వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటలు
రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధం
ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర
విజయవాడ : సదరన్ పవర్ డిస్కం పరిధిలోని 8 జిల్లాలకు ఈ వేసవిలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమావేశమై క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఆర్‌ఏపీడీఏఆర్‌పీ పథకం తీరుతెన్నులపై సమీక్షించారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. ఈ వేసవిలో వ్యవసాయానికి 7 గంటలు, పరిశ్రమలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తామని చెప్పారు. దీనిలో భాగంగా రూరల్ ప్రాంతంలో ఒక ఫేజ్‌పై 17 గంటలు , మిగిలిన ఏడు గంటలు రెండు ఫేజ్‌ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 4100 మెగావాట్ల డిమాండ్ ఉందని, మే నెల నాటికి ఇది 4700 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసి ఆ మేరకు విద్యుత్ సరపరా చేయటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
షార్ట్‌టైం పవర్ పేరుతో 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టులోని రెండు యూనిట్లలో కొద్ది రోజుల్లో విద్యుదుత్పత్తి మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో సోలార్ సబ్‌స్టేషన్ల ద్వారా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, సీజన్‌లో విండ్‌పవర్ ద్వారా 700 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందన్నారు. 8 జిల్లాల్లో 4 వేల సోలార్ పంపుసెట్లు పంపిణీ చేయనున్నామన్నారు. రూ.5 లక్షల విలువ చేసే పంపుసెట్లను రూ.55 వేలకే రైతుకు అందించనున్నామని, ఇందులో డిస్కం సగానికి పైగా రాయితీ భరిస్తుందన్నారు. రాష్ట్రంలో 2016 మార్చి నాటికి ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు గుంటూరులో 18 లక్షలు, అనంతపురంలో 12 లక్షల బల్బుల పంపిణీ పూర్తయిందన్నారు. ఈ నెల 20 లోగా ఆర్‌ఏపీడీఏఆర్‌పీ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
వేసవిలో రోజంతా విద్యుత్ సరఫరా
Published Sat, Mar 14 2015 12:56 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement