కేసీఆర్ ఇచ్చారు.. బాబుగారూ ఇవ్వండి: గుణశేఖర్
తాను దర్శకత్వం వహించి.. తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’కు వినోదపన్ను రాయితీ విషయమై తాజాగా ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపన్ను రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన గుణశేఖర్.. తన ‘రుద్రమదేవి’ సినిమాకు కూడా వినోదపన్ను రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిందని, దీనిపై కొంత పురోగతి చూపి.. ఆ తర్వాత ఈ ఫైలును అర్ధంతరంగా మూసివేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
కాకతీయ మహాసామ్రాజ్ఞిని ‘రాణి రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వినోదపన్ను రాయితీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాణిరుద్రమ దేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని, ఆమె దక్షిణపథమంతటినీ పాలించిన మహారాణి అని గతంలో చంద్రబాబు కూడా పేర్కొన్నారని గుర్తుచేసిన గుణశేఖర్.. ఎన్నో వ్యయప్రయాలకోర్చి 13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను ప్రపంచానికి చాటిచెప్పిన రుద్రమదేవి సినిమాను భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమాగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించానని, కాబట్టి ఏపీలో ఈ సినిమాకు వినోద పన్ను కింద వసూలు చేసిన మొత్తాన్ని ‘ప్రోత్సాహక నగదు’ కింద అందించాలని గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.