Hudhud storms
-
స్వైన్‌విహారం
వేగంగా విస్తరిస్తున్న వైరస్ కాలు బయటపెట్టాలంటేనే భయం ముందస్తు మందుల కోసం వెదుకులాట అరకొర చర్యలతో సరిపెడుతున్న అధికారులు విశాఖపట్నం: ఆర్ధిక రాజధాని.. సిటీ ఆఫ్ డెస్టినీ..ఇలా విశాఖ జిల్లాను, మహా నగరాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు మన పాలకులు. కానీ అంతటి ప్రాశస్త్యాన్ని నిలబెట్టేందుకు మా త్రం ప్రయత్నించడం లేదు. కొన్ని నెలల క్రి తం హుద్‌హుద్ తుపాను విశాఖను కకావిక లం చేసింది. పచ్చదనాన్ని తుడిసిపెట్టేసింది. భారీ ఆస్థి నష్టాన్ని కలిగించింది. ఆ భయానక విలయం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. హైదారాబాద్‌లో విశాఖలో అత్యంత వేగంగా స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో జిల్లా వాసుల్లో మళ్లీ కలవర ం మొదలైంది. జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అరకొర ఏర్పాట్లు, సమీక్షలు మినహా ప్రభుత్వం, అధికారులు చేస్తున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. హుద్ హుద్ తుపాను తర్వాత విశాఖ వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అప్పుడే హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ముందుగా తీరం కోతకు గురయ్యింది. మునుపెన్నడూ లేనంత భారీగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ఆర్ కే బీచ్ నుంచి, సాగర్‌నగర్ వరకూ తీరం భయపెడుతోంది. కట్టడాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. తీరం కోతను అడ్డుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. అధ్యయనాలంటూ కాలయాపన చేస్తోంది. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని తీర ప్రాంత వాసులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్య తీరకుండానే స్వైన్‌ఫ్లూ వచ్చిపడింది. హైదరాబాద్ వంటి మైదాన నగరాలతో పోల్చితే, సముద్ర తీర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభణ అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయినా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యింది. నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న స్వైన్‌ఫ్లూని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే విమానాశ్రయాలు, బస్, రైల్వే స్టేషన్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే వైరస్‌ను జిల్లాలో అడుగుపెట్టకుండా అడ్డుకునే అవకాశం ఉండేది. అది ఎలాగూ చేయలేదు. వైరస్ వచ్చాకైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. నాలుగేళ్ల బాలుడుకి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని గుర్తించినా మేల్కోలేదు. చివరికి ఆ బాలుడికి వైద్యం చేసిన వైద్యురాలు కూడా అస్వస్థకు గురయ్యారంటే నిర్లక్ష్యం స్థాయి ఏ మేరకు ఉందో అర్ధమవుతోంది. బాలుడికి స్వైన్‌ప్లూ నిర్ధారణయ్యాక మంత్రులు కేజీహెచ్‌లో కాసేపు తిరిగి వచ్చేశారు. తర్వాత మరో ఇద్దరికి ప్లూ సోకింది. శనివారం సమీక్ష జరుపానని చెప్పిన మంత్రి గం టా శ్రీనివాసరావు ఆస్పత్రికి మొఖం చాటేశారు. శనివారం జాయింట్ కలెక్టర్ జనార్ధన్ నివాస్ సమీక్ష మినహా స్వైన్‌ప్లూపై యుద్దప్రాతిపధికన అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు జనం స్వైన్‌ప్లూ భారిన పడకుండా ముందస్తు మందులేమైనా ఉన్నాయా అని మెడికల్ దుకాణాలకు పరుగులుదీస్తున్నారు. కానీ ఎక్కడా నివారణ మందులు లేవు. హోమియో గుళికలతో ప్రయోజనం ఉంటుందని భావించి వాటిని కొందరు వాడుతున్నారు. అవీ అందరికీ దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖానికి మాస్క్‌లు వేసుకుని తిరగడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఏం చేయాలో చెప్పే వారు లేరు. స్వ్వైన్ఫ్లూ అనుమానిత మహిళ మృతి విశాఖ మెడికల్: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో చికి త్స పొందుతున్న విజయనగరం మహిళ(45) శనివారం మృతి చెందింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమెను గత నెల 29(జనవరి)న రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చగా, పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఆమెలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వ్యాధి నిర్థారణ కోసం ఆమె గొంతు నుంచి సేకరించిన లాలాజల న మూనాలను హైదరాబాద్ పంపిన విషయం విదితమే. వెంటిలేటర్‌పై స్వైన్‌ఫ్లూ చికిత్స కొనసాగిస్తుండగా ఆమె మృతి చెందడం, వ్యాధి నిర్థారణ నివేదిక ఇంకా అందకపోవడం ఆమె మృతి స్వైన్‌ఫ్లూ మృతా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడి పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఆ బాలుడికి డిశ్చార్జ్ చేసినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు. బులిటెన్ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిన వారు.. 1. అక్కయ్యపాలెం అబీద్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి-సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ప్లూతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. 2. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన 32ఏళ్ల మహిళ-రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. అనుమానిత లక్షణాలున్నవారు.. 1. కొత్తరోడ్డుకు చెందిన 56ఏళ్ల మహిళ- ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. 2. గాజువాకకు చెందిన 38ఏళ్ల వ్యక్తి-ైప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయిన వారు.. 1. ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడు స్వైన్‌ప్లూ భారి నుంచి కోలుకున్నాడు. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
విశాఖకు పండుగ
నేటినుంచి ఉత్సవ్ మూడు రోజుల పాటు నిర్వహణ సర్వాంగ సుందరంగా విశాఖ {పత్యేక కార్యక్రమాల కనువిందు విశాఖ అర్బన్: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్‌హుద్ తుపాను ఛాయలు కనిపించని విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో వేదికలను ముస్తాబు చేస్తోంది. విశాఖ పర్యాటకాభివృద్ధికి, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ఈ విశాఖ ఉత్సవ్‌ను వేదికగా చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశాఖ ఉత్సవ్ వేడుకలు జరిగే ప్రాంతాల రూపురేఖలు మార్చేశారు. ప్రతి వేదికను విభిన్నంగా, ప్రత్యేక సెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ వద్ద కైలాసగిరిని తలపించే సెట్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేదికపై ఒకేసారి వంద మంది కళాకారులు ప్రదర్శనల్చినా తట్టుకునే స్థాయిలో స్టేజ్‌ను నిర్మించారు. అక్కడే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన ఎనిమిది దేవాలయాల నమూనాలను నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, వేద పారాయణం, కచేరీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాక్షేత్రం, వుడా పార్కు, కైలాసగిరి, మధురవాడలో ఉన్న జాతర ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి వేదిక వద్ద తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పే కళలు, నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు కార్యక్రమాలతో పాటు సినీతారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆట, పాటలతో పాటు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించే హాస్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకుల కోసం ఆర్కే బీచ్ నుంచి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వివిధ సంస్థలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఒకవైపు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ ఉత్సవ్ వేడుకలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్ వద్ద ప్రారంభించనున్నారు. 24వ తేదీన సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు రానున్నారు. ఉత్సవాలు చివరి రోజు 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పతంగుల వేడుక విశాఖపట్నం-కల్చరల్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం సాయంత్రం గాలిపటాల వేడుక నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకలను ప్రారంభించారు. వుడా, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, మహిళలకు ఉచితంగా గాలిపటాలను అందజేశారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.బాబూరావునాయుడులు పతంగులను ఎగరవేశారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాము లై విశాఖ సంస్కృతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని సూచించారు. -
హుద్‌హుద్ పరిహారం పంపిణీ వారం రోజుల్లో పూర్తి
ఇప్పటికే రూ.249.2 కోట్ల పంపిణీ లక్షా 3వేల మందికి అకౌంట్లు లేవు అకౌంట్ నంబర్లు ఇస్తే వెంటనే జమ చేస్తాం వెబ్సైట్లో పరిహారం పంపిణీ వివరాలు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 4.8లక్షల మంది బాధితుల్లో ఇప్పటికే సుమారు 3.70లక్షల మందికి రూ.249.20కోట్ల పరిహారం పంపిణీ చేశామన్నారు. మరో లక్షా 3వేల మంది సరైన అకౌంట్ నంబర్లు లేక పరిహారం జమ చేయలేదన్నారు. వారిని గుర్తించి అకౌంట్ నంబర్లు సేకరిస్తున్నామన్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా సాయం పంపిణీ జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూరుచేసిన ఏడేసి లక్షల చొప్పున చనిపోయిన 45 మంది కుటుంబీకులకు పంపిణీ చేశామన్నారు. తుపాను తర్వాత మరో ఎనిమిది డెత్కేసులురాగా, వాటిలో నలుగురు తుపాను వల్ల చనిపోయినట్టుగా నిర్ధారణ కావడంతో వారికి కూడా పరిహారానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దెబ్బతిన్న ఇళ్లతో పాటు దుస్తులు, సామాన్లు, పెట్టీషాపులు కోల్పోయిన 1.55లక్షల మందికి రూ.82.44కోట్లు విడుదలైతే, 1,18,499 మందికి రూ.64.05 కోట్లు జమ చేశామన్నారు. వ్యవసాయ పంటలు దెబ్బతిన్న 1,52,806 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 46.46కోట్లు విడుదలైతే, ఇప్పటి వరకు 1,28,271 మందికి రూ.40.42కోట్ల మేర జమచేశామన్నారు. ఇక 1,84,507 మంది ఉద్యానవన రైతులకు రూ.161.56కోట్లు విడుదలకాగా, ఇప్పటి వరకు 1,35,715 మందికి రూ.101.29 కోట్లు జమ చేశామన్నారు. పాడిరైతులకు రూ.19.22కోట్లు విడుదల కాగా, ఇప్పటి వరకు 1756 మందికి రూ.15.51కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. వలలు, బోట్లు దెబ్బతిన్న 3993మంది మత్స్యకారులకు రూ.8.07కోట్లు విడుదల కాగా, రూ.3.50కోట్లు పంపిణీ చేశామన్నారు. హుద్‌హుద్ తుపాను పరిహారం పంపిణీపై ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించామని, ఆ వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితాతో పాటు వారికెంతనష్టం జరిగింది?, వారి అకౌంట్లో ఎంత పరిహారం జమైందో కూడా చూసుకోవచ్చునన్నారు. మిగిలినవారు సమీపంలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ అకౌంట్, ఆధార్ నంబర్లు ఇసే ్త24 గంటల్లోనే పరిహారం జమ అవుతుందన్నారు. స్వైన్‌ఫ్లూకు 900 కేసులకు తగిన మందులు సిద్ధం స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. కనీసం 800 కేసులకుతగిన మందులు సిద్ధంగా ఉంచామని, మరో వంద కేసులకు అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టామన్నారు. కేజీహెచ్‌తో పాటు అన్ని రిఫరల్ ఆస్పత్రుల వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. -
సాయం..మోర్
వైపరీత్యాల నిధి పెంచాలని ప్రభుత్వానికి జీవీఎంసీ లేఖ రూ. 40 కోట్లు కావాలని అభ్యర్థన విశాఖపట్నం సిటీ : హుద్‌హుద్ తుపాను విశాఖలో పచ్చదనంతో పాటు జీవీఎంసీ ఖజానానూ ఊడ్చేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎంత మేర నిధులు కావాలో జీవీఎంసీకి తెలిసేలా చేసింది. దీంతో అధికారులు మేల్కోన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వమిచ్చే రూ.10 కోట్ల సాయం ఏ మాత్రం సరిపోదని తెలుసుకున్నారు. విపత్తులకు ముందస్తుగా పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు భారీగా నిధులు కావాలని గుర్తించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. తుపాను పునరావాస నిధిని రూ.40 కోట్లకు పెంచాలని కోరారు. నగరంలో అధిక శాతం జనం కొండలు, సముద్ర తీర ప్రాంతాల్లో నివాసముంటున్నారని, విపత్తులు సంభవిస్తే నష్టం భారీగానే ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. హుద్‌హుద్ తుపాను వల్ల జీవీఎంసీ నిధులన్నీ ఖర్చయిపోయాయని వివరించారు. భవిష్యత్తు అవసరాలతో పాటు జీవీఎంసీ పరిధి అనకాపల్లి నుంచి భీమిలి వరకు పెరగడంతో నిధిని రూ.10 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెంచాల్సిందిగా కోరారు. 22 నుంచీ ఆడిట్ జీవీఎంసీలో ఈ నెల 22వ తేదీ నుంచి ఆడిట్ యథావిధిగా కొనసాగుతుంది. 2009-10 నుంచి 2013-14 వార్షిక ఆడిట్‌ను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు ఆడిట్ చేస్తున్నారు. తుపాను కారణంగా అక్టోబర్ నెల నుంచి ఆడిట్‌ను ఆపేశారు. తిరిగి మళ్లీ ఈ ఆడిట్‌ను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
సాలూరు : హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం అసెంబ్లీలో హుద్‌హుద్ తుపానుపై జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ మేరకు సమవేశంలో జరిగిన విషయాలను ఆయన ఇక్కడి విలేకరులకు ఫోన్లో వివరించారు. తుపాను సమయంలో ప్ర భుత్వం చేసింది గోరంత అయితే కొండంతగా ప్రచారం చేసుకుందన్నారు. మీడియా కథనాల మేరకు రాష్ట్రంలో రూ. 63 నుంచి రూ. 70 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం 21 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని తేల్చిందన్నారు. పధాని మోదీ రూ. 1000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినా... రూ. 400 కోట్ల మాత్రమే ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 844 కోట్ల మాత్రమే ఖర్చు చేసిందని వి వరించానన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా...రూ. 21 కోట్ల వేల నష్టం జరిగితే అందులో కేవలం ఒకే ఒక్క శాతమైన రూ. 844 కోట్ల ఖర్చు చేయడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పనితీరును తాము విమర్శించడం లేదని, కానీ ఒడిశాలో 2013లో వచ్చిన ఫైలీన్ తుపాను బీభత్సం నుంచికేవలం రెండు రోజుల్లోనే అక్కడి రాష్ట్రం తేరుకుందని, కానీ మనరాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఒక్క విశాఖ పట్టణానికే వారం రోజులు కష్టపడాల్సి వచ్చిందని, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఎన్ని రోజులు పట్టిందో తెలిసిందేనన్నారు. తుపాను సమయంలో ప్రభుత్వం కేవ లం విశాఖను మాత్రమే పట్టించుకున్నారని, మిగిలిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలను విస్మరించారన్నారు. గిరిజనులకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించినా... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసిన ప్రభుత్వం వారికి తుపాను స మయంలో పంట నష్టాన్ని నేరుగా అందించేలా చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. తోటపల్లి నిర్వాసితుల సమస్య ప్రస్తావన సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పారు. గరుగుబిల్లి మండలం నందివానివలస, బాసంగిలో తోటపల్లి ప్రాజె క్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. తోటపల్లి ప్రాజెక్టు పునరావాసంలో భాగంగా ఈ రెండు గ్రామాలకు మూడేళ్ల క్రితం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని ఆమె అసెంబ్లీలో వివరించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని,అలాగని వారికి వేరొకచోట మంచి స్థలం చూపించి ఇళ్లు కట్టించలేదని పేర్కొన్నారు. దీంతో తోట పల్లికి వరద వచ్చినప్పుడల్లా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా స్పం దించినట్టు కూడా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. అలాగే, హుద్‌హుద్ తుపాను సహాయంపై కూడా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ న్నదొరతో పాటు పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ప్రభుత్వం సరిగా సాయం చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, గజపతినగరం ఎమ్మెల్యే కొం డపల్లి అప్పలనాయుడు డీసీసీబీ అక్రమాల్ని, పీఏసీఎస్‌ల అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. రావివలస సొసైటీలో జరిగిన బినామీ రుణాల వ్యవ హారాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్ అయిన దగ్గరి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించా రు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. -
అసెంబ్లీలో సమస్యల తుఫాన్
హుద్‌హుద్, రుణమాఫీ, పీసీపీఐఆర్, బాక్సైట్లే ప్రధానాంశాలు గళమెత్తేందుకు సిద్ధమవుతున్న జిల్లా ప్రజాప్రతినిధులు నేటి నుంచి శాసన సభ, మండలి సమావేశాలు విశాఖపట్నం: గురువారం నుంచి ప్రారంభం కోబోతున్న శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావించడానికి ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. హుద్‌హుద్ తుపాను సాయం పంపిణీలో జరుగుతున్న జాప్యంతోపాటు రుణమాఫీ, పీసీపీఐఆర్, పెట్రో కారిడార్ వంటి తీవ్ర సమస్యలు జిల్లావాసులను వేధిస్తున్నాయి. వీటిపై ఘాటైన చర్చ జరిగే అవకాశముంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ విశాఖ వేదికగా ఈ నెల 5న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మహా ధర్నా చేసిన విషయం విదితమే. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో పాటు హుద్‌హుద్, ఇతర ప్రధాన అంశాలపై గళమెత్తేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నారు. మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు హుద్‌హుద్ అనంతరం నెలకొన్న పరిస్థితులు.. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు.. పరిహారం పంపిణీలపై మంత్రులతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా హుద్హుద్పైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చిన ప్రభుత్వం రూ.9,337 కోట్ల తక్షణ సాయం కావాలని కోరుతూ కేంద్రానికి నివేదించింది. తుఫాన్ మర్నాడే తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన కేంద్రం చివరకు రూ.680 కోట్లతోనే సరిపెట్టింది. ఒక్క మన జిల్లాలోనే 1.48 లక్షల ఇళ్లు దెబ్బతినగా, 85 వేల ఎకరాల్లో పంటలు సర్వనాశనమయ్యాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ పరిహారం అందిన పాపాన పోలేదు. అలాగే పీసీపీఐఆర్‌పై ఈనెల 18వ తేదీన తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వందలాది గ్రామాలకు చెందిన వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఇక కాలుష్య కారక పరిశ్రమలకు కేంద్రమైన పెట్రో కారిడార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రాష్ర్టం దుందుడుకుగా వ్యవహరిస్తుండడంతోపాటు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలే లక్ష్యంగా ఐబాస్-2014 పేరిట విశాఖలో నిర్వహించిన బాక్సైట్ సదస్సు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల్లో స్థానికంగా ప్రజలకు ఇచ్చిన హామీలపై గళమెత్తేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. బాక్సైట్ భూముల సమస్యపై మాట్లాడతా బాక్సైట్ భూములను కాజేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది. ఈ లక్ష్యంతోనే ఇటీవల విశాఖలో ఐబాస్-2014 నిర్వహించింది. ఈ భూముల్లో నివసిస్తున్న వందలాదిమంది గిరిజనులకు అక్కడే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రస్తావిస్తా. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములకు పట్టాలివ్వాలని కోరతా. కొండకుమ్మర్లను ఎస్టీలో చేర్చే విషయాన్ని ప్రస్తావిస్తా. అటవీశాఖ అడ్డంకులతో నిలిచిన రోడ్ల నిర్మాణం.. ఇందిరమ్మ ఇళ్లకు పేరుకుపోయిన బకాయిలు విడుదల వంటి అంశాలపై చర్చిస్తా -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు అస్తవ్యస్త తుపాను సర్వేపై ధ్వజం హుద్‌హుద్ తుఫాన్ నష్టాన్ని గుర్తించేందుకు.. లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సర్వే అస్తవ్యస్థంగా సాగింది. దెబ్బతిన్న ఇళ్లు..పంటలను కనీసం ఈ సర్వే టీమ్‌లు చూసిన పాపాన పోలేదు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారి పేర్లను, ఇళ్లను రాసుకుని వెళ్లిపోయారు. కనీసం దెబ్బతిన్న మూగ జీవాలు, పశువులపాకలను కూడా పట్టించుకున్న పాపానపోలేదు. ఈ అవకతవకలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. -బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల జీవీఎంసీ నిర్లక్ష్యంపై నిలదీస్తా... అనకాపల్లి మున్సిపాల్టీని జీవీఎంసీలో విలీనం చేశారు. అనకాపల్లి స్థాయికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు విషయంలో కానీ.. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారంలో కానీ జీవీఎంసీ అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. -పీలా గోవిందు, ఎమ్మెల్యే, అనకాపల్లి హౌస్ కమిటీ సమస్యను ప్రస్తావిస్తా గాజువాక నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా నెలకొన్న ఈనాం భూముల (హౌస్ కమిటీ) సమస్య పరిష్కరించాలని అసెంబ్లీలో కోరుతాను. విశాఖస్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కొనుగోలు, అమ్మకాలపై నెలకొన్న నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని చర్చిస్తా -పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, గాజువాక పంచగ్రామాల సమస్య ప్రస్తావన సింహాచలం పంచగ్రామాల భూసమస్యల పరిష్కార విషయమై చర్చిస్తా. పరవాడ కాలుష్య గ్రామాల ప్రజల తరలింపు అంశంతోపాటు ఆనందపురం-అనకాపల్లి మధ్య జాతీయ రహదారి పనులు ప్రారంభించే విషయాన్ని ప్రస్తావిస్తా. -బండారు సత్యనారాయణమూర్తి,ఎమ్మెల్యే, పెందుర్తి చిట్టివలస జ్యూట్‌మిల్లు సమస్య ప్రస్తావిస్తా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్రమ లాకౌట్తో మూతపడిన చిట్టివలస జ్యూట్ మిల్లును తెరిపించాలన్న అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఈ మిల్లు మూతపడడం వలన ఆరువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి ఘాట్‌రోడ్ నిర్మాణంతోపాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తా. -గంటా శ్రీనివాసరావు, రాష్ర్ట మానవవనరుల శాఖ మంత్రి ఇళ్ల సమస్యపై చర్చిస్తా... ఎంపికైన 1882మంది అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తా. ఇందుకోసం అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా. ఆదర్శ మున్సిపాల్టీగా నర్సీపట్నాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా -చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి రుణమాఫీపై రణం ప్రసహనంగా మారిన రైతు రుణమాఫీ విషయాన్ని మండలిలో గట్టిగా ప్రస్తావిస్తా. 20 శాతం రుణ మాఫీ చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతుండగా, ఆ మొత్తం రైతులకు రుణాలపై ఉన్న వడ్డీకి కూడా సరిపోవడంలేదు. 50 వేల లోపు రుణాలున్న వారికి ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్కరికీ పట్టుమని పదివేలు కూడా జమ కావడం లేదు. -డీవీస్ఎన్ రాజు, ఎమ్మెల్సీ హుద్‌హుద్ సాయంపై నిలదీస్తా... హుద్‌హుద్ తుఫాన్ వల్ల ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో కాఫీ, మిరియాలు, సిల్వర్ ఓక్ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి పరిహారం అందలేదు. తుఫాన్లో ఎక్కువగా మృత్యువాతపడింది అరకు నియోజకవర్గానికి చెందిన వారే. వారి కుటుంబాలను కనీసం పరామర్శించకుండా వెళ్లిన చంద్రబాబును నిలదీస్తా. ఏజెన్సీలో హాస్టల్ విద్యార్థులకు స్వెట్టర్లు,తెల్లకార్డులన్న గిరిజనులందరికి రగ్గులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా. -కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్యే, అరకు -
స్టార్ క్రికెట్‌కు సర్వంసిద్ధం
హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న సినీతారల క్రికెట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడనున్నాయి. విజయవాడ స్పోర్ట్స్ : హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీమిత్రా గ్రూపు సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న స్టార్ క్రికెట్ కప్‌కు సర్వం సిద్ధమైంది. సినీహీరో రామచరణ్‌తేజ ప్రత్యేక గౌరవ అతిథిగా హాజరయిన శ్రీమిత్ర చౌదరి తెలిపారు. ప్రత్యేక విమానంలో రామ్‌చరణ్‌తేజ ఆదివారం ఉదయం నగరానికి చేరుకుంటారని తెలిపారు. ప్రముఖ సినీనటులు, జబర్దస్త్ ఫేమ్ కామెడీ ఆర్టిస్టులు సందడి చేయనున్నారు. స్టేడియం మ్యాచ్‌కు కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌తో పాటు సెలబ్రెటీలు తమ వలపులు ప్రదర్శించనున్నారు. డ్యాన్స్‌లు, కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రియమణి,రకుల్‌ప్రీత్‌సింగ్, అధ్హాశర్మ, రాశీఖన్నా, నికీషాపటేల్, సన్నిధి, సురభీ, నిఖితాదివ్య వంటి సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విభావరి ఉంటుంది. హంసనందిని, ర జీనా, షాన్వీశ్రీవాస్తవ, కామ్నాజఠ్మలానీ డ్యాన్స్‌లతో యువతను ఉర్రూతలూగించనున్నారు. యాంకర్లు అనసూయ, రేష్మీలు, కామెడీ యాక్టర్లు వేణు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమక్ చంద్రా, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి పాల్గొంటున్నారు. శ్రీకాంత్ ఎలెవన్, తరుణ్ ఎలెవన్ జట్లుతలపడుతున్నాయి. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమ వస్తువులను ప్రమోట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్. శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ . -
ఔరా.. హుద్‌హుద్!
* సముద్ర ఉష్ణోగ్రతల్లో అరుదైన మార్పులు * బలహీనపడడానికి బదులు శక్తిమంతం * ఎన్ఐవో శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి సాక్షి, విశాఖపట్నం: విశాఖతో పాటు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాను ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో అనూహ్య పరిణామాలను సంతరించుకున్నట్లు వెల్లడవుతోంది. సాధారణ పరిస్థితులకు భిన్నంగా ప్రతాపం చూపి శాస్త్రవేత్తలకు సరికొత్త సవాల్ విసిరి, వారిని ఆలోచనల్లో పడేసింది. అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను విశాఖ సమీపంలో తీరాన్ని దాటింది. తుపాన్లు తీరం దాటే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు అది పయనించే మార్గం (సైక్లోన్ ట్రాక్)లో ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా తీవ్ర వాయుగుండంగా మారినప్పుడు సైక్లోన్ ట్రాక్‌లో సముద్ర జలాలు చల్లబడతాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే తుపాను తీవ్రత కూడా పెరుగుతుంది. తగ్గితే బలహీనపడుతుంది. అయితే ఈ హుద్‌హుద్ తీరం దాటడానికి ముందు ఉష్ణోగ్రతల్లో వైవిధ్యం ఉన్నట్టు వాతావరణ నిపుణులు గుర్తించారు. వాస్తవానికి మామూలు రోజుల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తుపాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు అంటే అక్టోబర్ 9న విశాఖలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విభాగం అధికారుల పరిశీలనలో సముద్ర ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలకు పెరిగినట్టు నిర్ధారించారు. ఐదుగురు శాస్త్రవేత్తలు, మరో ఐదుగురు విద్యార్థుల బృందం తుపాను తీరం దాటిన ఐదు రోజుల తర్వాత (అక్టోబర్ 17న) విశాఖపట్నం (కోస్టల్ బ్యాటరీ), తుపాను తీరం దాటిన ప్రాంతంగా భావిస్తున్న పూడిమడక సమీపంలోని అచ్యుతాపురంల నుంచి సముద్రంలోకి 30 కిలోమీటర్ల దూరం బోటులో వెళ్లారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు, లవణ సాంద్రత, ఆక్సిజన్ వంటివి పరిశీలించారు. అప్పట్లో సముద్ర ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీలు ఉన్నట్టు అంచనాకొచ్చారు. అక్టోబర్ 9-12 తేదీల మధ్య సైక్లోన్ ట్రాక్ వెంబడి సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీల తక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అంటే మధ్య బంగాళాఖాతం నుంచి విశాఖ తీరం వరకూ (ట్రాక్ మార్గం) సముద్రజలాలు చల్లగా ఉన్నట్టు గుర్తించారు. పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలను బట్టి హుద్‌హుద్ తుపాను తీవ్ర రూపం దాల్చినా, సైక్లోన్ ట్రాక్ వెంబడి ఉష్ణోగ్రతల తగ్గుదల వల్ల బలహీనపడాలని పేర్కొంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా సైక్లోన్ ఎందుకు బీభత్సం సృష్టిం చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. నివేదికను గోవాలోని తమ హెడ్‌క్వార్టర్‌కు పంపుతామని విశాఖ ఎన్ఐవో సైంటిస్ట్ ఇన్చార్జి డాక్టర్ వి.ఎస్.ఎన్.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడ సమగ్ర పరిశోధన జరిగాక స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తీరం దాటే సమయంలో ఉష్ణోగ్రతలు, సైక్లోన్ ట్రాక్‌లో పరిస్థితిపై పరిశోధిస్తున్నారు. దీంతో పెద్ద, చిన్న తుపాన్లు వచ్చినప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో, ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోగలుగుతారు. -
బాబు తొలి సంతకాలు ‘హుద్‌హుద్’లో కలిశాయి
* ఎమ్మెల్యే కలమట వెంకటరమణ * రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలి పాతపట్నం : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు హుద్‌హుద్ తుపానులో కొట్టుకుపోయాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు రుణమాఫీలు వట్టి బూటకమని అందరికీ తెలుసన్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని వారం రోజులు హడావుడి చేసి ఆ తరువాత అనుబంధ దుకాణాల పేరుతో మరిన్ని మద్యం దుకాణాలు తెరిచిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పింఛనే జీవనాధారంగా బతుకుతున్న వేలాది మంది పింఛన్లు రద్దు చేసిన బాబుకు వారి ఉసురు తగలక తప్పదన్నారు. వివిధ కారణాలతో పాతపట్నం నియోజక వర్గంలో సుమారు 3వేలమంది పింఛన్లు రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజునే మోసాలకు ఎంచుకున్న బాబు నిరంతర విద్యుత్, రూ.2లకు 20లీటర్లు మినరల్ వాటరు ఏమైందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లకు కనిపిస్తున్నవి సింగపూర్ లాంటి రాజధాని, ఇసుక అమ్మకాలేనని ఆరోపించారు. ఇసుక విధానంతో పేదవాడు గూడుకట్టుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గంగు వాసుదేవరావు, ఎన్.లక్ష్మణరావు, ఆర్.రమణ, ఎస్.ప్రభాకరరావు, ఇ.సింహాచలం, ఎ.కర్రెన్న, ఇ.వసంతరావు, బి.అప్పారావు, కె.ఎరకయ్య, ఎన్.సూర్యరావు, జి.లుట్టిబాబు తదితరులు ఉన్నారు. -
విద్యుత్ స్తంభం విరిగిపడి లైన్‌మన్ దుర్మరణం
విశాఖపట్నం : వైర్లు బిగిస్తుండగా విద్యుత్ స్తంభం విరిగిపడిన సంఘటనలో లైన్‌మన్ మృతిచెందాడు. లంకెలపాలెం సమీపంలోని కన్నూరులో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హుద్‌హుద్ తుపానుకు లంకెలపాలెం, అగనంపూడి సెక్షన్ కార్యాలయాల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం తెలిసిందే. వీటిని పునరుద్ధరించేందుకు వారం రోజులక్రితం లంకెలపాలెం సెక్షన్ పరిధిలోని పనుల నిమిత్తం ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం కిష్టాపురం నుంచి 18 మంది లైన్మెన్లు వచ్చారు. వీరిలో ఇ. శివ(20) అనే లైన్‌మన్ వైర్లు బిగిస్తుండగా, స్తంభం విరిగిపోయింది. దీంతో పైనుంచి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతనిని అంగనంపూడి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివ తల్లిదండ్రులు గతంలో చనిపోయారు. శివ మృతితో అతనిపై ఆధారపడ్డ చెల్లి మమత పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ స్తంభాల్లో నాణ్యత లోపం విద్యుత్ స్తంభాల నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. 4ఎంఎం, 6ఎంఎం ఇనుపరాడ్లు, క్రషర్ బుగ్గితో స్తంభాలను తయారు చేస్తున్నారు. గతంలో ఆర్ఈసీఎస్ స్వంతంగా స్తంభాలను తయారు చేసేది. ఇటీవల ఈ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. పనుల్లో నాణ్యత లోపమే స్తంభం విరిగిపోవడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
హుద్‌హుద్ బీభత్సంలోనూ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు ఆశ్చర్యపోతున్న అబ్కారీ శాఖాధికారులు రూ.6 కోట్ల అదనపు ఆదాయం విశాఖపట్నం సిటీ: ‘విశాఖ నగరమంతా హుద్‌హుద్ తుపాను ధాటికి తల్లడిల్లిపోయింది. అంతా కష్టంలో చిక్కుకున్నారు. ఎవరూ మద్యం జోలికి వచ్చే అవకాశం లేదు. ఈ నెల కాస్త అమ్మకాలు తగ్గొచ్చు’... ఇదీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో వేసుకున్న లెక్కలు. అదే నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అమ్మకాలు తగ్గినా ఫర్వాలేదు... వచ్చే నెలలోనైనా సరిగ్గా చూసుకోండంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కానీ అధికారులు ఊహించింది ఒకటైతే విశాఖలో జరిగింది మరొకటి. అనూహ్యంగా అమ్మకాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ సంగతి గుర్తు చేసుకుని ఇంత మద్యం ఎలా అమ్మకాలు జరిగాయోనని సర్వేలు చేసుకుంటున్నారు. తుపానులో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నష్టం జరిగింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు తగ్గాల్సింది పోయి పెరగడమేంటంటూ అబ్కారీ శాఖ ఆశ్చర్యపోతోంది. అసలేం జరిగింది? జిల్లాలో దాదాపు 310 మద్యం దుకాణాలున్నాయి. వీ టన్నింటి ద్వారా నెలకు రూ.90 కోట్ల ఆదాయం వ స్తుందని అంచనా. హుద్‌హుద్ కారణంగా అంత మొ త్తంలో అమ్మకాలు జరిగే అవకాశం లేదని భావించారు. వారం రోజుల పాటు విశాఖ అంధకారంలో ఉండడం, చాలా మద్యం దుకాణాల రేకులు ఎగిరిపోవడం, గోడలు పడిపోవడం, మద్యం గొడౌన్లు కూలిపోవడం కారణంగా వ్యాపారానికి ఎంతో కొంత నష్టం వచ్చి ఉంటుందని అనుకున్నారు. రూ.90 కోట్లు కన్నా ఓ అయిదో పదో కోట్లు తక్కువ రావచ్చని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో రూ.96 కోట్ల మేర అమ్మకాలు సాగండంతో ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలోని మద్యం ప్రియులు దాదాపు 2.36 లక్షల కేసుల మద్యాన్ని గుటుక్కున మింగేశారు. రెండు లక్షల కేసుల మద్యం అమ్మడమే చాలా గొప్ప అనుకున్న తరుణంలో విశాఖ వాసుల మద్యం పట్టు ఏంటో తాజాగా తెలిసొచ్చింది. దీంతో ప్రతి నెలా ఇచ్చే లక్ష్యాన్ని ఈ సారి అబ్కారీ శాఖ విశాఖకు మరింత పెంచే అవకాశముంది. వ్యాపారం లేదనుకున్న సమయంలోనే ఊహించనంత ఆదాయం వచ్చినప్పుడు శీతాకాలంలో మరింత ఎక్కువగా వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ నెల నుంచి మరో 20 శాతం అదనపు వ్యాపార లక్ష్యాన్ని జిల్లాకు నిర్దేశించినట్టు సమాచారం. ఈ మొత్తం అమ్మకాలు పెంచుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రూ.6 కోట్ల మద్యం తాగిందెవరు? జిల్లాలో అధనంగా రూ.6 కోట్ల మద్యం ఎవరు తాగేశారని సర్వే చేస్తున్న అబ్కారీ శాఖకు పొరుగు రాష్ట్రాల నుంచి పనులు కోసం ఇక్కడికి వచ్చిన వారిపైనే అనుమానం కలుగుతోంది. హుద్‌హుద్ తుపాను తర్వాత వివిధ పనులు నిమిత్తం విశాఖ జిల్లాకు వచ్చిన కార్మికులే మద్యం భారీగా సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తుపాను తర్వాత వారం రోజుల వరకూ మంచి నీళ్లే దొరకని పరిస్థితిలో ఈ మద్యాన్నే కార్మికులు, రోజూ వారి కూలీలు ఎక్కువగా కొని ఉంటారని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ , ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో బాటు రాయలసీమ నుంచి వచ్చిన కార్మికులు మస్తుగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. వారు రోజు 10 నుంచి 12 గంటలు పైగా కష్టపడేవారని, అలాంటప్పుడు మద్యం సేవించకపోతే అన్ని గంటలు ఎలా పని చేస్తారని చెబుతున్నారు. -
విద్యుత్ శాఖలో హుదూ‘దుమారం’ !
విజయనగరం మున్సిపాలిటీ: హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. అత్యవసర సేవల్లో ప్రధానమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంత మొత్తంలోనైనా ఖర్చు చేసేందుకు వెనకాడలేదు. సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలనే ఉద్ధేశ్యంతో పనులు చేపట్టారు. ఇదే అదునుగా తీసుకున్న పలువురు అధికారులు నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పనులు ముగిసిన అనంతరం అధికారులు చెబుతున్న లెక్కలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు రూ 10.59 కోట్లు ఖర్చు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు గత నెల రోజుల్లో మొత్తం రూ.10.59 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. సబ్స్టేషన్ల వారీగా కేటాయించిన నోడల్ అధికారులు, ఏఈల చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. విద్యుత్ సామాగ్రి మినహాయించి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వేతనాలు, పునరుద్ధరణ పనులకు వినియోగించిన వాహనాల అద్దె చెల్లింపు, పనులు చేపట్టిన సిబ్బంది, అధికారుల భోజనాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేశారు. పనులు దాదాపు పూర్తికావడంతో ఖర్చుల లెక్కలు తెప్పించేపనిలో పడ్డారు. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ జనరల్మేనేజర్ పి.ఎస్.కుమార్, అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావు, జూనియర్ అకౌంట్స్ అధికారి కాశినాయుడులు మూడు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెక్కలు సర్దుబాటు చేసి ఓచర్లు అందించే పనిలో సంబంధిత అధికారులు తలమునకలై ఉన్నారు. వాస్తవమెంత ? అధికారులు చూపుతున్న లెక్కల్లో వాస్తమెంతో అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునరుద్ధరణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి మొదటిగా... రూ.400 వేతనంతో పాటు భోజన ఖర్చుగా రూ.100 చెల్లించారు. అయితే ఆ మొత్తం చాలదని సిబ్బంది డిమాండ్‌చేయడంతో రూ.600 వేతనంలో పాటు భోజనం కోసం మరో రూ.150 చెల్లించినట్లు లెక్కల్లో పేర్కొన్నారు. ఆ మొత్తమూ చాలదని వేతనం పెంచకుంటే వెళ్లిపోతామని బెదిరించడంతో భోజనంతో కలిపి రూ.813 మొత్తం చెల్లించిననట్టు పేర్కొన్నారు. ఇదీ చాలదనడంతో పనుల చివరి దశలో రోజుకు రూ.813 వేతనంతో పాటు అదనంగా భోజనం కోసం రూ. 150 మొత్తాన్ని అందజేశారు. ఇలా ఎప్పటికప్పుడు సిబ్బంది వేతనాలు పెంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ధేశించిన దాని కన్నా రూ. 200 వేతనం తక్కువ ఇస్తున్నారనంటూ పనులు జరగుతున్న సమయంలో పలువురు సిబ్బంది ఆరోపించారు. ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వేతనాలు చెల్లింపులపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. అయితే ఆ కమిటీ విచారణలో ఏం తేలిందన్న విషయం బయటకు రాలేదు. ఈ విషయంలోనే నోడల్ అధికారుల, ఏఈలు చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా వాహనాల అద్దెల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన జేసీబీలకు డ్రైవర్ బేటాతో సహా రూ.9వేలు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనుల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తెప్పించిన వాహనాలకు రోజుకు రూ. 8 వేలు ఇవ్వగా.. ఒడిశా రాష్ట్రం నుంచి తెప్పించిన వాహనాలకు రూ. 12 వేల వరకు చెల్లించారు. అయితే ఈ వాహనాలు రోజులో ఎంత మేర పని చేశాయి... ఎంత డీజిల్ ఖర్చయిందన్న విషయాల్లోనూ స్పష్టలేదు.సిబ్బందికి భోజనాలు తరలించేందుకు వినియోగించిన వాహనాలు విషయంలోనూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సేవలు కావడంతో ఎటువంటి ముందస్తుప్రణాళికలు లేకుండానే చేపట్టిన పనులకు సంబంధించి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఖర్చు చేసిన రూ. 10.59 కోట్లలో ఎంతమేర నిధులు దుర్వినియోగమయ్యాయి అన్న విషయమై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. -
సత్వర సాయం అందించండి
కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయండి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజ లను ఆదుకునేందుకు సత్వర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితులకు కేంద్ర సాయం అర్థిస్తూ పార్టీ ఎంపీలతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన జగన్మోహన్రెడ్డి రెండో రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లతో కలిసి మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి అశోకారోడ్డులోని రాజ్‌నాథ్ నివాసానికి చేరుకున్నారు. అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం నుంచి రావాల్సిన సాయం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.అన్ని అంశాలను పేర్కొంటూ ప్రతినిధి బృందం తరఫున రాజ్‌నాథ్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హుద్‌హుద్ తుపాను నష్టానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇచ్చిన లేఖనే.. విపత్తు చర్యలకు సంబంధించిన మంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌సింగ్‌కూ అందించాం. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో ఈ రోజుకీ కరెంటు రాని పరిస్థితి ఉందని, సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగటం లేదని అన్ని విషయాలు వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. పనిచేసే వారిపై బురదచల్లుతున్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, తుపాను బాధితులను ఆదుకునే విషయంలో పెట్టడం లేదని జగన్మోహన్రెడ్డి విమర్శించారు. బాబు తన పార్టీ నాయకులకు పదవులు ఇప్పించుకోవడంపై ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలపై ప్రధానిని కలవడం లేదని ఎండగట్టారు. ‘‘ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఇంతవరకు ప్రధానమంత్రిని కలిసి తుపాను సాయానికి సంబంధించి అభ్యర్థించింది లేదు. మంత్రివర్గంలోకి సుజనాచౌదరిని ఎలా తీసుకుపోవాలన్నదానిపైనే నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధ్యాస, ఆ శ్రద్ధ.. తుపాను బాధితులపై పెట్టి ఉంటే కనీసం రాష్ట్రానికి మంచి జరిగేది. బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చిత్తశుద్ధితో పనిచేయరు. పనిచేసే వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు’’ అని తూర్పారబట్టారు. బాధితులకు ప్రభుత్వ సాయం సున్నా... ‘గతంలో ఏ ప్రభుత్వం చేయనంత త్వరగా హుదుహుద్ బాధితులకు సహాయక చర్యలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కదా..?’ అని ప్రశ్నించగా.. ‘‘ఒక్కసారి ఉత్తరాంధ్రకు పోయి చూస్తే, ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఈ రోజుకి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి చూస్తే కనీసం విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. తుపాను బాధిత గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం సున్నా. మేం పది రోజులు ప్రతీ గ్రామాన్ని సందర్శించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదని గ్రామస్తులే చెప్పారు. రూపాయికి కిలో చొప్పున ఇచ్చే బియ్యం 25 కిలోలు ఇచ్చారు. అది కూడా అన్ని గ్రామాల్లో, అందరికీ ఇవ్వలేదు...’’ అని జగన్ విమర్శించారు. బాధితులకు సహాయం అందిం చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతాం... ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటార’ని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది.. దీంతో ఆయన భయపడి అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కేసులను మేం గట్టిగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధిస్తాం’’ అని జగన్ బదులిచ్చారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్మోహన్రెడ్డి అందించిన వినతిపత్రంలోని ముఖ్యాం శాలు ఇవీ... ఇటీవల సంభవించిన హుదుహుద్ తుపానుతో భారతదేశ తూర్పు తీర ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేకించి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నంపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. గత మూడేళ్లలో నీలం, లెహర్, పైలీన్ వరుస తుపాన్లతో పాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్ ప్రాణ, ఆస్తి, పశు నష్టాల్ని మిగిల్చాయి. పంటలతో పాటు ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్వల్పంగా చర్యలు తీసుకుంది. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకైనా నేటీకి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. రుణాల రీషెడ్యూల్ కానీ, వడ్డీ మాఫీ కానీ చేయలేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. హుద్‌హుద్ వచ్చిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మూడో రోజే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ఎంతో ఉదారంగా రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. కోస్తా ఆంధ్రా జిల్లాలపై వరుసగా విరుచుకుపడిన నాలుగో తుపాను ఇది. గత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తుపాన్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు, మత్స్యకారులు, గ్రామీణులంతా మీ సహాయం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం బలవంతంగా చేసిన రాష్ట్ర విభజనతో నష్టపోయి ఉన్నారు.మీరు సహాయం అందించకపోతే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి. తప్పుడు హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా, అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14 వేల కోట్ల స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ పార్టీ నాయకులు.. రుణాలు, వడ్డీలు కట్టొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత తామే బ్యాంకులకు చెల్లిస్తామని ప్రతి రైతుకు, ప్రతి స్వయం సహాయక గ్రూపు సభ్యురాలికి చెప్తూ వచ్చారు. ఈ హామీలను చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ల మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు కొత్త రుణాలకు అనర్హులయ్యారు. వీటి పర్యవసానంగా, పంట బీమా సైతం రెన్యువల్ కాలేదు. ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ కాలేదు, పంటల బీమా అందే పరిస్థితి లేదు. ఈ తుపానుతో పంటనష్టపోయిన రైతులకు ఇప్పు డు పంటల బీమా సైతం అందని దయనీయమై న పరిస్థితి ఏర్పడింది. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే, బాధితులకు కొంత ఊరట లభిస్తుంది. సాయంపై వైఎస్సార్సీపీ అభ్యర్థనలు.. ► పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. ►తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ►వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. ►రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. ►పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులు ప్రభుత్వమే సేకరించేం దుకు హామీ ఇవ్వాలి. ►హుద్‌హుద్ తుపాను సందర్భంగా 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9, 10, 11, 12, 13, 15 జీవోల్లో ఇచ్చిన ►మీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలి. ►భూపీందర్‌సింగ్ హూడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకొని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి. ►చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ►ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించాలి. పూర్తిగా దెబ్బతిన్న వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ►ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి. ►తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5,000 ఆర్థిక సాయం ఇవ్వాలి. ►బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి పరిహారాన్ని చెల్లించాలి. ►వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. -
అంచనాలు మించిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం
హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆదాయం 18.5 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో రూ. 6,915 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 5,835 కోట్లు. హుద్‌హుద్ తుపాను కారణంగా అక్టోబర్ రెండో వారంలో కార్యకలాపాలకు ఆటంకం కలిగినప్పటికీ తాజాగా రైల్వే బోర్డు నిర్దేశించిన రూ. 6,589 కోట్ల లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎస్సీఆర్ తెలిపింది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో సరకు రవాణా భారీగా ఎగియడం, రైలు సర్వీసులను సమర్ధమంతంగా నిర్వహించడం తదితర అంశాల కారణంగా ఇది సాధ్యపడినట్లు వివరించింది. ఈ వ్యవధిలో దాదాపు 21 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు, 65.4 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిపినట్లు తెలిపింది. కొత్తగా భారతి సిమెంట్స్, మైహోమ్ సిమెంట్స్ తదితర సంస్థల సిమెంటు రవాణా జరిపినట్లు ఎస్సీఆర్ పేర్కొంది. మొత్తం మీద ప్రధానమైన సరకు రవాణా విభాగం ద్వారా రూ. 4,810 కోట్లు, ప్రయాణికుల విభాగం నుంచి రూ. 1,784 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది. -
మొక్కల లెక్క చిక్కింది
► లాంటేషన్కు దూరం.. ► స్పాన్సర్ల కోసం వెతుకులాట ► కానరాని ్రప్రూనింగ్ ► చేతులెత్తేస్తున్న సర్కార్ విశాఖపట్నం: నగరంలో మొక్కలు నాటే అంశంపై సర్కారు తొలిరోజుల్లో చేసిన ప్రకటనకూ ఇప్పటి కార్యాచరణకూ పొంతన కుదరడం లేదు. లక్షల్లో మొక్కలు నాటుతామని పదేపదే చెప్పి తాజాగా అంకె కుదించింది. హుద్‌హుద్ తుపాను ఫలితంగా నగరంలో ఐదులక్షలకు పైగా వృక్షసంపద నేలమట్టమైన సంగతి తెలిసిందే. దీంతో పచ్చదనం పునరుద్ధరణకు 10లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టుగా సర్కార్ వెంటనే ప్రకటించింది. ప్రణాళికా బద్ధంగా నాటేందుకు గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించుకుని పిన్పాయింట్స్ను గుర్తిస్తామని చెప్పింది. స్పాన్సర్లు ముందు కొస్తున్నారు.. సంతోషం..తాము చెప్పే వరకు ఏ ఒక్కరూ ఒక్క మొక్క కూడా నాటవద్దని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి నోడల్అధికారిగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రమోహన్ రెడ్డిని నియమించారు. డివిజన్కొక అధికారికి బాధ్యతలు కూడా అప్పగించారు. మొక్కల ఎంపిక బాధ్యతను ఫారెస్ట్, హార్టికల్చర్ డిపార్టుమెంట్‌కు, వాటిని పరిరక్షించే బాధ్యతను జీవీఎంసీకి అప్పగించారు. ఈ సాముహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర, రాష్ర్ట మంత్రులు ప్రారంభింస్తారంటూ ఆర్బాటంగా ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసరికి నిధులు లేమి సాకుతో సర్కార్ వెనుకడుగు వేస్తుంది. గుంత తవ్వకం, మొక్కనాటడం, ట్రీగార్డు ఏర్పాటుకు ఒక్కొక్క మొక్కకు రూ.వెయ్యి ఖర్చవుతుందని అటవీ శాఖ లెక్కలేసింది. ఈ లెక్కన 10లక్షల మొక్కలు నాటాలంటే వందకోట్లు కావాలి. పోనీ కనీసం మూడవ వంతుమొక్కలనాటే బాధ్యతను స్పాన్సర్లకు అప్పగించినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కనీసం రూ.60కోట్ల విడుదలచేస్తే కానీ ముందుకు కదలని పరిస్థితి. పైసా ఇచ్చేదిలేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. శాఖల వారీగా చూసుకోవాలని మెలిక పెట్టింది. ఇప్పటికే పునరావాస కార్యక్రమాల కోసం ఒక్కొక్క శాఖ కోటి నుంచి 2కోట్ల వరకు చేతి చమురువదిలిపోవడంతో ఎవరూ ఈ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. తొలుత 10లక్షల మొక్కలనిచెప్పుకొచ్చిన సర్కార్ ఆతర్వాత లక్షా80వేల మొక్కలని ప్రకటించారు. చివరకు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 62 వేల మొక్కలు, ప్రభుత్వ కార్యాలయలు,సంస్థల్లో మరో 1.18 లక్షల మొక్కలు నాటాలనినిర్ణయించారు. స్పాన్సర్లు కోసం ఎదురుచూపులు ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే ప్రోత్సహించడం తప్ప చేసేది ఏమీ లేదని ఇప్పటికే మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. వనప్రేమికు లెవరైనా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే ఈ మొక్కలను వారి పేరిటే పెంచుతామని ప్రకటించారు. ఇప్పుడు స్పాన్సర్లు కూడా ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, స్వచ్చంద సంస్థలతో పాటు పర్యావరణ ప్రేమికులు ఇప్పటికే నగరంలో స్వచ్చందంగా పెద్దఎత్తునమొక్కలు నాటుతున్నా ప్రోత్సహించే వారుకరువయ్యారు.నేలకొరగగా మిగిలిన వృక్షాలు, చెట్లను బతికించుకునేందుకు ప్రూడింగ్ చేస్తామని..బ్యాక్టీరియాలను చంపేస్తామని..చిగురించే అవకాశం ఉన్న ప్రతీ చెట్టును బతికించుకుందామని సర్కారు చెబుతూ వచ్చింది. ప్రస్తుతం ఆదిశగాప్రయత్నం కన్పించలేదు. -
ఖజానా ఖాళీ
జీవీఎంసీకి హుద్‌హుద్ దెబ్బ వెంటాడుతున్న కాసుల కష్టాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తుపానుకు వెచ్చించిన నిధులొస్తే తప్ప తీరని వెతలు విశాఖపట్నం సిటీ: హుద్‌హుద్ తుపాను మహా నగర పాలక సంస్థ ఖజానాను ఖాళీ చేయించింది. దీంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి మొ త్తాన్ని తుపానుకు ఖర్చు చేసింది. ఇప్పుడా నిధులు సర్కారు నుంచి వెనక్కు వచ్చినా కొంత తేరుకుంటామని సంస్థ భావిస్తోంది. తుపాను సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు, కొందరు ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారి బస, రవాణా, ఆహార పానీయాల కోసం జీవీఎంసీ రూ. 7.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ బిల్లుల మొత్తం రాబట్టేందుకు సర్కారు ఈ బిల్లులను పంపింది. అయితే ఇందులో రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తాజాగా ఆ ఫైల్‌ను ఆర్ధిక శాఖకు పంపింది. నెలనెలా డే అండ్ నైట్ శానిటేషన్ సిబ్బందికి రూ.4.5 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వుంది. ఈ నెల జీతాలు చెల్లించాలంటే జీవీఎంసీకి చెమటలు పడుతున్నాయి. జీవీఎంసీ అకౌంట్లో కొద్దిపాటి మొత్తమే ఉన్నట్లు భోగట్టా. బుల్డోజర్లు, క్రేన్లు, ప్రొక్లైనర్లు, ట్రాన్స్పోర్ట్ చేసే లారీలకు డీజిల్, పెట్రోల్ అవసరాలకే ఈ మొత్తం సరిపోతుంది. వీటికి చెల్లిస్తే అత్యవసర పరిస్థితి వస్తే నిధులెక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. జోన్ 1, 2, 4, 5 కార్యాలయాల్లో పని చేసే కొందరు రెగ్యులర్ సిబ్బందికి మాత్రం శుక్రవారం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, శానిటేషన్, ప్రజా ఆరోగ్య సిబ్బందికి చెల్లించాల్సి వుంది. ఈ నెల 20వ తేదీ వరకూ మిగిలిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు అధికారుల కార్లు, ప్రభుత్వం ఇచ్చిన వాహనాలకు సైతం డీజిల్ లేక కదలడం లేదు. నీటి సరఫరా విభాగంలోని ఉద్యోగులకు దాదాపు రూ. 80 లక్షలు జీతాలు చెల్లించాల్సి వుంది. మలేరియా సిబ్బందికి కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తుఫాన్ సాయం కింద ప్రభుత్వం నుంచి బకాయిలొస్తే తప్ప వీరి వేతనాలకు మోక్షం కలగదు. -
ఆటతో ఆసరా
తెలుగింటిని అలరించే బుల్లితెర స్టార్లు చేతులు కలిపారు. హుదుద్ దెబ్బకు తల్లడిల్లిన బాధితులకు మేమున్నామంటూ బాసటగా నిలిచారు. తమవంతు సాయంగా వారి ఒక రోజు రెమ్యునరేషన్‌ను అందించారు. వారికి సినీ నటులూ జత కలిశారు. రెండు టీమ్‌లుగా విడిపోయి ‘సేవ్ వైజాగ్’ ఫండ్ రైజింగ్ పేరుతో అబ్దుల్లాపూర్‌మెట్ సెయింట్ మేరీ కాలేజీలో క్రికెట్ ఆడారు. కాలేజీ విద్యార్థులు ఆసాంతం ఆస్వాదించిన ఈ మ్యాచ్‌లో టీవీ స్టార్స్ జట్టు.. సినిమా స్టార్స్‌పై విజయం సాధించింది. జబర్దస్త్ రాకెట్ రాఘవ ఆటల్లో అరటి పండులా అలరించాడు. లోహిత్, అనిల్, ప్రదీప్ తదితరులు మధ్య మధ్యలో జోష్ నింపారు. -
వెలుగు కావాలి! వేడి కాదు!!
త్రికాలమ్ విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి. హుద్‌హుద్ తుపాను తీరం దాటినా, దీపావళి పం డుగ గడిచిపోయినా తెలుగునాట గాలిదుమారం, ధ్వని కాలుష్యం మాత్రం తగ్గలేదు. తెలుగు నేతలు కత్తులు దూసి నిప్పురవ్వలు పుట్టిస్తున్నారు. దాయాదుల మధ్య వాగ్యుద్ధం పతాకస్థాయికి చేరుతోంది. తెలంగాణ రైతుల పాలిట దయ్యంగా దాపురించావంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. నాయుడు నేరుగా తలబడకుండా అక్షరా యుధాలు సంధించగల నేర్పరి పరకాల ప్రభాకర్‌ను తిరుగుదాడికి పురమాయిం చారు. తోడుగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘు నాథరెడ్డి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంతరెడ్డి తదితరులు ఉండనే ఉన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి ఎదురుదాడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ సకల కష్టాలూ, నష్టాలూ మరచిపోయి టీవీ చానళ్ళలో రసవత్తరమైన, ఉత్కంఠభరితమైన నాటకం తిలకించి తరిస్తున్నారు. కరెంటు కోతల గురించి తెలంగాణ ప్రజలూ, రైతుల రుణమాఫీ, తుపాను బాధితులకు సహాయక చర్యల గురించి ఆంధ్రులూ తమ ప్రభుత్వాలను ప్రశ్నించే వాతావరణం లేదు. తాజా కలహకారణం శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల ఉన్న విద్యుత్ కేంద్రా లలో ఉత్పత్తి కొనసాగించడం. జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికంటే కిందికి పోతే రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనే ఆందోళన వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడివైపు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అదే పనిచేయాలంటూ రకరకాల ఒత్తిళ్ళు తెస్తున్నది. తెలంగాణ సర్కారు ససేమిరా అంటున్నది. విద్యుదుత్పత్తిని ఆపుచేసి రైతుల ప్రాణాలు తీయలేమంటూ హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ వివా దాన్ని ముఖ్యమంత్రులు ఇద్దరూ చర్చించుకొని పరిష్కరించుకోవాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ మరోసారి హితవు చెప్పారు. ఈ నెల 29న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగబోతోంది. అందులోనూ ఖరారు నిర్ణయం జరగకపోవచ్చు. ఒకవేళ బోర్డు ఎడమవైపు కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నిర్ణయించినా, ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. రెండు వైపులా బలమైన వాదన లు ఉన్న మాట నిజం. ఎవరి వాదన ఏమిటో పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన: 1) శ్రీశైలం నీటి మట్టం 856 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఇంకా నీరు విడుదల చేసే పక్షంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి సరఫరా ఆగిపో తుంది. రాయలసీమకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. 2) జీవో 69, జీవో 107 లకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని వాడుకుంటోంది. 3) రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముందుగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత సాగు నీరు. అనంతరమే విద్యదుత్పత్తికి నీటిని వినియోగించాలి. ఈ చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. 4)నీరు వృథాగా పోయి సాగర్, పులిచింతల జలాశయాలు కూడా నిండి సముద్రం పాలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది? 1) తెలంగాణలో విద్యుత్తు లేకపోతే నీరు లేదు. భూగర్భజలాలపైన ఆధారపడిన ప్రాంతంలో విద్యుచ్ఛక్తి ద్వారానే నీరు పైకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో భూమ్యాకర్షణ శక్తి వల్ల నీరు పారుతుంది. తెలం గాణలో లిఫ్ట్ ఇరిగేషనే శరణ్యం. 2) కృష్ణా జలాలలో నికర జలాలూ, వరద జలాలూ కలిపి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 60 టీఎంసీల దాకా వినియోగించింది. ఇది బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు కేటాయించిన నీటి మొత్తం కంటే ఎక్కువ. 3) జీవో 69ని ఉల్లంఘిస్తున్నామనడం తప్పు. జీవో 107లో ప్రభుత్వం అవసరమని భావిస్తే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే కిందికి పడిపోయినా కూడా నీరు విడుదల చేయవచ్చు (ఇందులో కూడా తాగునీటికీ తర్వాత సాగునీటికీ ప్రాధాన్యం ఇవ్వాలనీ, తర్వాతే విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించాలనీ ఉంది). 4) ఉమ్మడి రాష్ట్రంలో జీవో 107కు భిన్నంగా 854 అడుగులకంటే నీటి మట్టం తగ్గిన తర్వాత కూడా విద్యుదుత్పత్తి చేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? ఎవరి వాదన వారికి న్యాయసమ్మతంగా కనిపిస్తుంది. ఎవరి సమర్థకులు వారికి ఉన్నారు. ఈ పరిస్థితికి నేపథ్యం ఏమిటి? తుపాను బీభత్సం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విద్యుత్ సంక్షోభం సృష్టిం చింది. అంతవరకూ కాస్త మెరుగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అకస్మాత్తుగా విద్యుత్ కొరత ఏర్పడితే అసలే కటకటగా ఉన్న తెలంగాణ గింగిరాలు తిరిగింది. తుపాను తాకిడికి గాజువాక-జేపోర్ లైను కుదేలు కావడంతో రెండు రాష్ట్రాలూ దారుణంగా నష్టపోయాయి. విద్యుచ్ఛక్తి రంగంలో దేశాన్ని ఐదు విభాగాలు చేశారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సదరన్ రీజియన్స్గా విభజించారు. న్యూగ్రిడ్లో దక్షిణాది (సౌత్) మినహా తక్కిన నాలుగు ప్రాంతాలూ అనుసంధానమై ఉన్నాయి. దక్షిణాదితో న్యూగ్రిడ్ అనుసంధానం సంపూర్ణం కాలేదు. ఉత్తరాదిలో మిగులు విద్యుత్తును దక్షిణాదికి రవాణా చేసేందుకు ప్రస్తుతం గాజువాక-జేపోర్, చంద్రాపూర్- రామ గుండం, తాల్చేర్-కోలార్, రాయచూర్-షోలాపూర్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ల ద్వారా మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ రవాణా అవుతోంది. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న మరి నాలుగు లైన్లు పూర్తయితే ఇంకా 10 నుంచి 12 వేల మెగావాట్ల విద్యు త్తు రవాణా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరాదిలో మిగులు ఉన్న విద్యుత్తు వివిధ దక్షిణాది రాష్ట్రాలకు రవాణా అవుతోంది. ఈ ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయాయి. కొత్తగా విద్యుత్తు లభించే అవకాశం లేదు. తుపాను వచ్చే వరకూ తెలంగాణ రాష్ట్రం ఉత్తరాది నుంచి నిత్యం 10 నుంచి 15 మిలియన్ (ఒక మిలియన్ అంటే పది లక్ష లు) యూనిట్ల విద్యుత్తును ఈస్టర్న్ గ్రిడ్ ద్వారా పవర్ ఎక్స్చేంజి నుంచి కొనుగోలు చేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అదే మార్గంలో ఐదు మిలియన్ యూనిట్లు కొనుక్కునేది. గాజువాక-జేపోర్ లైను కుప్పకూలడంతో ఈ రవాణా ఆకస్మికంగా ఆగిపోయింది. తుపాను రావడానికి పూర్వం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా కాస్త నయం. కరెంటు కోత లేకుండా 24 గంటలూ సరఫరా చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ తెలంగాణలో అప్పటికే దాదాపు 30 మిలియన్ యూనిట్ల కొరత పీడిస్తోంది. మూడేళ్ళ వరకూ కోతలు ఉంటాయనీ, ఆ తర్వాత కనురెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండబోదనీ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇవ్వవలసిన పరిస్థితి. ఈస్టర్న్ గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడానికి తోడు సింహాద్రిలో 2,000 మెగావాట్ల ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) విద్యుత్ కేంద్రం తుపాను కారణంగా మూతపడింది. ఈ కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు 53.89: 46.11 నిష్పత్తిలో విద్యుత్తు వాటా రావాలి. ఈ వాటా అందక పోవడంతో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రతరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సైతం విద్యుత్తు సరఫరా కష్టతరమై కోత విధించక తప్పనిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని చిన్న చిన్న ప్రైవేటు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించేవి. అవి కూడా తుపాను దెబ్బకు మూలనపడ్డాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడగా తెలంగాణలో అది 40 మిలియన్ యూనిట్లు దాటింది.. ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడిఎడమల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేయవలసిన అవసరం రెండు రాష్ట్రాలకూ ఏర్పడింది. కుడివైపు (ఏపీ) జలవిద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 770 మెగావాట్లు అయితే ఎడమగట్టు (తెలంగాణ) విద్యుత్ కేంద్ర సామర్థ్యం 900 మెగావాట్లు (ఇందులో 800 మెగావాట్ల మేరకు ఉత్పత్తి జరుగుతోంది). తుపాను తీరం దాటి వెళ్ళిపోగానే రెండు రాష్ట్రాలూ శ్రీశైలం ప్రాజె క్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాయి. నీటి మట్టం తగ్గిపోతుండటంతో ఆందోళన చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి కుడి ప్రాజెక్టు ఉత్పత్తి ఆపు చేయించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గిపోతే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీరు సరఫరా కాజాలదనీ, రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనీ భయం. కుడివైపు ప్రాజెక్టు ఉత్పత్తి నిలుపు చేసినప్పటికీ ఎడమవైపు విద్యుత్ కేంద్రం నుంచి 15 నుంచి 18 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతూనే ఉంది. అప్పటికీ తెలంగాణలో కొరత 20 నుంచి 30 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తిని కొనసాగించి నీటి వాడకం ఆపకపోతే రాయలసీమకు తాగునీటి కొరత, సాగునీటి కొరత ఏర్పడతాయని వివరించారు. ఉమామహేశ్వరరావు విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం మన్నించలేదు. రైతులనూ, పంటలనూ కాపాడుకోవడం కోసం విద్యుదుత్పత్తి కొనసాగించక తప్పదనీ, ఆపేది లేదనీ కుండబద్దలు కొట్టింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 1969లో జారీ చేసిన 69వ నంబరు జీవోనూ, 2006లో వచ్చిన 107 నంబరు జీవోనూ తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిం చిందంటూ ఆరోపించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఏమిటంటే, బచావత్ అవార్డును గౌరవించాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కూడా ఆదేశించిందనీ, బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలలో తెలుగుగంగ ద్వారా చెన్నై పట్టణానికి 15 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల వాటాలలో తలా ఐదు టీఎంసీలు) నీరు వాడుకోవచ్చుననీ, ఇది కాకుండా శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చుననీ, నికర జలాలూ, వరద జలాలూ కలిపి దాదాపు 60 టీ ఎంసీల దాకా ఇంతవరకూ వినియోగించుకున్నారనీ వాదించి ఆంధ్ర ప్రదేశ్ తనకు కృష్ణా ట్రిబ్యూనల్ కేటాయించిన నీటి కంటే ఎక్కువే వినియోగించు కున్నదని తేల్చింది. జలవిద్యుదుత్పత్తిని నిలుపు చేయాలనే నిబంధన 69వ జీవోలో ఎక్కడా లేదనీ, నిజానికి పక్షానికి కనీసం ఆరు టీఎంసీల నీరు వంతున విద్యుదు త్పత్తి కోసం విడుదల చేయాలంటూ ఆ జీవోలో ఉన్నదని తెలంగాణ సర్కారు వాదన. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల కంటే తగ్గకుండా చూడా లనే అంశం కూడా ఇదే జీవోలో ఉంది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో (2006లో) విడుదలైన 107వ నంబరు జీవోలో మాత్రం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని నిర్దేశించారు. అయితే నీటి మట్టం కనీసస్థాయి కంటే తగ్గినా సరే నీటిని వినియోగించడం అత్యవసరమని ప్రభుత్వాలు భావించిన పక్షంలో ఆ విధంగా విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆ జీవోలో కల్పించారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికోసం వినియోగించే నీరు అనంతరం నాగార్జునసాగర్‌కూ, ఆ తర్వాత పులి చింతలకూ, అక్కడి నుంచి కృష్ణా బరాజ్‌కు వెళ్ళి నిల్వ ఉంటాయి కానీ వృథాగా సముద్రంలో కలిసిపోతాయనడం వాస్తవం కాదని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటోంది. పైగా 2006లో 107వ జీవో విడుదలైన దరిమిలా ప్రతి సంవత్సరం శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా జలవిద్యుదు త్పత్తి జరిగింది. ఈ యేడాది మార్చిలో సైతం కనీస నీటిమట్టం కంటే తక్కువ స్థాయిలో ఉన్న దశలో శ్రీశైలం ప్రాజెక్టుకు కుడిఎడమల కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగిందని గుర్తుచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ వాదనలో తెగింపు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలో కొన్ని అసంబద్ధతలూ, ద్వంద్వప్రమాణాలూ ఉన్నాయి. ఒకటి, వైఎస్ హయాంలో రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించేందుకు 107 జీవోను విడుదల చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చింది. ‘గుట్టుగా పెరిగిన నీటి మట్టం’ అంటూ నాటి పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. టీడీపీ జీవో 107 పైన దృశ్యరూపకం రూపొందించి మేలు చేయాల్సిన రాజే కీడు చేస్తున్నాడంటూ, సాగర్, డెల్టా రైతులు ఆందోళన చెందు తున్నారంటూ, డెల్టా అంతా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదంటూ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనాలు పత్రికలలో, టీవీ చానళ్ళలో వచ్చాయి. ఇప్పుడు అదే జీవోను ఉల్లంఘిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. రెండు, ఒకవైపు నీటి విడుదలకు సంబంధించి జీవో 69ని తెలంగాణ ప్రభుత్వం తుచ తప్పకుండా పాటించాలని పట్టుబడుతున్న చంద్ర బాబునాయుడు విద్యుత్ పంపకాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 53కు చట్టబద్ధత లేదని వాదిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర అవస రాల దృష్ట్యా గతంలో జారీ చేసిన జీవోలు చెల్లవన్నది ఆయన వాదన. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి, విద్యుత్తులో వాటాకు సంబంధించిన పాత జీవోలు చెల్లవంటే జీవో 69, జీవో 107 కూడా చెల్లవు మరి. మూడు, శ్రీశైలం నీటి విడుద లను నిలుపు చేయడానికి కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిన చంద్రబాబునాయుడు సీలేరు విద్యుత్ విషయంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులనూ, పవర్ పర్చేజి అగ్రిమెంట్ల (పీపీఏల) విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), సదరన్ రీజినల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ (బెంగళూరు) జారీ చేసిన ఆదేశాలనూ బేఖాతరు చేశారు. చట్టబద్ధత కలిగిన సంస్థల ఆదేశాలను స్వయంగా ఉల్లంఘిస్తూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వం శిరసావహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస కనిపించదు. విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోం ది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలం గాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే రాయలసీమకూ, దక్షిణ తెలంగాణకూ మధ్య శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కారణంగా ద్వేషభావం నెలకొని ఉన్నది. నదీజలాలకూ, విద్యుత్‌కూ మధ్య అవినాభావ సంబం ధం ఉంది. తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ మధ్య విడదీయలేని బంధాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు. ఒకరికి ఒకరు అతుక్కుపోయి పుట్టిన కవల పిల్లలు (సియామీజ్) ఎంత గింజుకున్నా ఎవరిదారిన వారు వెళ్ళలేరు. కలసి కదలాల్సిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కూడా నీరు, విద్యుత్తు అదే విధంగా కట్టిపడ వేశాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నా చేసుకోనట్టు నటించి అసలైన సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఈ సమస్యను విని యోగించుకోవాలనుకుంటే అది వారి ఇష్టం. ఇదే విధంగా కలహించుకుంటూ ఉంటే అందరం నవ్వులపాలవుతాం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం ప్రకటిం చినా, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా దాన్ని అమలుచేయడానికి సీఆర్పీఎఫ్ బల గాలనో, సైన్యాన్నో నియమించవలసిన పరిస్థితులు ఏర్పడితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య శాశ్వత శత్రుత్వం ప్రబలుతుంది. తెలుగుజాతికి తీరని అపకారం జరుగు తుంది. అది ఇద్దరు చంద్రులకీ చెరగని మచ్చ తెస్తుంది. కె. రామచంద్రమూర్తి