హుద్‌హుద్ పరిహారం పంపిణీ వారం రోజుల్లో పూర్తి
ఇప్పటికే రూ.249.2 కోట్ల పంపిణీ
లక్షా 3వేల మందికి అకౌంట్లు లేవు
అకౌంట్ నంబర్లు ఇస్తే వెంటనే జమ చేస్తాం
వెబ్‌సైట్‌లో పరిహారం పంపిణీ వివరాలు
కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్
విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 4.8లక్షల మంది బాధితుల్లో ఇప్పటికే సుమారు 3.70లక్షల మందికి రూ.249.20కోట్ల పరిహారం పంపిణీ చేశామన్నారు. మరో లక్షా 3వేల మంది సరైన అకౌంట్ నంబర్లు లేక పరిహారం జమ చేయలేదన్నారు. వారిని గుర్తించి అకౌంట్ నంబర్లు సేకరిస్తున్నామన్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా సాయం పంపిణీ జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూరుచేసిన ఏడేసి లక్షల చొప్పున చనిపోయిన 45 మంది కుటుంబీకులకు పంపిణీ చేశామన్నారు. తుపాను తర్వాత మరో ఎనిమిది డెత్‌కేసులురాగా, వాటిలో నలుగురు తుపాను వల్ల చనిపోయినట్టుగా నిర్ధారణ కావడంతో వారికి కూడా పరిహారానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దెబ్బతిన్న ఇళ్లతో పాటు దుస్తులు, సామాన్లు, పెట్టీషాపులు కోల్పోయిన 1.55లక్షల మందికి రూ.82.44కోట్లు విడుదలైతే, 1,18,499 మందికి రూ.64.05 కోట్లు జమ చేశామన్నారు. వ్యవసాయ పంటలు దెబ్బతిన్న 1,52,806 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద 46.46కోట్లు విడుదలైతే, ఇప్పటి వరకు 1,28,271 మందికి రూ.40.42కోట్ల మేర జమచేశామన్నారు. ఇక 1,84,507 మంది ఉద్యానవన రైతులకు రూ.161.56కోట్లు విడుదలకాగా, ఇప్పటి వరకు 1,35,715 మందికి రూ.101.29 కోట్లు జమ చేశామన్నారు.
పాడిరైతులకు రూ.19.22కోట్లు విడుదల కాగా, ఇప్పటి వరకు 1756 మందికి రూ.15.51కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. వలలు, బోట్లు దెబ్బతిన్న 3993మంది మత్స్యకారులకు రూ.8.07కోట్లు విడుదల కాగా, రూ.3.50కోట్లు పంపిణీ చేశామన్నారు. హుద్‌హుద్ తుపాను పరిహారం పంపిణీపై ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించామని, ఆ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల జాబితాతో పాటు వారికెంతనష్టం జరిగింది?, వారి అకౌంట్లో ఎంత పరిహారం జమైందో కూడా చూసుకోవచ్చునన్నారు. మిగిలినవారు సమీపంలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ అకౌంట్, ఆధార్ నంబర్లు ఇసే ్త24 గంటల్లోనే పరిహారం జమ అవుతుందన్నారు.
స్వైన్‌ఫ్లూకు 900 కేసులకు తగిన మందులు సిద్ధం
స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. కనీసం 800 కేసులకుతగిన మందులు సిద్ధంగా ఉంచామని, మరో వంద కేసులకు అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టామన్నారు. కేజీహెచ్‌తో పాటు అన్ని రిఫరల్ ఆస్పత్రుల వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.