సత్వర సాయం అందించండి | Rajnath Singh in his appeal to the funds to be released soon - ys jagan | Sakshi
Sakshi News home page

సత్వర సాయం అందించండి

Published Mon, Nov 10 2014 1:02 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

సత్వర సాయం అందించండి - Sakshi

సత్వర సాయం అందించండి

కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయండి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
 
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజ లను ఆదుకునేందుకు సత్వర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితులకు కేంద్ర సాయం అర్థిస్తూ పార్టీ ఎంపీలతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లతో కలిసి మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి అశోకారోడ్డులోని రాజ్‌నాథ్ నివాసానికి చేరుకున్నారు. అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం నుంచి రావాల్సిన సాయం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.అన్ని అంశాలను పేర్కొంటూ ప్రతినిధి బృందం తరఫున రాజ్‌నాథ్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘హుద్‌హుద్ తుపాను నష్టానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇచ్చిన లేఖనే.. విపత్తు చర్యలకు సంబంధించిన మంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌సింగ్‌కూ అందించాం. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో ఈ రోజుకీ కరెంటు రాని పరిస్థితి ఉందని, సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగటం లేదని అన్ని విషయాలు వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు.
 పనిచేసే వారిపై బురదచల్లుతున్నారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, తుపాను బాధితులను ఆదుకునే విషయంలో పెట్టడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. బాబు తన పార్టీ నాయకులకు పదవులు ఇప్పించుకోవడంపై ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలపై ప్రధానిని కలవడం లేదని ఎండగట్టారు. ‘‘ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఇంతవరకు ప్రధానమంత్రిని కలిసి తుపాను సాయానికి సంబంధించి అభ్యర్థించింది లేదు. మంత్రివర్గంలోకి సుజనాచౌదరిని ఎలా తీసుకుపోవాలన్నదానిపైనే నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధ్యాస, ఆ శ్రద్ధ.. తుపాను బాధితులపై పెట్టి ఉంటే కనీసం రాష్ట్రానికి మంచి జరిగేది. బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చిత్తశుద్ధితో పనిచేయరు. పనిచేసే వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు’’ అని తూర్పారబట్టారు.

బాధితులకు ప్రభుత్వ సాయం సున్నా...

‘గతంలో ఏ ప్రభుత్వం చేయనంత త్వరగా హుదుహుద్ బాధితులకు సహాయక చర్యలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కదా..?’ అని ప్రశ్నించగా.. ‘‘ఒక్కసారి ఉత్తరాంధ్రకు పోయి చూస్తే, ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఈ రోజుకి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి చూస్తే కనీసం విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. తుపాను బాధిత గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం సున్నా. మేం పది రోజులు ప్రతీ గ్రామాన్ని సందర్శించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదని గ్రామస్తులే చెప్పారు. రూపాయికి కిలో చొప్పున ఇచ్చే బియ్యం 25 కిలోలు ఇచ్చారు. అది కూడా అన్ని గ్రామాల్లో, అందరికీ ఇవ్వలేదు...’’ అని జగన్ విమర్శించారు. బాధితులకు సహాయం అందిం చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.

అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతాం...

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటార’ని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది.. దీంతో ఆయన భయపడి అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కేసులను మేం గట్టిగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధిస్తాం’’ అని జగన్ బదులిచ్చారు.

వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి అందించిన వినతిపత్రంలోని ముఖ్యాం శాలు ఇవీ...  
 ఇటీవల సంభవించిన హుదుహుద్ తుపానుతో భారతదేశ తూర్పు తీర ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేకించి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నంపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. గత మూడేళ్లలో నీలం, లెహర్, పైలీన్ వరుస తుపాన్లతో పాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్  ప్రాణ, ఆస్తి, పశు నష్టాల్ని మిగిల్చాయి.
 పంటలతో పాటు ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్వల్పంగా చర్యలు తీసుకుంది. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకైనా నేటీకి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. రుణాల రీషెడ్యూల్ కానీ, వడ్డీ మాఫీ కానీ చేయలేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు.

 హుద్‌హుద్ వచ్చిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మూడో రోజే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ఎంతో ఉదారంగా రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. కోస్తా ఆంధ్రా జిల్లాలపై వరుసగా విరుచుకుపడిన నాలుగో తుపాను ఇది. గత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తుపాన్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు, మత్స్యకారులు, గ్రామీణులంతా మీ సహాయం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం బలవంతంగా చేసిన రాష్ట్ర విభజనతో నష్టపోయి ఉన్నారు.మీరు సహాయం అందించకపోతే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి.

తప్పుడు హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా, అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14 వేల కోట్ల స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ పార్టీ నాయకులు.. రుణాలు, వడ్డీలు కట్టొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత తామే బ్యాంకులకు చెల్లిస్తామని ప్రతి రైతుకు, ప్రతి స్వయం సహాయక గ్రూపు సభ్యురాలికి చెప్తూ వచ్చారు. ఈ హామీలను చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ల మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు కొత్త రుణాలకు అనర్హులయ్యారు. వీటి పర్యవసానంగా, పంట బీమా సైతం రెన్యువల్ కాలేదు. ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ కాలేదు, పంటల బీమా అందే పరిస్థితి లేదు. ఈ తుపానుతో పంటనష్టపోయిన రైతులకు ఇప్పు డు పంటల బీమా సైతం అందని దయనీయమై న పరిస్థితి ఏర్పడింది. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే, బాధితులకు కొంత ఊరట లభిస్తుంది.
 
 
 సాయంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థనలు..

► పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి  అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి.


►తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి.

►వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి.

►రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి.

►పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులు ప్రభుత్వమే సేకరించేం దుకు హామీ ఇవ్వాలి.

►హుద్‌హుద్ తుపాను సందర్భంగా 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9, 10, 11, 12, 13, 15 జీవోల్లో ఇచ్చిన
►మీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలి.

►భూపీందర్‌సింగ్ హూడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకొని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి.

►చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి.

►ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించాలి.  పూర్తిగా దెబ్బతిన్న వారికి  పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

►ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి.

►తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5,000 ఆర్థిక సాయం ఇవ్వాలి.

►బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి పరిహారాన్ని చెల్లించాలి.

►వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement