వదంతులతో బేజారు
మన్యంలో అనవసర అలజడులు
అపరిచిత వ్యక్తుల సంచారంపై కలకలం
దాడులకు పాల్పడుతున్న సంఘటనలు
పుకార్లేనంటున్న పోలీసులు
పాడేరు: విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. జి. మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారిస్తున్నారనే వదంతులపై ఇటీవల ప్రచారం ఎక్కువైంది. 15 రోజులుగా మన్యంలో ఇవే పుకార్లు. ఈ నేపథ్యంలో గిరి జన గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు రెట్టింపవుతున్నాయి. జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ కుమ్మరిపుట్టులో గత వారం ఇదే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలంలోని గిరిజన ప్రాంతమైన కల్యాణపులోవలో కొంతమంది మంగళవారం ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో దాడి చేసి కొత్తకోట పోలీసులకు అప్పగించారు. పిల్లలను ఎత్తుకెళ్ళేందుకే దొంగలు సంచరిస్తున్నారనే అనుమానాలు గిరిజనుల్లో ఎక్కువైంది. వదంతుల నేపథ్యంలో అనుకోని విధంగా రోజుకొక సంఘటన మన్యంలో జరుగుతోంది. కార్లలో ఎవరైనా పర్యాటకులు వచ్చినా సరే కలకలం రేగుతోంది. ఇవి వదంతులేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చోరీలు గానీ, దొంగలు పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడం వంటి ఘటనలు జరగలేదంటున్నారు. ఏ పోలీసు స్టేషన్‌లో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదని ఉదహరిస్తున్నారు. వదంతులను పుట్టిస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మకూడదని, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లైతే వెంటనే ఆయా మండలాల పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక సీఐ ఎన్.సాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంతుచిక్కని గిరిజనుడి హత్య...: జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతమైన పినకిల్తారి గ్రామంలో వంజరి పోతురాజు (45) అనే అవివాహితుడైన ఒక గిరిజనుడు గత ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. సామాన్య గిరిజనుడైన వంజరి పోతురాజును తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. తల భాగాన్ని పట్టుకుపోయారు. 4 రోజులైనా పోతురాజు హత్యకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. హత్యకు గురైన పోతురాజు తలభాగం ఆచూకీ కూడా పోలీసులకు లభించ లేదు. ఈ సంఘటన గిరిజనుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.