మావోలపై సమరం
ప్రతిఘటనకు సిద్ధమవుతున్న పోలీసులు
ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్న కేంద్రం
తొలిసారిగా విశాఖలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు బలపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నిఘా వర్గాలు, పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను అణచి వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ వచ్చారు. మావోయిస్టుల ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులతో గురువారం సమావేశమయ్యారు. తొలిసారిగా కేంద్ర మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ద్వారా మావోలపై సమర శంఖం పూరించారు.
భారీ మార్పులు : ఏపీ ఏజెన్సీలో 11 పోలీస్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయింది, మరో మూడు పోలీస్ స్టేషన్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మావోల అణిచివేతకు పోలీస్ ఫోర్స్‌ను పెంచాలని భావిస్తున్నారు. మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌లను మరింతగా విస్తరించనున్నారు. ఆర్‌ఆర్‌పీ-2 ప్రాజెక్టు కింద 1200 కిలోమీటర్ల రహదారులు ఏజెన్సీలో నిర్మించనున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. నిజానికి ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో 11 టవర్లు నిర్మాణం పూర్తయింది. ప్రత్యేకంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) బెటాలియన్‌ను ఇచ్చేందుకు కూడా కేంద్రం సానుకూలంగా ఉంది. సబ్‌ప్లాన్ నిధులతో ఏజెన్సీ రహదారులను కూడా విస్తరించనున్నారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కేంద్రం అందించనుంది.
విస్తరణకు మావోల యత్నం : ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా చెబుతుంటారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఇప్పటికే షెల్టర్ జోన్‌గా ఉన్న ఏవోబీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ఆసరాగా చేసుకుని గిరిజనులకు చేరువై ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన్యంలో అలజడులకు రంగం సిద్ధమవుతోందని తెలుసుకున్న కేంద్రం ప్రతిఘటనకు పూనుకుంది.
ఏవోబీ, ట్రై జంక్షన్‌లో బలోపేతం: ఏవోబీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలి (ట్రై జంక్షన్)లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి మావోయిస్టులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయుధాలను, ఆయుధ తయారీ సామాగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ బయట నుంచే మావోలకు ఆయుధ సామాగ్రి అందుతోందనుకున్న పోలీసులకు మన్యంలోనే అలాంటి ఏర్పాటు చేసుకున్నారనే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు భద్రత విధానాల్లోనూ మార్పులు చేస్తున్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టులు తిరుగులేని శక్తిగా ఎదగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది.