ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన విదేశాంగ మంత్రి జైశంకర్
‘కాందహార్ హైజాక్’ ఘటనను గుర్తుచేసుకున్న మంత్రి
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు.
ఏడుగురు హైజాకర్లు చొరబడి..
‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది.
ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో..
అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్‌ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది.
‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను.
ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు.
అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర
మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్‌లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment