అసెంబ్లీలో సమస్యల తుఫాన్ | assembly problems | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సమస్యల తుఫాన్

Published Thu, Dec 18 2014 1:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అసెంబ్లీలో సమస్యల తుఫాన్ - Sakshi

అసెంబ్లీలో సమస్యల తుఫాన్

హుద్‌హుద్, రుణమాఫీ, పీసీపీఐఆర్, బాక్సైట్‌లే ప్రధానాంశాలు
గళమెత్తేందుకు సిద్ధమవుతున్న జిల్లా ప్రజాప్రతినిధులు
నేటి నుంచి శాసన సభ, మండలి సమావేశాలు

 
విశాఖపట్నం: గురువారం నుంచి ప్రారంభం కోబోతున్న శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావించడానికి ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. హుద్‌హుద్ తుపాను సాయం పంపిణీలో జరుగుతున్న జాప్యంతోపాటు రుణమాఫీ, పీసీపీఐఆర్, పెట్రో కారిడార్ వంటి తీవ్ర సమస్యలు జిల్లావాసులను వేధిస్తున్నాయి. వీటిపై ఘాటైన చర్చ జరిగే అవకాశముంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ విశాఖ వేదికగా ఈ నెల 5న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహా ధర్నా చేసిన విషయం విదితమే. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో పాటు హుద్‌హుద్, ఇతర ప్రధాన అంశాలపై గళమెత్తేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నారు.

మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు హుద్‌హుద్ అనంతరం నెలకొన్న పరిస్థితులు.. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు.. పరిహారం పంపిణీలపై మంత్రులతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా హుద్‌హుద్‌పైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చిన ప్రభుత్వం రూ.9,337 కోట్ల తక్షణ సాయం కావాలని కోరుతూ కేంద్రానికి నివేదించింది. తుఫాన్ మర్నాడే తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన కేంద్రం చివరకు రూ.680 కోట్లతోనే సరిపెట్టింది. ఒక్క మన జిల్లాలోనే 1.48 లక్షల ఇళ్లు దెబ్బతినగా, 85 వేల ఎకరాల్లో పంటలు సర్వనాశనమయ్యాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ పరిహారం అందిన పాపాన పోలేదు.
 అలాగే పీసీపీఐఆర్‌పై ఈనెల 18వ తేదీన తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వందలాది గ్రామాలకు చెందిన వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు.

ఇక కాలుష్య కారక పరిశ్రమలకు కేంద్రమైన పెట్రో కారిడార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రాష్ర్టం దుందుడుకుగా వ్యవహరిస్తుండడంతోపాటు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలే లక్ష్యంగా ఐబాస్-2014 పేరిట విశాఖలో నిర్వహించిన బాక్సైట్ సదస్సు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల్లో స్థానికంగా ప్రజలకు ఇచ్చిన హామీలపై గళమెత్తేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు.
 
 బాక్సైట్ భూముల సమస్యపై మాట్లాడతా


 బాక్సైట్ భూములను కాజేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది. ఈ లక్ష్యంతోనే ఇటీవల విశాఖలో ఐబాస్-2014 నిర్వహించింది. ఈ భూముల్లో నివసిస్తున్న వందలాదిమంది గిరిజనులకు అక్కడే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రస్తావిస్తా. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములకు పట్టాలివ్వాలని కోరతా. కొండకుమ్మర్లను ఎస్టీలో చేర్చే విషయాన్ని ప్రస్తావిస్తా. అటవీశాఖ అడ్డంకులతో నిలిచిన రోడ్ల నిర్మాణం.. ఇందిరమ్మ ఇళ్లకు పేరుకుపోయిన బకాయిలు విడుదల వంటి అంశాలపై చర్చిస్తా
 -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు
 
అస్తవ్యస్త తుపాను సర్వేపై ధ్వజం

హుద్‌హుద్ తుఫాన్  నష్టాన్ని గుర్తించేందుకు.. లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సర్వే అస్తవ్యస్థంగా సాగింది. దెబ్బతిన్న ఇళ్లు..పంటలను కనీసం ఈ సర్వే టీమ్‌లు చూసిన పాపాన పోలేదు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారి పేర్లను, ఇళ్లను రాసుకుని వెళ్లిపోయారు. కనీసం దెబ్బతిన్న మూగ జీవాలు, పశువులపాకలను కూడా పట్టించుకున్న పాపానపోలేదు. ఈ అవకతవకలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. 
  -బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల
 
 జీవీఎంసీ నిర్లక్ష్యంపై నిలదీస్తా...


 అనకాపల్లి మున్సిపాల్టీని జీవీఎంసీలో విలీనం చేశారు. అనకాపల్లి స్థాయికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు విషయంలో కానీ.. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారంలో కానీ జీవీఎంసీ అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
 -పీలా గోవిందు, ఎమ్మెల్యే, అనకాపల్లి
 
 హౌస్ కమిటీ సమస్యను ప్రస్తావిస్తా

 గాజువాక నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా నెలకొన్న ఈనాం భూముల (హౌస్ కమిటీ) సమస్య పరిష్కరించాలని అసెంబ్లీలో కోరుతాను. విశాఖస్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కొనుగోలు, అమ్మకాలపై నెలకొన్న నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని చర్చిస్తా
 -పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, గాజువాక
 
 పంచగ్రామాల సమస్య ప్రస్తావన

 సింహాచలం పంచగ్రామాల భూసమస్యల పరిష్కార విషయమై చర్చిస్తా. పరవాడ కాలుష్య గ్రామాల ప్రజల తరలింపు అంశంతోపాటు ఆనందపురం-అనకాపల్లి మధ్య జాతీయ రహదారి పనులు ప్రారంభించే విషయాన్ని ప్రస్తావిస్తా.       
 -బండారు సత్యనారాయణమూర్తి,ఎమ్మెల్యే, పెందుర్తి
 
 చిట్టివలస జ్యూట్‌మిల్లు సమస్య ప్రస్తావిస్తా..


 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్రమ లాకౌట్‌తో మూతపడిన చిట్టివలస జ్యూట్ మిల్లును తెరిపించాలన్న అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఈ మిల్లు మూతపడడం వలన ఆరువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి ఘాట్‌రోడ్ నిర్మాణంతోపాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తా.
 -గంటా శ్రీనివాసరావు,
 రాష్ర్ట మానవవనరుల శాఖ మంత్రి
 
 ఇళ్ల సమస్యపై చర్చిస్తా...

 ఎంపికైన 1882మంది అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తా. ఇందుకోసం అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా. ఆదర్శ మున్సిపాల్టీగా నర్సీపట్నాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా
 -చింతకాయల అయ్యన్నపాత్రుడు,
 రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి
 
 రుణమాఫీపై రణం

 ప్రసహనంగా మారిన రైతు రుణమాఫీ విషయాన్ని మండలిలో గట్టిగా ప్రస్తావిస్తా. 20 శాతం రుణ మాఫీ చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతుండగా, ఆ మొత్తం రైతులకు రుణాలపై ఉన్న వడ్డీకి కూడా సరిపోవడంలేదు. 50 వేల లోపు రుణాలున్న వారికి ఒకేసారి మాఫీ చేస్తామని  చెప్పినప్పటికీ ఏ ఒక్కరికీ పట్టుమని పదివేలు కూడా జమ కావడం లేదు.
 -డీవీస్‌ఎన్ రాజు, ఎమ్మెల్సీ
 
 హుద్‌హుద్ సాయంపై నిలదీస్తా...

 హుద్‌హుద్ తుఫాన్ వల్ల ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో కాఫీ, మిరియాలు, సిల్వర్ ఓక్ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి పరిహారం అందలేదు. తుఫాన్‌లో ఎక్కువగా మృత్యువాతపడింది అరకు నియోజకవర్గానికి చెందిన వారే. వారి కుటుంబాలను కనీసం పరామర్శించకుండా వెళ్లిన చంద్రబాబును నిలదీస్తా. ఏజెన్సీలో హాస్టల్ విద్యార్థులకు స్వెట్టర్లు,తెల్లకార్డులన్న గిరిజనులందరికి రగ్గులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా.
 -కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్యే, అరకు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement