ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన ప్రయోగం చేస్తున్నారు. మళ్లీ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కుట్ర పన్నుతున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులకు నష్టం చేసేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నందున.. కేసీఆర్‌ను ఓడించగలిగితే.. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయ నాయకత్వం, పాలన తన ఆధీనంలోనే ఉంటుందన్న లక్ష్యంతో ఆయన కుట్రలు పన్నుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోపాటుగా.. తెలంగాణకు కూడా తన నాయకత్వమే అవసరమైందని రుజువు చేసుకునే ప్రయత్నమిది. దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణ నాయకత్వ ఆత్మగౌరవానికి సమస్య లు ఎదురవనున్నాయి. కాంగ్రెస్ ప్రచార ప్రకటనల్లో రాహుల్ పక్కన ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ కిందకు వెళ్లిపోయి.. ఆ స్థానంలో బాబు బొమ్మ పెట్టుకోవాల్సిన దుస్థితి రావడమే ఇందుకు నిదర్శనం.
తన చుట్టూ..
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని.. రాష్ట్రంలోని కీలన నేతలను తనచుట్టూ తిప్పుకోవడమే కీలకంగా చంద్రబాబు ఆలోచనలున్నాయి. గతంలోనూ.. ఎలాగో తంటాలు పడి మోదీని ప్రసన్నం చేసుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ఇంటికెళ్లి అభ్యర్థించి మద్దతు సంపాదించారు. ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తన పని తాను చేసుకోకుండా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి, నిత్యం సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు. దాంతో చంద్రబాబుతోపాటు ఆంధ్రుల పరువు పోయేలా చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రులకు రోజూ ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు.. ఇక్కడ ఏపీ పోలీస్ స్టేషన్లు పెడతామని బెదిరించేవారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కూడా పట్టుబడడంతో.. కేసీఆర్ కాళ్లావేళ్లా పడి.. తనపై కేసు నేరుగా రాకుండా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు చెప్పాపెట్టకుండా విజయవాడ వెళ్లి పోయారు.
కేసీఆర్ పేరెత్తేందుకే భయపడి..
ఆ తర్వాత కేసీఆర్ పేరెత్తేందుకే భయపడ్డారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తలదూర్చి పెత్తనం మొదలుపెట్టారు. ఈయనిచ్చే వందల కోట్ల డబ్బుకు ఆశపడి కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తుకు సన్నద్ధమైందని.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఆరోపిస్తున్నాయి. కారణమేదైనా.. చంద్రబాబు కాంగ్రెస్‌తో అనైతిక, విలువలు లేని పొత్తు పెట్టుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఆంధ్రలో ఓటమి భయంతోనో, అవినీతి కేసులు వస్తాయన్న భీతితోనో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. పైగా మోదీతో ఏదో ప్రమాదం వచ్చిందని ప్రచారం ఆరంభించారు. ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్‌ను రెచ్చగొడుతున్నారు.
హైదరాబాద్‌లో ఇల్లెందుకో?
కేసీఆర్ వ్యవసాయం క్షేత్రంలో ఇల్లు కట్టుకుంటే.. చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో భారీ ఖర్చుతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. చంద్రబాబు ఆంధ్రలో ఇల్లు కట్టుకోకుండా ఇక్కడ ఉన్న పాత ఇంటిని కూల్చి కొత్త భవంతిని ఎందుకు నిర్మించారో ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతిలో ఏం చేశారన్నదానికి సమాధానం చెప్పకుండా 15 ఏళ్ల క్రితం తాను చేసిన పాలన వల్లే హైదరాబాద్ ప్రజలు బతుకున్నారన్నట్లుగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తున్నారు. అందుకే.. చీమల పుట్టలో వేలు పెట్టినట్లు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలో వేలు పెట్టి, డబ్బు, మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, తామూ దానికి బదులు తీర్చుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పిన చంద్రబాబు.. ఇక్కడ తనకు బెదరింపులు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా బతుకుతున్న సీమాంధ్రులను చంద్రబాబు కొత్త టెన్షన్ పెడుతున్నారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇది ఎటు దారి తీస్తుందోనన్న భయం కలుగుతోంది. పైగా గతంలో వైఎస్, ఇతర సీఎంలు చేసిన పనులను కూడా తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేస్తున్న తీరు జుగుప్స కలిగిస్తోంది.
తెలంగాణను ఏకపక్షంగా ఏలేద్దామనే!
తెలంగాణలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఏపీలో తన పరపతి పెంచుకోవడం, రాహుల్‌ను బుట్టలో వేసుకున్నందున, తెలంగాణలో కూడా తనే పెత్తనం చేయవచ్చన్న తాపత్రయంతో చంద్రబాబు వికృతప్రయోగం చేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎవరు గెలిచినా అది ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉద్రిక్తత కు దారితీసేలా చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. లేకుంటే మళ్లీ ఇరు ప్రాంతాల మధ్య సమస్యలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాయకత్వానికి, తెలంగాణ ప్రజలకు చంద్రబాబు సవాల్ విసురుతున్నారనుకోవాలి. రాజకీయం ప్రజల కోసం కానీ, పదవుల కోసం కాదు. నిత్యం నీతులు చెబుతూ, అదే సమయంలో విలువల్లేని, నీతి లేని రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేయాలనుకునే వారి ఆటకట్టించకపోతే మొత్తం తెలుగు సమాజానికే ముప్పు.
..:: కొమ్మినేని శ్రీనివాసరావు
వారికి వీరికి బాబు మార్క్ వెన్నుపోటు
Published Wed, Dec 5 2018 5:44 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment