Manyam Visakhapatnam
-
ఏవోబీపైనే గురి
* ‘మావో’ల అణచివేతకు మరిన్ని బలగాలు * విశాఖలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏఒబీ)లో మావోయిస్టు కార్యకలాపాల అణిచివేతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014తో పోలిస్తే మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టంచేసింది. 2014లో 162 జిల్లాల్లో మావోల ప్రభావం ఉంటే.. 2015లో 141 జిల్లాలకు తగ్గిందని వెల్లడించింది. ఇందుకోసం కృషి చేసిన బలగాలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు తీసుకుంటున్న చర్యలతో మావోలు ఏవోబీని షెల్టర్ జోన్‌గా ఎంచుకునే ప్రమాదం ఉందని, అందువల్ల ఏవోబీలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మావోల అణిచివేతకు రాష్ర్టం విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా బీఎస్ఎఫ్ బెటాలియన్‌ను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు, ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాల అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలైపై రాష్ర్ట డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో గురువారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో కేంద్ర హోంమంత్రి సమీక్షించారు. మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్ మంచి ఫలితాలనిస్తోందని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కట్టడికి ఉమ్మడి కార్యాచరణ మావోయిస్టులపై పోరుకు దండకారణ్య పరిధిలోని రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ దిశగా కేంద్రం నిర్దిష్టమైన అడుగువేసింది. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడికి ఉమ్మడి ఆపరేషన్లే మార్గమని స్పష్టం చేసింది. అందుకోసం కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి అని పరోక్షంగా తేల్చిచెప్పింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్దిష్టమైన ప్రణాళికను వివరించినట్లు సమాచారం. ధీమాగా ఉండటానికి కుదరదు: ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండటానికి వీల్లేదని రాజ్‌నాథ్ హెచ్చరిం చినట్లు సమాచారం. మావోలు ప్రతిపాదిస్తున్న రెడ్ కారిడార్‌లో ఏపీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మావోల ప్రభావిత ప్రాం తాల్లో భద్రతా, అభివృద్ధి అంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుందని సమాచారం. -
మావోలపై సమరం
ప్రతిఘటనకు సిద్ధమవుతున్న పోలీసులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్న కేంద్రం తొలిసారిగా విశాఖలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు బలపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నిఘా వర్గాలు, పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను అణచి వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ వచ్చారు. మావోయిస్టుల ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులతో గురువారం సమావేశమయ్యారు. తొలిసారిగా కేంద్ర మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ద్వారా మావోలపై సమర శంఖం పూరించారు. భారీ మార్పులు : ఏపీ ఏజెన్సీలో 11 పోలీస్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది, మరో మూడు పోలీస్ స్టేషన్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మావోల అణిచివేతకు పోలీస్ ఫోర్స్‌ను పెంచాలని భావిస్తున్నారు. మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్లను మరింతగా విస్తరించనున్నారు. ఆర్ఆర్పీ-2 ప్రాజెక్టు కింద 1200 కిలోమీటర్ల రహదారులు ఏజెన్సీలో నిర్మించనున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. నిజానికి ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో 11 టవర్లు నిర్మాణం పూర్తయింది. ప్రత్యేకంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బెటాలియన్‌ను ఇచ్చేందుకు కూడా కేంద్రం సానుకూలంగా ఉంది. సబ్‌ప్లాన్ నిధులతో ఏజెన్సీ రహదారులను కూడా విస్తరించనున్నారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కేంద్రం అందించనుంది. విస్తరణకు మావోల యత్నం : ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా చెబుతుంటారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఇప్పటికే షెల్టర్ జోన్‌గా ఉన్న ఏవోబీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ఆసరాగా చేసుకుని గిరిజనులకు చేరువై ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన్యంలో అలజడులకు రంగం సిద్ధమవుతోందని తెలుసుకున్న కేంద్రం ప్రతిఘటనకు పూనుకుంది. ఏవోబీ, ట్రై జంక్షన్లో బలోపేతం: ఏవోబీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలి (ట్రై జంక్షన్)లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి మావోయిస్టులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయుధాలను, ఆయుధ తయారీ సామాగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ బయట నుంచే మావోలకు ఆయుధ సామాగ్రి అందుతోందనుకున్న పోలీసులకు మన్యంలోనే అలాంటి ఏర్పాటు చేసుకున్నారనే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు భద్రత విధానాల్లోనూ మార్పులు చేస్తున్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టులు తిరుగులేని శక్తిగా ఎదగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. -
అరణ్య రోదన!
పెరిగిన బీట్లు.. అరకొర సిబ్బంది రాష్ట్ర విభజనతో రెండేళ్లుగా నిలిచిన నియామకాలు ఏజెన్సీలో అడవికి రక్షణ కరవు విశాఖ మన్యంలో అడవికి రక్షణ కరువైంది. వృక్ష సంపదను.. జంతుజాలాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అటవీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా రెండేళ్లుగా అటవీ సిబ్బంది నియామకం అసలు జరగడంలేదు. మరో పక్క బీట్లు పరిధి పెరిగిపోయింది. దీంతో ఉన్న సిబ్బందే ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది పెంపు ప్రతిపాదన అరణ్య రోదనగా మిగిలింది. కొయ్యూరు: రాష్ట్ర విభజన కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అటవీ శాఖకు రక్షణ లేకుండా పోయింది. 2013లో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి 52 బీట్లను 117కు పెంచారు. 25 సెక్షన్లను 40 వరకు చేశారు. అయితే సిబ్బందినియామకాలు మాత్రం జరగలేదు. ఫలితంగా ఎక్కువ దూరంలో విస్తరించిన బీట్లలో కాపలా కాయడం అటవీ సిబ్బందికి కష్టంగా మారింది. నర్సీపట్నం అటవీ డివిజన్లో ఐదు లక్షల హెక్లార్ల వరకు అటవీ సంపద విస్తరించి ఉంది.ఒక్కో బీట్ 15 కిలోమీటర్ల పొడవు ఉంటే సిబ్బందికి కాపలాకాయడం పెద్ద కష్టం కాదు. కానీ అదే బీట్ 40 కిలోమీటర్లు దాటి ఉంటే కాపలా అసాధ్యం. దీనిని గుర్తించి బీట్ల సంఖ్య రెట్టింపు చేశారు. ఏడు రేంజ్‌లను ఎనిమిది చేశారు. అయితే ఆ స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదు. జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్ విస్తీర్ణంలో చాలా పెద్దది. దీని పరిధిలో మర్రిపాకలు, కేడీపేట, నర్సీపట్నం, ఆర్వీ నగర్, చింతపల్లి, లోతుగెడ్డ, సీలేరు, పెదవలస రేంజ్‌లున్నాయి. పెదవలస రేంజ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. అదే విధంగా బీట్లను 117కు పెంచాలని ప్రతిపాదించారు. దీనికి ఆమోదం వచ్చింది. సెక్షన్లు పెంపు కూడా ఫలించింది. పెంచిన బీట్లు, సెక్షన్లకు అదనంగా సిబ్బందిని నియమిస్తారని అంతా భావించారు. ఇటు నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ రాష్ట్ర విభజన జరగడంతో ప్రక్రియ ఆగిపోయింది. సిబ్బంది లేకుంటే ముప్పే ఎంత దూరంలో బీట్ పరిధి ఉన్నా దానిని కాపలాకాయాల్సి వస్తోంది. లేకుంటే కలప అక్రమంగా తరలిపోతుంది. నర్సీపట్నం అటవీ డివిజన్లో రూ.కోట్ల విలువ చేసే సంపద ఉంది. నిఘా సరిగా లేకుంటే ఆ సంపదకు ముప్పు తప్పదు. సిబ్బంది తక్కువ కారణంగా రంగురాళ్ల క్వారీలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. అటవీ సంప ద కొన్ని ప్రాం తాల్లో తరలిపోతోంది. దానిని నిలువరించాలంటే పెంచిన బీట్ల సంఖ్యకు అనుగునంగా సిబ్బందిని నియమించాల్సి ఉంది. విభజనే కారణం రాష్ట్ర విభజన కారణంగా మొత్తం భర్తీ ప్రక్రియ నిలిచింది. లేకుంటే ఈ పాటికి అంతా పూర్తయ్యేది. బీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతీ చోట కూడా బీట్లను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే అటవీ సంపదకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. - డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ట్రైనీ డీఎఫ్‌వో, కేడిపేట రేంజ్ -
బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం
కార్యకర్తలను కూడా వదలబోమని మావోల హెచ్చరిక {పజాకోర్టులో స్పష్టం చేసిన మావోయిస్టు అగ్రనేతలు జీకేవీధి: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికొస్తే అధికార టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏఓబీ సరిహద్దు చిత్రకొండ అడవుల్లో బుధవారం సాయంత్రం మావోయిస్టుల ఆధీనంలో ఉన్న టీడీపీ నేతల విడుదలపై ప్రత్యేక ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ మన్యంలో నిక్షిప్తమైన బాక్సైట్ ఖనిజాలను వెలికి తీసేందుకు తొలిసారిగా తెలుగుదేశం పార్టీయే బీజం వేసిందని, అప్పటి నుంచి ఈ ప్రాంత గిరిజనులంతా అభద్రతాభావంతో జీవించాల్సి వస్తోందన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారినా బాక్సైట్ తవ్వకాలు మాత్రం కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాయని చెప్పారు. అధికారంలో ఉన్న వారు బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుతామంటుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేతలు తవ్వకాలను అడ్డుకుంటామంటూ వ్యతిరేకించడం పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ ఉద్యమాలు చేసి అధికారంలోకి రాగానే ఆదివాసీ దినోత్సవం నాడే సీఎం చంద్రబాబు నాయుడు బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీస్తామని ప్రకటన చేసి తన నిరంకుశత్వాన్ని నిరూపించుకున్నారని మండిపడ్డారు. మన్యంలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలపై ఏ ఒక్కరూ కూడా గునపం దింపినా అధికార టీడీపీ కార్యకర్తలను సైతం ఆదివాసీ గిరిజనులు మన్నించబోరని మావోయిస్టునేతలు హెచ్చరించారు. ప్రాణత్యాగాలకైనా సిద్ధమే : బాక్సైట్ తవ్వకాల వల్ల అటవీ సంపద అంతరించిపోతే తాము జీవించడానికి వేరే దారి లేదని ప్రజాకోర్టులో సుమారు 20 గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అధికార టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఒక్కరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని గిరిజనులు కోరారు. -
వదంతులతో బేజారు
మన్యంలో అనవసర అలజడులు అపరిచిత వ్యక్తుల సంచారంపై కలకలం దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పుకార్లేనంటున్న పోలీసులు పాడేరు: విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. జి. మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారిస్తున్నారనే వదంతులపై ఇటీవల ప్రచారం ఎక్కువైంది. 15 రోజులుగా మన్యంలో ఇవే పుకార్లు. ఈ నేపథ్యంలో గిరి జన గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు రెట్టింపవుతున్నాయి. జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ కుమ్మరిపుట్టులో గత వారం ఇదే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలంలోని గిరిజన ప్రాంతమైన కల్యాణపులోవలో కొంతమంది మంగళవారం ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో దాడి చేసి కొత్తకోట పోలీసులకు అప్పగించారు. పిల్లలను ఎత్తుకెళ్ళేందుకే దొంగలు సంచరిస్తున్నారనే అనుమానాలు గిరిజనుల్లో ఎక్కువైంది. వదంతుల నేపథ్యంలో అనుకోని విధంగా రోజుకొక సంఘటన మన్యంలో జరుగుతోంది. కార్లలో ఎవరైనా పర్యాటకులు వచ్చినా సరే కలకలం రేగుతోంది. ఇవి వదంతులేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చోరీలు గానీ, దొంగలు పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడం వంటి ఘటనలు జరగలేదంటున్నారు. ఏ పోలీసు స్టేషన్లో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదని ఉదహరిస్తున్నారు. వదంతులను పుట్టిస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మకూడదని, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లైతే వెంటనే ఆయా మండలాల పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక సీఐ ఎన్.సాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతుచిక్కని గిరిజనుడి హత్య...: జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతమైన పినకిల్తారి గ్రామంలో వంజరి పోతురాజు (45) అనే అవివాహితుడైన ఒక గిరిజనుడు గత ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. సామాన్య గిరిజనుడైన వంజరి పోతురాజును తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. తల భాగాన్ని పట్టుకుపోయారు. 4 రోజులైనా పోతురాజు హత్యకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. హత్యకు గురైన పోతురాజు తలభాగం ఆచూకీ కూడా పోలీసులకు లభించ లేదు. ఈ సంఘటన గిరిజనుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.