విద్యుత్ ఉద్యోగులకు దసరా ధమాకా!
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా విద్యుత్ శాఖలో భారీ ఎత్తున పదోన్నతులు జరిగాయి. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న 1,200 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతి కల్పించారు. సెలవు రోజులైనప్పటికీ మంగళ, బుధవారాల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు రాత్రింబవళ్లు కసరత్తు జరిపి ఎట్టకేలకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రికార్డులు లభించక ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమాచారం లభించక తొలుత గందరగోళం ఏర్పడినా, పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాతే పకడ్బందీగా పదోన్నతులు కల్పించామని అధికారులు పేర్కొంటున్నారు.
పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఆలస్యం జరిగింది. రిలీవైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఎత్తుగడ వల్ల అనూహ్య పదోన్నతులు రావడంతో టీ విద్యుత్ ఉద్యోగుల్లో పండుగ ఆనందం రెట్టింపైంది. పదోన్నతి కల్పించిన వారికి కొత్త పోస్టింగ్‌లు ఇంకా కేటాయించలేదు. ఏపీ స్థానికత ఉద్యోగుల తొలగింపు ద్వారా ఖాళీ అయిన పోస్టులన్నింటినీ ఈ పదోన్నతుల ద్వారా భార్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఖాళీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆ తర్వాతే రిలీవైన ఏపీ స్థానికత ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మాకూ పదోన్నతులు కావాలి: రిలీవైన ఉద్యోగులు
రిలీవైన ఉద్యోగులు సైతం తమకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలకు జాయినింగ్ రిపోర్టులు సైతం అందజేశారు. తమను సైతం పదోన్నతుల్లో పరిగణించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. మరోవైపు రిలీవైన ఉద్యోగులు సాంకేతికంగా తెలంగాణ ప్రభుత్వంలో తిరిగి చేరినట్లేనని రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఇప్పటికే వారి రాష్ట్ర వాటా కింద 42 శాతం జీతభత్యాలను విడుదల చేసేశామని, దీంతో ఆ ఉద్యోగులు ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.