విద్యుత్ శాఖలో హుదూ‘దుమారం’ !
విజయనగరం మున్సిపాలిటీ: హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. అత్యవసర సేవల్లో ప్రధానమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంత మొత్తంలోనైనా ఖర్చు చేసేందుకు వెనకాడలేదు. సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలనే ఉద్ధేశ్యంతో పనులు చేపట్టారు. ఇదే అదునుగా తీసుకున్న పలువురు అధికారులు నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పనులు ముగిసిన అనంతరం అధికారులు చెబుతున్న లెక్కలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.
విద్యుత్ పునరుద్ధరణకు రూ 10.59 కోట్లు ఖర్చు
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు గత నెల రోజుల్లో మొత్తం రూ.10.59 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. సబ్‌స్టేషన్‌ల వారీగా కేటాయించిన నోడల్ అధికారులు, ఏఈల చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. విద్యుత్ సామాగ్రి మినహాయించి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వేతనాలు, పునరుద్ధరణ పనులకు వినియోగించిన వాహనాల అద్దె చెల్లింపు, పనులు చేపట్టిన సిబ్బంది, అధికారుల భోజనాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేశారు.
పనులు దాదాపు పూర్తికావడంతో ఖర్చుల లెక్కలు తెప్పించేపనిలో పడ్డారు. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ జనరల్‌మేనేజర్ పి.ఎస్.కుమార్, అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావు, జూనియర్ అకౌంట్స్ అధికారి కాశినాయుడులు మూడు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెక్కలు సర్దుబాటు చేసి ఓచర్‌లు అందించే పనిలో సంబంధిత అధికారులు తలమునకలై ఉన్నారు.
వాస్తవమెంత ?
అధికారులు చూపుతున్న లెక్కల్లో వాస్తమెంతో అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునరుద్ధరణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి మొదటిగా... రూ.400 వేతనంతో పాటు భోజన ఖర్చుగా రూ.100 చెల్లించారు. అయితే ఆ మొత్తం చాలదని సిబ్బంది డిమాండ్‌చేయడంతో రూ.600 వేతనంలో పాటు భోజనం కోసం మరో రూ.150 చెల్లించినట్లు లెక్కల్లో పేర్కొన్నారు.
ఆ మొత్తమూ చాలదని వేతనం పెంచకుంటే వెళ్లిపోతామని బెదిరించడంతో భోజనంతో కలిపి రూ.813 మొత్తం చెల్లించిననట్టు పేర్కొన్నారు. ఇదీ చాలదనడంతో పనుల చివరి దశలో రోజుకు రూ.813 వేతనంతో పాటు అదనంగా భోజనం కోసం రూ. 150 మొత్తాన్ని అందజేశారు. ఇలా ఎప్పటికప్పుడు సిబ్బంది వేతనాలు పెంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ధేశించిన దాని కన్నా రూ. 200 వేతనం తక్కువ ఇస్తున్నారనంటూ పనులు జరగుతున్న సమయంలో పలువురు సిబ్బంది ఆరోపించారు. ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో వేతనాలు చెల్లింపులపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. అయితే ఆ కమిటీ విచారణలో ఏం తేలిందన్న విషయం బయటకు రాలేదు. ఈ విషయంలోనే నోడల్ అధికారుల, ఏఈలు చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా వాహనాల అద్దెల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన జేసీబీలకు డ్రైవర్ బేటాతో సహా రూ.9వేలు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
అదేవిధంగా విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనుల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తెప్పించిన వాహనాలకు రోజుకు రూ. 8 వేలు ఇవ్వగా.. ఒడిశా రాష్ట్రం నుంచి తెప్పించిన వాహనాలకు రూ. 12 వేల వరకు చెల్లించారు. అయితే ఈ వాహనాలు రోజులో ఎంత మేర పని చేశాయి... ఎంత డీజిల్ ఖర్చయిందన్న విషయాల్లోనూ స్పష్టలేదు.సిబ్బందికి భోజనాలు తరలించేందుకు వినియోగించిన వాహనాలు విషయంలోనూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అత్యవసర సేవలు కావడంతో ఎటువంటి ముందస్తుప్రణాళికలు లేకుండానే చేపట్టిన పనులకు సంబంధించి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఖర్చు చేసిన రూ. 10.59 కోట్లలో ఎంతమేర నిధులు దుర్వినియోగమయ్యాయి అన్న విషయమై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.