బేగంపేట ఎయిర్‌పోర్టులో రెండు గంటలు భేటీ
రేవంత్‌ను కలిసిన తరువాతే బాబు.. అమిత్‌షాను కలిశారు
ఎన్నికల తరువాత రేవంత్‌ను బీజేపీలోకి తెస్తానని అమిత్‌షాకు బాబు మాటిచ్చారు
బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, క్రాంతికిరణ్, నరేందర్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు.
తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు.
బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు
చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు.
గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment