రుద్రమ మరణ శిలా శాసనం వద్ద నివాళులు అర్పిస్తున్న గవర్నర్ తమిళిసై
నకిరేకల్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణీ రుద్రమదేవి అత్యంత ధైర్యస్తురాలు. ఆమె తెలుగుజాతికి గర్వకారణం. రుద్రమ జీవితం మహిళా సాధికారతకు ప్రతీక. మహిళలకు స్ఫూర్తి’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలోని రుద్రమదేవి మరణ శిలా శాసనాన్ని మంగళవారం గవర్నర్ సందర్శించారు.
గ్రామ శివారులో ఉన్న రుద్రమ కాంస్య విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమదేవి మరణ శాసనం, చరిత్ర ఆనవాళ్లు చందుపట్ల గ్రామంలో ఉన్నట్లు గతంలోనే తాను తెలుసుకున్నానని, ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చానన్నారు. రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
రుద్రమ ధైర్యసాహసాల గురించి తెలియడం వల్ల ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాలికలు, మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎదుర్కొంటారని తమిళిసై అన్నారు. చారిత్రక ప్రాముఖ్యత ఉన్న చందుపట్ల ప్రాంతాన్ని రుద్రమ స్మారక కేంద్రంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోకి ప్రవేశించే చోట కాకతీయ ప్రాముఖ్యతను తెలిపే స్వాగత ద్వారం నిర్మించాలని చందుపట్ల ప్రజలు తనను కోరినట్లు తమిళిసై వివరించారు.
నల్లగొండ కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు..
గవర్నర్ తమిళిసై చందుపట్ల పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకుంది. గవర్నర్‌కు నల్లగొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి స్వాగతం పలకాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాత్రం గవర్నర్‌కు స్వాగతం పలికి వెంటనే వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆదేశాలతోనే నల్లగొండ కలెక్టర్, ఎస్పీ గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment