2014- 2015 సంవత్సరంలో..
గుడుంబా కేసులు 8,952
అరెస్టైన వారు 1400
గుడుంబా ధ్వంసం 1,24,920 లీటర్లు
బెల్లం పానకం ధ్వంసం 41,73,448 లీటర్లు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి విక్రయిస్తున్నారు. గుడుంబా తాగి ఎంతో మంది అమాయకులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దేశీదారుతో సమానంగా గుడుంబా, కల్తీకల్లు వ్యాపారం సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే అక్రమంగా దేశీదారు వ్యాపారం చేస్తుండగా, గుడుంబా మాత్రం జిల్లాలో చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతోంది. గుడుంబా తయారీలో నల్లబెల్లం (చెడిపోయినది), తుమ్మచెక్క, స్పటికం, ఇప్పపువ్వు, అరటితొక్కలు, మురిగిపోయిన కూరగాయాలు, వంటి వ్యర్థ పదార్థాలను వాడుతుంటారు. దీంతో గుడుంబా సేవించిన వారు అనార్యోగానికి గురికాక తప్పదు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది వ్యాపారులు అక్రమ దందాకు దిగుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో అధికం..
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నిర్మల్, ఇచ్చోడ, ఉట్నూర్, ఖానాపూర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో గుడుంబా, కల్తీ కల్లు విక్రయాలు చేస్తున్నారు. గుడుంబా తయారీ కేంద్రాలపై పలుమార్లు అధికారులు దాడులు చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. అనేక మంది శ్రమజీవులు గ్రామాల్లో చీప్‌లిక్కర్ వంటి మద్యాన్ని కొనుగోలు చేయలేక గుడుంబా సేవిస్తూ అనారోగ్యానికి గురవుతున్నారు.
ఆయా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతోపాటు, గుడుంబా తక్కువ ధరకే దొరుకుతుండడంతో చాలా మంది దీనినే తాగుతున్నారు. అంతేకాదు అక్రమంగా తయారు చేస్తున్న కల్తీకల్లు (తెల్లకళ్లు) వ్యాపారంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. జిల్లాలో 2014-15 సంవత్సరంలో 72 కల్తీకళ్లు కేసులు నమోదు చేయగా, 296 లీటర్లు కళ్లు ధ్వంసం చేశారు. 17 మందిని అరెస్టు చేశారు.
ప్రభుత్వ సారాయి యోచనలో ప్రభుత్వం..
కల్తీకళ్లు, గుడుంబ సేవించి అమాయకులు అకాలమరణం చెందుతున్నారని, గుడుంబాను అరికట్టడమా..? లేదా ప్రభుత్వం తరఫున సారాయిని తీసుకురావడమా.? అని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు నిర్ణయించింది. జిల్లాలో అనేకచోట్ల గుడుంబా స్థావరాలు వేళ్లూనుకుని ఉండటం, ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసినా అవి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాకపోవడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
గుడుంబా కిక్కు..
Published Sat, Aug 1 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement
Advertisement