ్యాపిస్తుండడంతో గుప్త నిధుల తవ్వకాల కోసం కొందరు మంత్రగాళ్లను ఆశ్రయించి భారీగా డబ్బులు కోల్పోతున్నారు. పోలీసులు తాజా ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిజనిజాలు తేల్చడంతో పాటు గుప్తనిధుల ముఠాల ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.