హరిత హాహాకారం
- వాడిపోతున్న హరితహారం మొక్కలు
- వర్షాభావంతో నీరు లేక విలవిల
- 50 శాతం మనుగడ కూడా అనుమానమే!
- నర్సరీల్లో మొక్కలపై అటవీ శాఖ కాకి లెక్కలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్న లక్ష్యం వర్షాభావ పరిస్థితుల కారణంగా నెరవేరేలా కన్పించడం లేదు. నాటిన మొక్కలూ నీరు లేక వాడుబారిపోతున్నాయి. అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కనీస స్థాయిలో కూడా మొక్కలు నాటలేదు.
కొన్నిచోట్ల లక్ష్యాన్ని అందుకునే ఉద్దేశంతో మొక్కలు నాటినా అవి వాడిపోతున్నాయి. గ్రామాల్లో తాగునీటికే కటకటలాడుతున్న పరిస్థితుల్లో హరితహారం మొక్కలను సంరక్షించడం తలకుమించిన భారంగా పరిణమించిందని అటవీ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. ఎన్ని మొక్కలు నాటారు, అందులో ఎన్ని బతికి ఉన్నాయనే లెక్కలు కూడా అటవీ శాఖ వద్ద లేవు. జూలైలో హరిత హారం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1.30 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారుల అంచనా. వీటిలో 69 లక్షల మొక్కలు రోడ్ల వెంట, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, హౌజింగ్ కాలనీలు, బీడు భూములు తదితర చోట్ల నాటారు. మిగతా మొక్కలను అటవీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో నాటినట్టు చెబుతున్నారు.
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 45 లక్షలు, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 1.59 లక్షల మొక్కలు నాటినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోడ్ల పక్కన, వివిధ ప్రభుత్వ స్థలాల్లో నాటిన మొక్కలకు కొన్నిచోట్ల ట్యాంకర్ల ద్వారా నీరు పోసి కాపాడే ప్రయత్నం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అటవీ ప్రాం తంలోని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసే అవకాశం లేకపోవడంతో చాలా వరకు ఎండిపోతున్నాయి. ‘సాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే నాటిన మొక్కల్లో పదిశాతం మేర చనిపోతాయి. వర్షాభావం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నాటిన మొక్కలలో 50 శాతం కూడా బతికే అవకాశం లేదు’ అని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
లక్ష్యానికి ఆమడ దూరంలో...
తెలంగాణలో పచ్చదనాన్ని 25.26 శాతం నుంచి 33 శాతానికి పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 40 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అటవీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదిత ర ప్రభుత్వ విభాగాలకు భారీ లక్ష్యం నిర్దేశించినా ముందుకు సాగలేదు.
ఆరంభంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది సమ్మె మూలంగా అంతరాయం ఏర్పడగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఆటంకంగా నిలిచాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా 4,213 నర్సరీల్లో 40 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాలిథీన్ కవర్లు, విత్తనాల సేకరణలో అవకతవకలు జరిగినట్టు ఆరంభంలోనే ఆరోపణలు రాగా, ప్రస్తుతం మొక్కల రకాలు, సంఖ్యలోనూ తేడా వస్తోంది. హరితహారం అమలుకు రూ.325 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఒక్కో మొక్కకు రూపాయి చొప్పున ఖర్చు చేసినట్లు సమాచారం. మొక్కల సంరక్షణకు హరిత కమిటీలు వేసినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. దీంతో హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం ఒక్కరోజు తంతుగానే మారినట్లు విమర్శలు వస్తున్నాయి.