ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్
జైపూర్: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జైపూర్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఇండియా ఫౌండేషన్, సర్దార్ పటేల్ పోలీస్ సెక్యూరిటీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉగ్రవాదం, అందుకు సోషల్ మీడియా వినియోగం, సైబర్ దాడులు, చొరబాట్లు, నకిలీ కరెన్సీ వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనిని ప్రారంభించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు.
మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ ఉండరని ఉగ్రవాదులెవరైనా అందరికీ ప్రమాదకరమేనన్న విషయాన్ని పాక్ గుర్తించాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘‘మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మూలం అంతా సరిహద్దుల ఆవలే ఉంది. పాకిస్తాన్ ఐఎస్‌ఐ, సైన్యం ఉగ్రవాదులకు తోడ్పడడం మానుకుంటే దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ఉగ్రవాదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరికలను ప్రోత్సహించేందుకూ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యువతలో విషబీజాలు నాటుతున్నారు. ఇది అందరూ తీవ్రంగా దృష్టిపెట్టాల్సిన అంశం. ఇంతగా పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా దేశాల మధ్య సహకారం అవసరం.’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.