
బహదూర్‌పురా: అడవుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని అటవీ సంక్షేమ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ‘జంగల్ బచావో...జంగల్ బడావో’నినాదంతో అటవీ సంరక్షణకు కృషి చేస్తుందన్నారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో సెప్టెంబరు 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
1984 నుంచి తెలంగాణ రాష్ట్రంలో 21 మంది అటవీ అమరవీరులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారన్నారు. అటవీ అమరవీరుల అంకితభావం, త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకుని అటవీ సంరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పోలీసు శాఖ అనంతరం అత్యధిక ఉద్యోగాలు కలిగిన శాఖ అటవీ శాఖ అని, 4,500 మందికి ఉద్యోగాలు కల్పించామని, మరో 1,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌లు శోభా, రఘువీర్, మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, గ్యాబ్రియల్, పృథ్వీరాజ్, లోకేశ్ జైశ్వాల్, అదనపు పీసీసీఎఫ్‌లు, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.