విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేషించండి
పాకిస్తాన్‌కు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హితవు
ప్రాంతీయ సహకారానికి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదమే అవరోధాలు
ఇస్లామాబాద్ ‘షాంఘై సహకార సంఘం’ సదస్సులో స్పష్టీకరణ
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు.
3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి
ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment