ఏవోబీపైనే గురి
* ‘మావో’ల అణచివేతకు మరిన్ని బలగాలు
* విశాఖలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏఒబీ)లో మావోయిస్టు కార్యకలాపాల అణిచివేతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014తో పోలిస్తే మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టంచేసింది. 2014లో 162 జిల్లాల్లో మావోల ప్రభావం ఉంటే.. 2015లో 141 జిల్లాలకు తగ్గిందని వెల్లడించింది. ఇందుకోసం కృషి చేసిన బలగాలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.
చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు తీసుకుంటున్న చర్యలతో మావోలు ఏవోబీని షెల్టర్ జోన్‌గా ఎంచుకునే ప్రమాదం ఉందని, అందువల్ల ఏవోబీలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మావోల అణిచివేతకు రాష్ర్టం విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా బీఎస్‌ఎఫ్ బెటాలియన్‌ను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు, ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాల అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలైపై రాష్ర్ట డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో గురువారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో కేంద్ర హోంమంత్రి సమీక్షించారు.
మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్ మంచి ఫలితాలనిస్తోందని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
కట్టడికి ఉమ్మడి కార్యాచరణ
మావోయిస్టులపై పోరుకు దండకారణ్య పరిధిలోని రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ దిశగా కేంద్రం నిర్దిష్టమైన అడుగువేసింది. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడికి ఉమ్మడి ఆపరేషన్లే మార్గమని స్పష్టం చేసింది. అందుకోసం కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి అని పరోక్షంగా తేల్చిచెప్పింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్దిష్టమైన ప్రణాళికను వివరించినట్లు సమాచారం.
ధీమాగా ఉండటానికి కుదరదు: ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండటానికి వీల్లేదని రాజ్‌నాథ్ హెచ్చరిం చినట్లు సమాచారం. మావోలు ప్రతిపాదిస్తున్న రెడ్ కారిడార్‌లో ఏపీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మావోల ప్రభావిత ప్రాం తాల్లో భద్రతా, అభివృద్ధి అంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుందని సమాచారం.