పాలమూరు.. హరితమయం
సిద్ధంచేసిన మొక్కలు 4.50,00,000
తీసిన గుంతలు 8,00,000
నేడు హరితహారం ప్రారంభం
- సాయంత్రం 3గంటలకు ముహూర్తం
- మండలాలు, గ్రామాలకు తరలిన మొక్కలు
- నాటేందుకు అన్ని ఏర్పాట్లు
- ఈ నెల రెండోవారంలో సీఎం వచ్చే అవకాశం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో నాలుగున్నర కోట్ల మొక్కలను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
ఏ మొక్కలు ఎక్కడ ఎన్ని అవసరమో ఇంతకుముందే గుర్తించారు. ఆ మేరకు ఇప్పటికే నర్సరీల నుంచి మండలాలకు మొక్కలను పంపిణీ చేశారు. అయితే మొక్కలు సమృద్ధిగా ఉన్నా అందుకు అనుగుణంగా గుంతలు తవ్వకపోవడంతో ఈ మొక్కలు నాటడం కొద్దిరోజులు ఆలస్యమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లాలో తీసిన గుంతలు 8 లక్షలు ఉండడంతో వాటిలో యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు ఆయా గ్రామ కమిటీలకు బాధ్యత అప్పగించాలని అధికారులు మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో, మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల, బాదేపల్లిలలో, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి భూత్పూర్‌కు సమీపంలోని రామచంద్రమిషన్‌లో మొక్కలు నాటి ప్రారంభిస్తారు. అదేవిధంగా అన్ని మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటిస్తారు. అదేవిధంగా మొక్కల ప్రాధాన్యాన్ని.. జిల్లాలో కుచించుకుపోతున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవశ్యకత తెలియజేసే లక్ష్యంతో విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించనున్నారు.
తొలుత జిల్లాస్థాయిలో హరితహారం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అయితే.. హరితహారం కార్యక్రమంలో పాల్గొనటానికి ఈ నెల రెండో వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర ద్వారా జిల్లాకు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు గ్రామస్థాయిలో మొక్కలు నాటించి.. ఆ తరువాత జిల్లాస్థాయి సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం జిల్లా పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉంది. జూలై 13, 14 తేదీల్లో సీఎం పర్యటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
సీఎం పర్యటన నాటికి జిల్లాలో ఐదున్నర కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అయితే జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడంతో మొక్కలను బతికించుకోవడం శక్తికి మించిన భారం అవుతుందా అన్న భావం ఇటు అధికారుల్లో అటు గ్రామీణ ప్రజల్లో నెలకొంది. మొక్క బతకడానికి అవసరమైన వర్షం పడితే తప్ప హరితహారం జిల్లాలో వేగం పుంజుకునే పరిస్థితి లేదని.. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి సైతం జిల్లా అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హరితహారం ప్రారంభం రోజు మాత్రం విస్తృత సంఖ్యలో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.