
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్‌కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు.
ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్‌రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్‌హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం.
పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment