సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు పొందాలనుకుంటే అది చంద్రబాబునాయుడు తెలివితక్కువ తనమే అవుతుందని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, బాల్క సుమన్‌లు అభిప్రాయపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టమవుతుందన్నారు. ఓటమికి చంద్రబాబు ఇప్పట్నుంచే సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీలతో టీఆర్‌ఎస్ పార్టీకి ఎప్పుడూ రాజకీయ సంబంధాలు లేవని, కేవలం రాజ్యాంగబద్దమైన సంబంధమే ఉందని స్పష్టం చేశారు. పూటకో విధానంతో చంద్రబాబు ముందుకు పోతున్నారని మండిపడ్డారు. హైకోర్టు అఫడవిట్ గురించి మాట్లాడమని కేసీఆర్ అడిగితే ఎదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దే దించేందుకు కేసీఆర్ సూత్రదారి అయితే కేసీఆరే సీఎం అయ్యేవారు కదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అబద్దాలతో ఏపీ ప్రజలను వంచిస్తున్నారని తెలిపారు. తెలంగాణ కోసమే 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీలతో కేసీఆర్ పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్‌దేనని, చివరకు చంద్రబాబును కూడి ఒప్పించి ఆయన పార్టీతో పొత్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. 2004లో చంద్రబాబును బండకేసి కొట్టింది కాంగ్రెస్సేనని, 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ముందుకు వచ్చింది టీడీపీనే అని తెలిపారు. కేసీఆర్ బాబు దారిలోకి రాలేదని, చంద్రబాబే కేసీఆర్ దారిలోకి వచ్చారన్నారు. తాజా ఎన్నికల్లో మోదీతో కేసీఆర్ దోస్తీ అని చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ప్రజలు నమ్మలేదన్నారు. గోబెల్సే ఆశ్చర్యపడే రీతిలో చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని, ఈ గోబెల్స్ సిద్దంతాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, రేపు ఏపీలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
ఇంకా ఉమ్మడి హైకోర్టు ఎందుకు?
రాష్ట్రాలు విడిపోయినా హై కోర్టు ఎందుకు కలిసి ఉండాలన్న కారణాన్ని బాబు చెప్పలేక పోయారని, నాలుగున్నరేళ్లలో హై కోర్టు భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌తో చంద్రబాబు పోటీపడలేరని, ఎవరిని అడిగినా.. తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతారన్నారు. మోదీ, వైఎస్ జగన్‌లతో ఎలా వ్యవహరించాలో కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పక్క రాష్ట్రాలతో సంబంధాల విషయంలో కేసిఆర్ రాజకీయ పరిణతితో వ్యవహరిస్తారన్నారు. కేసీఆర్ రాజకీయ పరిణతి తెలుసుకోవడానికి మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందం ఒక్కటి చాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment