అరణ్య రోదన!
పెరిగిన బీట్లు.. అరకొర సిబ్బంది
రాష్ట్ర విభజనతో రెండేళ్లుగా నిలిచిన నియామకాలు
ఏజెన్సీలో అడవికి రక్షణ కరవు
విశాఖ మన్యంలో అడవికి రక్షణ కరువైంది. వృక్ష సంపదను.. జంతుజాలాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అటవీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా రెండేళ్లుగా అటవీ సిబ్బంది నియామకం అసలు జరగడంలేదు. మరో పక్క బీట్లు పరిధి పెరిగిపోయింది. దీంతో ఉన్న సిబ్బందే ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది పెంపు ప్రతిపాదన అరణ్య రోదనగా మిగిలింది.
కొయ్యూరు: రాష్ట్ర విభజన కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అటవీ శాఖకు రక్షణ లేకుండా పోయింది. 2013లో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి 52 బీట్లను 117కు పెంచారు. 25 సెక్షన్లను 40 వరకు చేశారు. అయితే సిబ్బందినియామకాలు మాత్రం జరగలేదు. ఫలితంగా ఎక్కువ దూరంలో విస్తరించిన బీట్లలో కాపలా కాయడం అటవీ సిబ్బందికి కష్టంగా మారింది. నర్సీపట్నం అటవీ డివిజన్‌లో ఐదు లక్షల హెక్లార్ల వరకు అటవీ సంపద విస్తరించి ఉంది.ఒక్కో బీట్ 15 కిలోమీటర్ల పొడవు ఉంటే సిబ్బందికి కాపలాకాయడం పెద్ద కష్టం కాదు. కానీ అదే బీట్ 40 కిలోమీటర్లు దాటి ఉంటే కాపలా అసాధ్యం. దీనిని గుర్తించి బీట్ల సంఖ్య రెట్టింపు చేశారు. ఏడు రేంజ్‌లను ఎనిమిది చేశారు. అయితే ఆ స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదు. జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్ విస్తీర్ణంలో చాలా పెద్దది. దీని పరిధిలో మర్రిపాకలు, కేడీపేట, నర్సీపట్నం, ఆర్‌వీ నగర్, చింతపల్లి, లోతుగెడ్డ, సీలేరు, పెదవలస రేంజ్‌లున్నాయి. పెదవలస రేంజ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. అదే విధంగా బీట్లను 117కు పెంచాలని ప్రతిపాదించారు. దీనికి ఆమోదం వచ్చింది. సెక్షన్లు పెంపు కూడా ఫలించింది. పెంచిన బీట్లు, సెక్షన్లకు అదనంగా సిబ్బందిని నియమిస్తారని అంతా భావించారు. ఇటు నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ రాష్ట్ర విభజన జరగడంతో ప్రక్రియ ఆగిపోయింది.
సిబ్బంది లేకుంటే ముప్పే
ఎంత దూరంలో బీట్ పరిధి ఉన్నా దానిని కాపలాకాయాల్సి వస్తోంది. లేకుంటే కలప అక్రమంగా తరలిపోతుంది. నర్సీపట్నం అటవీ డివిజన్‌లో రూ.కోట్ల విలువ చేసే సంపద ఉంది. నిఘా సరిగా లేకుంటే ఆ సంపదకు ముప్పు తప్పదు.
సిబ్బంది తక్కువ కారణంగా రంగురాళ్ల క్వారీలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. అటవీ సంప ద కొన్ని ప్రాం తాల్లో తరలిపోతోంది. దానిని నిలువరించాలంటే పెంచిన బీట్ల సంఖ్యకు అనుగునంగా సిబ్బందిని నియమించాల్సి ఉంది.
విభజనే కారణం
రాష్ట్ర విభజన కారణంగా మొత్తం భర్తీ ప్రక్రియ నిలిచింది. లేకుంటే ఈ పాటికి అంతా పూర్తయ్యేది. బీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతీ చోట కూడా బీట్లను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే అటవీ సంపదకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది.
- డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ట్రైనీ డీఎఫ్‌వో, కేడిపేట రేంజ్