
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే చట్టసభలకు పోటీచేస్తున్నానని యువతెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా మగవారే చీరలు కట్టుకొని పరిపాలిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలోఉద్యోగాల కోసం 100 నోటిఫికేషన్లు ఇస్తే 10 నోటిఫికేషన్లు కూడా పూర్తిగా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రధాన అభ్యర్థులను పట్టభద్రుల సమస్యలపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తే ఎవరు స్పందించడం లేదని విమర్శించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి..
‘ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతి సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసేలా చూస్తా. ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేసేలా, నిర్ణీత గడువులోగా నియామకాలు జరిగేలా శాసన మండలిలో చట్టం కోసం ప్రతిపాదిస్తా. ఉద్యోగాల ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తాను. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేరగాళ్లకు వరంలా మారిన సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ సవరణకోసం, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఐఆర్ సకాలంలో వచ్చేలా చూస్తా. జర్నలిస్టుల హక్కులకోసం పోరాడతా. నాకు ప్రతి అంశంపై అవగాహన ఉంది. కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి. అవసరమైతే అసెంబ్లీ ముందు గాని, సీఎం కార్యాలయం ముందు గాని కూర్చుని ప్రజల తరఫున గళం వినిపిస్తా. కాబట్టి అవకాశం ఇవ్వాలి’ అని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి రాణి రుద్రమ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment