బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం
కార్యకర్తలను కూడా వదలబోమని మావోల హెచ్చరిక
{పజాకోర్టులో స్పష్టం చేసిన మావోయిస్టు అగ్రనేతలు
జీకేవీధి: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికొస్తే అధికార టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏఓబీ సరిహద్దు చిత్రకొండ అడవుల్లో బుధవారం సాయంత్రం మావోయిస్టుల ఆధీనంలో ఉన్న టీడీపీ నేతల విడుదలపై ప్రత్యేక ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ మన్యంలో నిక్షిప్తమైన బాక్సైట్ ఖనిజాలను వెలికి తీసేందుకు తొలిసారిగా తెలుగుదేశం పార్టీయే బీజం వేసిందని, అప్పటి నుంచి ఈ ప్రాంత గిరిజనులంతా అభద్రతాభావంతో జీవించాల్సి వస్తోందన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారినా బాక్సైట్ తవ్వకాలు మాత్రం కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాయని చెప్పారు.
అధికారంలో ఉన్న వారు బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుతామంటుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేతలు తవ్వకాలను అడ్డుకుంటామంటూ వ్యతిరేకించడం పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ ఉద్యమాలు చేసి అధికారంలోకి రాగానే ఆదివాసీ దినోత్సవం నాడే సీఎం చంద్రబాబు నాయుడు బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీస్తామని ప్రకటన చేసి తన నిరంకుశత్వాన్ని నిరూపించుకున్నారని మండిపడ్డారు. మన్యంలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలపై ఏ ఒక్కరూ కూడా గునపం దింపినా అధికార టీడీపీ కార్యకర్తలను సైతం ఆదివాసీ గిరిజనులు మన్నించబోరని మావోయిస్టునేతలు హెచ్చరించారు.
ప్రాణత్యాగాలకైనా సిద్ధమే : బాక్సైట్ తవ్వకాల వల్ల అటవీ సంపద అంతరించిపోతే తాము జీవించడానికి వేరే దారి లేదని ప్రజాకోర్టులో సుమారు 20 గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అధికార టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఒక్కరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని గిరిజనులు కోరారు.